Begin typing your search above and press return to search.

ముచ్చ‌ట‌గా మూడో నోటీస్ అందుకున్న సిద్ధూ!

By:  Tupaki Desk   |   11 May 2019 5:03 AM GMT
ముచ్చ‌ట‌గా మూడో నోటీస్ అందుకున్న సిద్ధూ!
X
రాజ‌కీయం అన్నాక నోటికి వ‌చ్చిన‌ట్లుగా మాట్లాడ‌టం మామూలే. బాధ్య‌త క‌లిగిన స్థానాల్లో ఉండి కూడా బాధ్య‌త లేకుండా మాట్లాడ‌టం అత్యుత్త‌మ స్థానాల్లో ఉన్న వారి మొద‌లు.. గ‌ల్లీ నేత‌ల వ‌ర‌కూ చేస్తున్న‌దే. దూకుడు రాజ‌కీయాల వేళ‌.. నోటికి వ‌చ్చిన‌ట్లుగా మాట్లాడే సంస్కృతి అంత‌కంత‌కూ ఎక్కువ అవుతోంది. రాజ‌కీయంలో ఇలాంటివ‌న్నీ మామూలే క‌దా? అన్న మాట ప‌లువురి నోట వినిపిస్తున్న దుస్థితి.

ఇలాంటి తీరు మామూలు రోజుల్లో ఎలా ఉన్నా.. ఎన్నిక‌ల వేళ మాత్రం పీక్స్ కు చేరుకుంద‌ని చెప్ప‌క త‌ప్ప‌దు. సార్వ‌త్రిక ఎన్నిక‌ల నేప‌థ్యంలో ఈ తీరు ఎంత‌లా పెరిగిందో ప్ర‌త్యేకించి చెప్పాల్సిన అవ‌స‌ర‌మే లేదు. సాక్ష్యాత్తు ప్ర‌ధాన‌మంత్రి స్థానంలో ఉన్న మోడీ సైతం.. ఎన్నికల వేళ ఎలాంటి వ్యాఖ్య‌లు చేశారో తెలిసిందే. ఆయ‌న వ్యాఖ్య‌ల‌పై విప‌క్షాలే కాదు.. మీడియా సైతం గ‌గ్గోలు పెట్టిన‌ప్ప‌టికీ.. ఎన్నిక‌ల్లో విజ‌యం సాధించ‌ట‌మే త‌న ల‌క్ష్యంగా పెట్టుకున్న ప్ర‌ధాని.. ఎవ‌రి మాట‌ల్ని లెక్క చేయ‌క‌పోవ‌టం చూస్తున్న‌దే.

మోడీ మాష్టారు లాంటోళ్లే అలా ఉంటే.. పంజాబ్ రాష్ట్ర మంత్రి.. స‌హ‌జంగానే దూకుడు ఎక్కువ‌గా ఉండే మాజీ క్రికెట‌ర్ న‌వ‌జోత్ సింగ్ సిద్ధూ లాంటోళ్లు నోటికి ప‌ని చెప్ప‌క‌పోతారా? ఇప్ప‌టికే రెండుసార్లు త‌న దూకుడు వ్యాఖ్య‌ల‌తో ఈసీ చేత నోటీసులు ఇప్పించుకునేలా చేసిన ఆయ‌న‌.. తాజాగా ప్ర‌ధానిని ఉద్దేశించి చేసిన మ‌రో వ్యాఖ్య‌కు మ‌రోమారు నోటీసులు ఇప్పించుకున్నారు.

ప్ర‌ధాని మోడీని ఉద్దేశించి తీవ్ర వ్యాఖ్య‌లు చేసేందుకు అమితాస‌క్తి ప్ర‌ద‌ర్శించే సిద్ధూ.. ఆ మ‌ధ్య‌న భోపాల్ లో జ‌రిగిన ర్యాలీ సంద‌ర్భంగా అభ్యంత‌ర‌క‌ర వ్యాఖ్య‌లు చేశారు. పారిశ్రామిక‌వేత్త అనిల్ అంబానీకి లాభం చేకూర్చేందుకు ప్ర‌ధాని మోడీ రాఫెల్ జెట్ ఒప్పందం కుదుర్చుకున్న‌ట్లుగా తీవ్ర ఆరోప‌ణ‌లు చేశారు. రాజ‌కీయాల్ని మోడీ అవినీతిమ‌యం చేశారంటూ నోటికి ప‌ని చెప్పారు. ఆయ‌న చేసిన వ్యాఖ్య‌ల‌పై మోడీ ప‌రివారం ఈసీకి ఫిర్యాదు చేసింది.

దీంతో దృష్టి సారించిన ఈసీ.. సిద్ధూకు తాజాగా మూడోసారి నోటీసులు జారీ చేశారు. ప్ర‌ధానిని ఉద్దేశించి చేసిన వ్యాఖ్య‌ల‌పై వివ‌ర‌ణ ఇవ్వాల‌ని ఆదేశించారు. ఆస‌క్తిక‌ర‌మైన విష‌యం ఏమంటే.. ఏప్రిల్ 29న సిద్ధూ వ్యాఖ్య‌లు చేస్తే.. ఆ ప‌క్క‌రోజున అంటే ఏప్రిల్ 30 బీజేపీ నేత‌లు ఫిర్యాదు ఇస్తే.. ప‌ది రోజుల అనంత‌రం సిద్ధూకు నోటీసు ఇవ్వ‌టం గ‌మ‌నార్హం. మ‌రి.. చ‌ర్య‌లు తీసుకునేస‌రికి ఎన్నిక‌లు అయిపోతాయా ఏంటి?