Begin typing your search above and press return to search.

ప్ర‌ధానిని క‌లిసేందుకు సీఎం నో!

By:  Tupaki Desk   |   16 April 2017 11:28 AM GMT
ప్ర‌ధానిని క‌లిసేందుకు సీఎం నో!
X
ప్ర‌ధానమంత్రి న‌రేంద్ర మోడీ విష‌యంలో ఆయ‌న రాజ‌కీయ ప్ర‌త్య‌ర్థులు ఎంత ప‌ట్టుద‌ల‌తో ఉంటారో తెలియ‌జెప్పేందుకు ఇదే ఉదాహ‌ర‌ణ‌. మోడీ రాజ‌కీయ ప్ర‌త్య‌ర్థుల్లో కీల‌క‌మ‌నే పేరున్న వారిలో ఒక‌రైన ఒడిశా సీఎం న‌వీన్ ప‌ట్నాయ‌క్ తాజాగా ఆస‌క్తిక‌ర‌మైన ప్ర‌క‌ట‌న చేశారు. బీజేపీ జాతీయ కార్యవర్గ సమావేశంలో పాల్గొనేందుకు ప్రధాని మోడీతో సహా బీజేపీ అగ్రనేతలంతా భువనేశ్వర్‌ తరలివచ్చారు. అయితే ప్ర‌ధానితో మ‌ర్యాద‌పూర్వ‌కంగా స‌మావేశం ఏమైనా ఉంటుందా అనే విష‌యాన్ని తెలుసుకునేందుకు మీడియా సీఎం న‌వీన్ ప‌ట్నాయ‌క్‌ ను సంప్ర‌దించ‌గా ఆయ‌న ఆశ్చ‌ర్య‌క‌ర‌మైన స‌మాదానం ఇచ్చారు.

ఒడిశా పర్యటనకు ప్రధానమంత్రి నరేంద్రమోడీ వచ్చి రెండురోజుల పాటు ఉంటున్నప్ప‌టికీ ఆయ‌న్ను కలిసే ఉద్దేశం తనకు లేదని ముఖ్యమంత్రి నవీన్‌ పట్నాయక్ తేల్చిచెప్పారు. ప్రధాని మోడీ రాజకీయ లక్ష్యంతో రాష్ట్రంలో పర్యటిస్తున్నారని, అందుకే ఆయనను కలువాల్సిన అవసరం తనకు లేదని న‌వీన్ కుండ‌బ‌ద్ద‌లు కొట్టిన‌ట్లు చెప్పేశారు. 2019 ఎన్నికల్లో నవీన్‌ పట్నాయక్‌ ను సీఎం పీఠం నుంచి దింపడమే లక్ష్యమని బీజేపీ నేతలు ఈ సమావేశంలో ప్రతిన బూనిన నేప‌థ్యంలో ఈ వ్యాఖ్య‌లు ఆస‌క్తిక‌రంగా మారాయి.

కాగా, తూర్పు-దక్షిణ భారతంలో విస్తరించడంపై దృష్టిపెట్టిన బీజేపీ మొదటి లక్ష్యంగా ఒడిశాను ఎంచుకుంది. మోడీ ఇమేజీతో ఒడిశాలో పునాది విస్తరించుకోవాలని, రాబోయే అసెంబ్లీ ఎన్నికల్లో, ఆ తర్వాత పార్లమెంటు ఎన్నికల్లో బలపడాలని బీజేపీ చూస్తోంది. దానికి నాందిగానే భువనేశ్వర్‌ లో శని - ఆదివారాల్లో ఘనంగా కార్యనిర్వాహక సమావేశాలు తలపెట్టింది. మోడీ తనవంతుగా వారణాసి తరహాలో రోడ్‌ షోతో భువనేశ్వర్ ప్రజలను ఆకట్టుకునేందుకు ప్రయత్నించారు. కాగా, ఇటీవల జరిగిన పంచాయితీ ఎన్నికల్లో బీజేపీ రెండోస్థానంలో నిలువడం గమనార్హం. మరో విపక్షమైన కాంగ్రెస్ మూడోస్థానానికి పడిపోయింది. ఇది బీజేపీకి కొంత ఉత్సాహాన్ని ఇచ్చింది. వరుసగా నాలుగు విడతలు అధికారంలో ఉన్న బీజేడీ పట్ల ప్రజల్లో సహజంగా ఉండే వ్యతిరేకతను సొమ్ము చేసుకుని లబ్ధి పొందాలని కమలదళం చూస్తోంది.

Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/