Begin typing your search above and press return to search.

ఏపీకి ప్రత్యేక హోదా... మళ్లీ ఒడిశా అడ్డు తగులుతోంది

By:  Tupaki Desk   |   11 Jun 2019 1:59 PM GMT
ఏపీకి ప్రత్యేక హోదా... మళ్లీ ఒడిశా అడ్డు తగులుతోంది
X
ఏపీకి పొరుగు రాష్ట్రంగా ఉన్న ఒడిశా... ఎప్పటికప్పుడు ఏపీ ప్రయోజనాలకు గండి కొడుతూనే ఉందని చెప్పాలి. ఏపీకి జీవనాడిగా ఉన్న పోలవరం ప్రాజెక్టును అడ్డుకునేందుకు అడుగడుగునా తనకు వీలయినంత మేర శ్రమించిన ఒడిశాలోని బీజేడీ సర్కారు... చివరకు పోలవరానికి జాతీయ ప్రాజెక్టు హోదా లభించడంతో వెనక్కు తగ్గక తప్పలేదు. తాజాగా ఏపీకి ప్రత్యేక హోదా ఇచ్చే విషయంలో కేంద్రంలోని నరేంద్ర మోదీ సర్కారు నుంచి సానుకూల సంకేతాలు అందుతున్న నేపథ్యంలో మరోమారు ఎంట్రీ ఇచ్చిన ఒడిశా... ఏపీకి ప్రత్యేక హోదాను అడ్డుకునే దిశగానే సాగుతోందని చెప్పాలి. అయితే ఒడిశా వాదన ఏపీకి వ్యతిరేకంగా లేకున్నా.. సరిగ్గా ఏపీకి ఏదో ఒకటి చేయాలని కేంద్రం తలచినప్పుడు ఒడిశా అదే తరహా డిమాండ్లను బయటపెట్టి పరోక్షంగా ఏపీకి దెబ్బేస్తోందని చెప్పక తప్పదు.

అయినా ఈ దిశగా ఇప్పుడు ఏపీకి ఒడిశా ఎలాంటి నష్టం చేస్తోందన్న విషయానికి వస్తే... తుఫానులతో అతలాకుతలం అయిన ఒడిశాకు ప్రత్యేక హోదా కేటాయించాలని ఆ రాష్ట్ర సీఎం, బీజేడీ అదినేేత నవీన్ పట్నాయక్ కేంద్రాన్ని డిమాండ్ చేశారు. ఈ మేరకు మంగళవారం ఢిల్లీలో ల్యాండైన పట్నాయక్ ప్రధాని నరేంద్ర మోదీతో భేటీ అయ్యారు. వరుస తుఫానులతో ఒడిశా నానా పాట్లు పడుతున్న వైనాన్ని ప్రధానికి వివరించిన పట్నాయక్... ఒడిశా కోలుకోవాలంటే కేంద్రం ప్రత్యేక హోదాను ప్రకటించాల్సిందేనని డిమాండ్ చేశారు. కేంద్రం ఆదుకోకుంటే... ఒడిశా కోలుకునే పరిస్థితి లేదని కూడా ఆయన మోదీకి వివరించారు. పట్నాయక్ వినతికి మోదీ ఎలా స్పందించారన్న విషయాన్ని పక్కనపెడితే... ఏపీకి ఏదో ఒకటి చేయాలని కేంద్రం తలచినప్పుడల్లా ఇలా ఒడిశా ఎంట్రీ ఇవ్వడం, ఏపీ కోరిన డిమాండ్లనే ప్రస్తావించడం చూస్తుంటే... ఉద్దేశపూర్వకంగా కాకపోయినా... ఏపీ ప్రయోజనాలకు ఒడిశా గండికొడుతోందనే చెప్పక తప్పదు.