Begin typing your search above and press return to search.

బాబుకు నవీన్ పట్నాయక్ మద్దతు ఉత్తదే.. అసలు నిజం ఇదీ

By:  Tupaki Desk   |   26 Dec 2018 4:52 PM GMT
బాబుకు నవీన్ పట్నాయక్ మద్దతు ఉత్తదే.. అసలు నిజం ఇదీ
X
చంద్రబాబుకు నవీన్ పట్నాయక్ మద్దతు’.. ఇదీ నిన్నటి నుంచి ఏపీ పాలిటిక్సులో - మీడియా సర్కిళ్లలో స్ప్రెడ్ అయిన ఒక తప్పుడు వార్త. ఫెడరల్ ఫ్రంట్ అనే ఎండమావి వెంటపడుతున్న కేసీఆర్ ఒడిశా సీఎం నవీన్ పట్నాయక్‌ ను ఆ రాష్ట్రం వెళ్లి కలిసొచ్చిన రెండు రోజులకే నవీన్ పట్నాయిక్ ప్రతినిధిగా ఆయన పార్టీ బీజేడీ రాజ్య సభ ఎంపీ సౌమ్యారంజన్ పట్నాయిక్ అమరావతి వచ్చి మరీ చంద్రబాబును కలిసి ఆయన చేస్తున్న జాతీయ ప్రయోజనాల పోరాటానికి మద్దతిచ్చారంటూ చంద్రబాబు అనుకూల మీడియాలో వార్తలొచ్చాయి. చంద్రబాబు ఫేస్ బుక్ పేజీలోనూ వారిద్దరూ కలిసిన ఫొటో ఒకటి పెట్టారు. కానీ - అక్కడ మాత్రం ఎక్కువ వివరాలేమీ రాయలేదు. అనుకూల మీడియాలో మాత్రం... చంద్రబాబు జాతీయ ప్రయోజనాల కోసం సాగిస్తున్న పోరుకు - ఈవీఎంలకు వ్యతిరేకంగా సాగిస్తున్న పోరుకు మద్దతు పలకడానికి వచ్చారంటూ కథనాలు వండివచ్చారు.

అయితే... ఇదంతా నిజమేనా? ఒడిశా సీఎం నవీన్ పట్నాయిక్ స్టాండ్ తెలిసినవారెవరూ ఇది నిజం అని నమ్మే పరిస్థితి లేదు. ఆయనది ‘ఈక్వీ డిస్టెన్స్’ పాలసీ. 2009లో బీజేపీతో తెగతెంపులు చేసుకుని ఆ తరువాత ప్రతి ఎన్నికల్లోనూ తన పార్టీ ఆధిక్యాన్ని పెంచుకుంటూ పోతున్న ఆయన ఇతర పార్టీలతో సమ దూరం పాటిస్తూ వస్తున్నారు. కేంద్రంలో ఎవరున్నా కూడా తన రాష్ట్రానికి కావాల్సిన నిధులు తెచ్చుకుంటూ... అందుకు అవసరమైతే తన పరిచయాలను వాడుకుంటున్నారు. అదేసమయంలో ఆ రాష్ట్ర ప్రయోజనాల కోసం కేంద్రంతో పోరాడుతున్నారు కూడా. ఒకింత బీజేపీ అనుకూల వైఖరి కనబరుస్తారనే వాదన ఉన్నప్పటికీ బీజేడీ ఎన్నడూ దాన్ని బయటపెట్టుకోలేదు.

