Begin typing your search above and press return to search.

త‌రిమికొట్టుడు మాట ఇప్పుడేంది నాయిని?

By:  Tupaki Desk   |   26 Jan 2016 10:07 AM GMT
త‌రిమికొట్టుడు మాట ఇప్పుడేంది నాయిని?
X
అంద‌రిని క‌లుపుకొని వెళుతూ.. గ్రేట‌ర్ మీద గులాబీ జెండా ఎగ‌రేయాల‌న్న ప‌ట్టుద‌ల‌తో తెలంగాణ రాష్ట్ర మంత్రి కేటీఆర్ చేస్తున్న ప్ర‌య‌త్నాలు తెలిసిందే. సెటిల‌ర్ల‌న్న మాట‌కు స‌రికొత్త అర్థం చెబుతూ.. తాను కూడా సెటిల‌ర్‌ నేన‌ని చెప్పి హైద‌రాబాద్‌ లో స్థిర‌ప‌డ్డ సీమాంధ్ర ప్రాంతానికి చెందిన వారి మ‌న‌సుల్ని దోచుకునేలా మాట్లాడుతున్నారు. ఇదిలా ఉంటే.. తాజాగా తెలంగాణ రాష్ట్ర హోంమంత్రి చేసిన‌ట్లుగా చెబుతున్న వ్యాఖ్య‌లు ఇప్పుడు క‌ల‌క‌లం రేపుతున్నాయి.

కొన్ని మీడియా క‌థ‌నాల ప్ర‌కారం రిప‌బ్లిక్ డే సంద‌ర్భంగా తెలంగాణ భ‌వ‌న్ లో జాతీయ జెండాను ఆవిష్క‌రించిన అనంత‌రం నాయిని మాట్లాడుతూ పార్టీకి ఇబ్బంది క‌లిగించే వ్యాఖ్య‌లు చేసిన‌ట్లుగా చెబుతున్నారు. నాడు తెల్ల‌దొర‌ల‌ను త‌రిమి దేశానికి స్వాతంత్ర్యం తెచ్చుకోవ‌టం జ‌రిగింద‌ని.. అదే విధంగా తాము ఆంధ్రా దొర‌ల్ని త‌రిమికొట్టి తెలంగాణ రాష్ట్రం తెచ్చుకున్న‌ట్లుగా నాయిని వ్యాఖ్య‌లు చేసిన‌ట్లుగా చెబుతున్నారు.

మ‌రి.. ఈ వ్యాఖ్య‌లు నాయిని నోటి వెంట వ‌చ్చాయా? అన్న‌ది ఇప్పుడు తేలాల్సి ఉంది. ఒక‌వేళ నాయిని ఈ త‌ర‌హా వ్యాఖ్య‌లు చేస్తే మాత్రం గ్రేట‌ర్ ఎన్నిక‌ల్లో ప్ర‌భావం చూపించ‌టం ఖాయ‌మ‌న్న మాట వినిపిస్తోంది. ఒక‌ప‌క్క హైద‌రాబాద్‌ లో స్థిర‌ప‌డ్డ‌ సీమాంధ్ర ప్రాంతానికి చెందిన ప్ర‌జ‌ల్ని ఆక‌ట్టుకునేందుకు కిందామీదా ప‌డుతుంటే.. ఇంకోవైపు నాయిని ఈ త‌ర‌హా వ్యాఖ్య‌లు చేస్తే.. కేటీఆర్ క‌ష్ట‌మంతా బూడిద‌లో పోసిన ప‌న్నీరు కాక మాన‌దు.