Begin typing your search above and press return to search.

అమెరికాలో ఉన్నమాజీ పోలీస్ అధికారికి ప్రగతిభవన్ పిలుపు.. అందుకేనట

By:  Tupaki Desk   |   15 Dec 2020 9:42 AM IST
అమెరికాలో ఉన్నమాజీ పోలీస్ అధికారికి ప్రగతిభవన్ పిలుపు.. అందుకేనట
X
తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి నిర్ణయాలు వినూత్నంగా.. విలక్షణంగా ఉంటాయి. ఆయన ఎప్పుడు ఎలాంటి నిర్ణయం తీసుకుంటారో ఒక పట్టాన అర్థం కాదు. కొన్ని కీలక శాఖలకు ఐపీఎస్ అధికారుల్ని నియమించే విచిత్రమైన ప్రయోగాల్ని ఆయన చేస్తుంటారు. అలాంటిదే ఒకటి తాజాగా చోటు చేసుకున్నట్లుగా చెబుతున్నారు. కీలకమైన స్థానంలో ఉండి రిటైర్ అయిన ఒక మాజీ పోలీసు అధికారి ప్రస్తుతం అమెరికాలో ఉన్నారు.

అలాంటిది ఆయన్ను అర్జెంట్ గా హైదరాబాద్ కు రావాలని ముఖ్యమంత్రి ఆదేశించినట్లు చెబుతున్నారు. ఇంతకీ ఆ పోలీసు అధికారిక ఎవరంటే.. మాజీ ఐపీఎస్ నవీన్ చంద్. దీర్ఘకాలం పాటు ఆయన సీఎంవోలో ఇంటెలిజెన్సు విభాగాధిపతిగా పని చేశారు. అలాంటి ఆయన్ను తాజాగా తెలంగాణ రాష్ట్ర పబ్లిక్ సర్వీస్ కమిషన్ నూతన ఛైర్మన్ గా ఎంపిక చేసినట్లుగా చెబుతున్నారు.

ప్రస్తుతం ఈ సంస్థకు ఛైర్మన్ గా వ్యవహరిస్తున్న ఘంటా చక్రపాణి పదవీకాలం ఈ నెల 17తో ముగియనుంది. ఆయన స్థానంలో మాజీ ఐపీఎస్ నవీన్ చంద్ ను హుటాహుటిన హైదరాబాద్ కు పిలిపించి.. కీలక పదవి అప్పజెప్పటం ఆసక్తికరంగా మారింది. అంతేకాదు.. పబ్లిక్ సర్వీస్ కమిషన్ సభ్యులుగా ఉస్మానియా వర్సిటీ రిజిస్ట్రార్.. ఉన్నత విద్యా మండలి కార్యదర్శి.. హైదరాబాద్ లోని ఒక అధ్యయన సంస్థ సంచాలకురాలిని.. కమిషన్ సభ్యులుగా ఎంపిక చేసినట్లుగా తెలుస్తోంది. వీరితో పాటు.. వివిధ సామాజిక వర్గాలకు చెందిన మరికొందరిని ఎంపిక చేస్తారని చెబుతున్నారు. తాజా నియామకం ఇప్పుడు ఆసక్తికరంగా మారింది. దీనిపై ఈ రోజు అధికారిక ప్రకటన వెలువడే వీలుంది.