కేసీఆర్ ఫెడరల్ ఫ్రంట్ కోసం కలిసినప్పుడు కూడా నవీన్ ఏమీ దానికి మద్దతివ్వలేదు. ప్రాంతీయ పార్టీల మధ్య స్నేహాన్ని మాత్రమే ఆయన సమర్థించారు. కేసీఆర్ - నవీన్ పట్నాయిక్‌ లు సంయుక్తంగా నిర్వహించిన విలేకరుల సమావేశాన్ని కానీ జాగ్రత్తగా ఒక విషయం బోధ పడుతుంది. ఒక విలేకరి నవీన్‌ను.. ‘‘బీజేపీ - కాంగ్రెస్ పార్టీల్లో ఎవరు మీకు పెద్ద శత్రువు’’ అని ప్రశ్నించారు.. దానికి నవీన్.. ‘‘దటీజ్ మిస్టర్ రావూస్ బిజినెస్, నాట్ మైన్’’ అంటూ కుండబద్ధలుకొట్టేశారు.

అంతేకాదు.. కేసీఆర్ భువనేశ్వర్ వెళ్లడానికి ముందు తెలుగు మీడియా అంతా ఫెడలర్ ఫ్రంట్ విషయమై ఇద్దరి మధ్యా చర్చ జరగబోతోంది అని రాశాయి. కానీ, నవీన్ మాత్రం కేసీఆర్ తన విజయం తరువాత పూరీ జగన్నాథుడిని దర్శించుకునే పనిమీద వస్తున్నారు.. ఆ సందర్భంగా కర్టెసీ విజిట్‌ లో భాగంగా తనను కలుస్తున్నారనే మీడియాకు చెప్పారు.

.... ఇదంతా పక్కన పెట్టి ఇప్పుడు చంద్రబాబు వద్దకు వస్తే... అసలు బీజేపీ ఎంపీ సౌమ్యా రంజన్ పట్నాయిక్ చంద్రబాబును ఎందుకు కలిశారన్నది చెప్పాలి. నవీన్ ఆయన్ను చంద్రబాబు వద్దకు పంపించడానికి గల కారణం వేరు. చట్టసభల్లో మహిళలకు 33 శాతం రిజర్వేషన్ కోసం నవీన్ పట్నాయిక్ ఇనిషియేటివ్ తీసుకున్నారు. ఒడిశా అసెంబ్లీలో దీనిపై తీర్మానం కూడా చేశారు. మహిళలకు 33 శాతం రిజర్వేషన్ కోసం అన్ని రాష్ట్రాల్లోని నేతల మద్దతు కూడగడుతున్నారు. సౌమ్యారంజన్ వచ్చిందీ అందుకే. ఒడిశాలోని పత్రికలు ఇదే విషయం రాశాయి, అక్కడి టీవీలూ ఇదే విషయం చెప్పాయి.

డిసెంబరు 4న నవీన్ ప్రధానికి దీనిపై లేఖ రాశారు. చట్టసభల్లో మహిళలకు 33 శాతం రిజర్వేషన్లు ఇద్దామని ప్రతిపాదించారు. అందుకు చట్టం చేయాలని కోరారు. అక్కడికి రెండు రోజుల తరువాత డిసెంబరు 6న అన్ని రాష్ట్రాల ముఖ్యమంత్రులకూ ఇదే విషయమై నవీన్ స్వయంగా లేఖలు రాశారు. కేసీఆర్ భువనేశ్వర్ వెళ్లి నవీన్‌ ను కలవడానికి ముందు కూడా సౌమ్యారంజన్ పట్నాయిక్ హైదరాబాద్ వచ్చి ఇదే విషయమై మాట్లాడారు. ఇప్పుడు చంద్రబాబును కలిశారు.

చంద్రబాబును కలిసిన సందర్భంగా ఈవీఎంల ప్రస్తావన వచ్చింది.. పోలవరంపైనా ప్రస్తావన వచ్చింది. కానీ, చంద్రబాబు అనుకూల మీడియా - సోషల్ మీడియా సైన్యాలు మాత్రం చంద్రబాబు చక్రం తిప్పారు.. నవీన్ పట్నాయక్ ప్లేట్ ఫిరాయించారు.. చంద్రబాబు పోరాటానికి నవీన్ మద్దతు.. చంద్రబాబుకు నవీన్ మద్దతు.. అని రాసుకున్నాయి. అసలు సంగతి మాత్రం వేరు.