Begin typing your search above and press return to search.

కోదండ‌రాం వెనుక న‌క్స‌లైట్లు: టీఆర్ ఎస్‌

By:  Tupaki Desk   |   16 Oct 2017 4:48 AM GMT
కోదండ‌రాం వెనుక న‌క్స‌లైట్లు: టీఆర్ ఎస్‌
X
తెలంగాణ జేఏసీ చైర్మ‌న్ ప్రొఫెస‌ర్ కోదండరాంపై రాష్ట్ర హోంశాఖ మంత్రి నాయిని నర్సింహారెడ్డి మ‌రోమారు విరుచుకుప‌డ్డారు. ముఖ్యమంత్రి కేసీఆర్‌ దేశంలోనే నంబర్ వన్ సీఎంగా పని చేస్తుంటే రాష్ట్రంలో కొందరు జీర్ణించుకోలేకపోతున్నారని ఆరోపించారు. కోదండ‌రాం వెంట నక్సలైట్లు ఉన్నారని, అందుకే తెలంగాణలో ఆయన చేపడతానని చెబుతున్న యాత్రకు అనుమతిని ఇవ్వబోమని హోంమంత్రి వెల్లడించారు. కోదండరాంకు అనుమతి ఇవ్వకూడదని తానే స్వయంగా పోలీసులకు చెప్పానని ఆయన స్పష్టం చేశారు. రాష్ట్రంలో ప్రజల సంక్షేమమే తమకు ప్రాధాన్యమని అరాచక శక్తులకు తెలంగాణలో అవకాశాలు లేవని, అలాంటి వారిని ఉపేక్షించమని హెచ్చరించారు. 1969 తెలంగాణ ఉద్యమకారుల సంఘం నిర్వహించిన తొలి తెలంగాణ పుస్తకావిష్కరణ కార్యక్రమానికి నాయిని నర్సింహారెడ్డి - టీఆర్‌ ఎస్ పార్లమెంట్ ఫ్లోర్‌ లీడర్ ఎంపీ జితేందర్‌ రెడ్డి ముఖ్య అధితులుగా హాజరయ్యారు.

ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సమావేశంలో హోంశాఖమంత్రి మాట్లాడుతూ జేఏసీ చైర్మ‌న్ తీరును తీవ్రంగా త‌ప్పుప‌ట్టారు. కోదండరాంను అరెస్టు చేయడంలో తప్పేముందని హోంమంత్రి ప్ర‌శ్నించారు. కోదండరాం వెంట అంతా నక్సలైట్లు ఉన్నారని, ఆ సమాచారం అంతా తమ దగ్గర ఉందని అన్నారు. ఆయనకు తెలంగాణలో తిరగడానికి వీలులేదని అందుకే అనుమతి ఇవ్వడంలేదని అన్నారు. అసలు అభివృద్ధి జరుగుతుంటే యాత్రల పేరిట ప్రజలను మభ్యపెట్టడం ఏమిటని ప్రశ్నించారు. జేఏసీని ఏర్పాటు చేసింది కేసీఆర్ అని - ఇప్పుడు జేఏసీ లేనేలేదని అంతా బయటకు వచ్చి బంగారు తెలంగాణ కోసం పాటుపడుతుంటే కోదండరాం మాత్రం ఏవేవో చేస్తున్నారని, అలాంటప్పుడు ఎలా అనుమతి ఇస్తామని హోంమంత్రి ప్ర‌శ్నించారు. ఓపక్క కోదండరాం లాంటి వారు మరోపక్క కాంగ్రెస్ పార్టీ నాయకులు అభివృద్ధికి అడ్డుపడుతూ గందరగోళానికి తెరలేపుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. కాంగ్రెస్ నాయకులకు కేసీఆర్ పరిపాలన చూసి మింగుడుపడడం లేదని, ఆ పార్టీ పాతాళం నుండి పైకిలేవడం సాధ్యం కాదని ఎద్దేవా చేశారు.

1969 తెలంగాణ ఉద్యమ సమయం నాటి ప‌రిస్థితుల‌ను హోం మంత్రి నాయిని గుర్తు చేసుకున్నారు. ఇప్పటిమాదిరిగా టీవీలు, ఇన్ని పేపర్లు లేవని రేడియోలో వచ్చే వార్తలతో పాటు తెలుగులో వచ్చే పత్రికల‌ కోసం ఎదురు చూస్తుండేవారమని తెలిపారు. హైదరాబాద్‌ లో పత్రికల కోసం క్యూలె న్లు కట్టేవారమని గుర్తు చేశారు. ఆనాడు ఉద్య‌మకారుల‌కు ప్ర‌భుత్వం గుర్తింపు ఇస్తుంద‌ని హామీ ఇచ్చారు.