Begin typing your search above and press return to search.

పాకిస్తాన్ ఏడుపు మాములుగా లేదు...

By:  Tupaki Desk   |   29 Sep 2015 4:57 AM GMT
పాకిస్తాన్ ఏడుపు మాములుగా లేదు...
X
అమెరికాలో భారత ప్రధాని నరేంద్రమోదీకి అసాధారణ రీతిలో స్వాగతం లభించటంపై పాకిస్థాన్ దిన పత్రిక ది నేషన్ భిన్నంగా స్పందించింది. అమెరికా పర్యటనలోనే ఉన్న పాక్ ప్రధాని నవాజ్ షరీఫ్ భారత ప్రధాని న‌రేంద్ర‌మోడీతో పోల్చితే ఏమాత్రం ప్రభావం చూపలేకపోయారని ఆ ప‌త్రిక ఎడిటోరియల్‌ లో పేర్కొంది. సీఈవోల‌తో స‌మావేశం - అమెరికా పెద్ద‌ల విందులు - ఇతర కార్యక్రమాల్లో మోడీకి ఓ స్టార్‌ కు లభించిన స్వాగతం లభించింది. కానీ, షరీఫ్ మాత్రం ఐక్యరాజ్యసమితి సమావేశాలకే పరిమితమయ్యారు అని వాపోయింది. మోడీ అమిత ప్రచారం ద్వారా రాజకీయ, సైనిక ఆధిపత్యాన్ని సాధించేందుకు ప్రయత్నిస్తున్నారు అని త‌న ఆవేశాన్ని చ‌ల్లార్చుకుంది.

మ‌రోవైపు భారత్ - పాక్ ప్రధానులు నరేంద్రమోడీ - నవాజ్ షరీఫ్ అమెరికా పర్యటనలో ఒకే హోటల్‌ లో బస చేశారు. కానీ మాట్లాడుకోలేదు. శాంతి పరిరక్షణపై అమెరికా అధ్యక్షుడు ఒబామా చేసిన ప్రసంగానికి మోడీ - షరీఫ్ హాజరయ్యారు. ఈ సందర్భంగా మాట కలవలేదు. కానీ చేతులు ఊపుకున్నారు. ఒబామా ప్రసంగానికి మోడీ ముందుగా హాజరయ్యారు. ఆ త‌ర్వాత‌ కొద్ది నిమిషాలకే షరీఫ్ కూడా వచ్చారు. మోడీని చూసిన షరీఫ్ చేయి ఊప‌గా....ప్రతిస్పందించిన మోడీ కూడా చేయి ఊపి నవ్వారు. షరీఫ్ కూడా నవ్వి తన పనిలో నిమగ్నమైపోయారు. ఇరువురూ సమావేశ అనంతరం ఎవరి దారినా వారు వెళ్లిపోయారు.

అమెరికా పర్యటనలో ఉన్న త‌మ ప్ర‌ధానికి గౌర‌వం ద‌క్క‌లేద‌ని ఏడ్చేబ‌దులు ఎందుకు ఆ విధంగా జ‌ర‌గ‌లేదో క‌నీసం పాక్ ఆలోచించుకోవాలి క‌దా? గూగుల్‌ - మైక్రోసాఫ్ట్‌ - ఆపిల్‌ - టెస్లా వంటి ప్ర‌పంచ ప్ర‌ఖ్యాత దేశాలు భార‌త్‌ కే ఎందుకు ప్రాధాన్యం ఇస్తున్నాయి? ఆ ప‌క్క‌నే ఉన్న పొరుగుదేశం అయిన‌ప్ప‌టికీ త‌మ‌ను ఎందుకు ప‌ట్టించుకోవ‌డం లేదు అనే స్పృహ ఆ దేశానికి ఎందుకు క‌ల‌గ‌డం లేదు? ఇలా నిష్పాక్షిక విశ్లేష‌ణ ఏమాత్రం చేసుకోకుండా కేవ‌లం గౌర‌వం ద‌క్కింది అని ఏడ్వ‌టం లేదా సంపాదకీయాలు రాసుకోవ‌డం త‌ప్ప ఆ దేశం సాధించేదేముంది?