Begin typing your search above and press return to search.

అమరావతిలో డీజిల్ కార్లకు ప్రవేశం లేదు?

By:  Tupaki Desk   |   18 March 2017 12:22 PM IST
అమరావతిలో డీజిల్ కార్లకు ప్రవేశం లేదు?
X
ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతి ప్రపంచ దేశాల్లోని పలు నగరాలకు ధీటుగా కాలుష్య రహిత విధానాలకు వేదిక కానుంది. ముఖ్యంగా కర్బన ఉద్గారాలకు ప్రధాన కారణాల్లో ఒకటైన డీజిల్ కార్లకు అమరావతిలో నో ఎంట్రీ బోర్డు పెట్టబోతున్నారు. నేషనల్ గ్రీన్ ట్రైబ్యునల్ దీనిపై స్పష్టమైన సూచన చేయడంతో అమరావతిలో డీజిల్ కార్లకు ప్రవేశం ఉండే అవకాశాలు కనిపించడం లేదు. ఫలితంగా అమరావతికి కాలుష్య ముప్పు కొంతవరకు తగ్గనుంది.

ఢిల్లీ తరహాలో అమరావతిలో డీజిల్‌ వాహనాలు వినియోగించి సమస్యలు సృష్టిస్తే.. వాటిని పరిష్కరించాలంటూ తిరిగి తమవద్దకే వస్తారని.. ఈ పరిస్థితి రాకుండా ఇప్పుడే తాము చూస్తామని.. డీజిల్ వాహనాలకు అనుమతి ఇవ్వొద్దని ట్రైబ్యునల్ తెలిపింది. అమరావతి నిర్మాణాన్ని సవాల్‌ చేస్తూ దాఖలైన పిటిషన్లపై ఎన్జీటీ చైర్మన్ జస్టిస్‌ స్వతంత్రకుమార్‌ విచారణ జరిపిన సందర్భంగా ఈ వ్యాఖ్యలు చేశారు.

అమరావతి నగరంలో ఏ తరహా రవాణా వ్యవస్థను ప్రతిపాదిస్తున్నారు? వాహనాలకు ఏ ఇంథనాన్ని వినియోగిస్తారు? అని జస్టిస్‌ స్వతంత్రకుమార్‌ అడిగారు. అంతేకాదు.. డీజిల్‌ వాహనాలను మాత్రం తాము అమరావతిలో అనుమతించబోమని కూడా తెగేసి చెప్పారు.

కాగా ప్రపంచ వ్యాప్తంగా పలు నగరాలు ఏకంగా కార్ ఫ్రీ సిటీస్ గా మారే దిశగా అడుగులు వేస్తున్నాయి. మరికొన్ని నగరాలు వీలైనంత వరకు కాలుష్యం తగ్గించుకోవడానికి చర్యలు తీసుకుంటున్నాయి. ఆడ్-ఈవెన్ విధానంలో కార్ల ట్రాఫిక్ తగ్గించి కాలుష్య నియంత్రణకు కృషి చేస్తున్నాయి. ఇంకొన్ని చోట్ల డీజిల్ వాహనాలపై బ్యాన్ విధిస్తూ ఎలక్రిన్, సీఎన్ జీ వెహికిల్స్ కు మాత్రమే అనుమతిస్తున్నారు.

* స్పెయిన్ లోని మాడ్రిడ్ నగరంలో 2019 నాటికి పూర్తిగా కార్లన్నిటినీ నిషేధించాలనుకుంటున్నారు.

* నార్వే రాజధాని ఓస్లో కూడా 2019కి కార్ ఫ్రీ నగరంగా మారాలని నిర్ణయించారు అక్కడి పాలకులు.

* చైనాలోని చెంగ్డు నగరంలో కొంత ప్రాంతాన్ని పూర్తిగా వాహన రహితంగా మార్చుతున్నారు.

* జర్మనీలోని హ్యాంబర్గ్ లో కార్లు, టాక్సీల స్థానంలో బైకులను ప్రోత్సహిస్తున్నారు. బైక్ జోన్లు, వాకింగ్ జోన్ల పేరుతో నగరంలోని అధిక భాగం కార్ల రహితం చేస్తున్నారు. 2025 నాటికి పూర్తిగా కార్ల రహితంగా మారాలన్నది అక్కడి పాలకుల ప్రయత్నం.

* స్వీడన్ లోని కోపెన్ హాగన్ 2025 నాటికి పూర్తిగా కర్బన కాలుష్య రహిత నగరంగా మారాలని లక్ష్యం పెట్టుకుంది. ఇక్కడ 1960 నుంచే పెడస్ట్రియన్ జోన్లు ఉన్నాయి. 2014లో బైకుల కోసం సూపర్ హైవేలు నిర్మించారు. 2018 నాటికి మరో 18 ఇలాంటివి నిర్మిస్తారు. పెడస్ర్టియన్ జోన్లు, బైకు జోన్లలో కార్లు తిరగకూడదు.

* పలు ఐరోపా దేశాల్లోని నగరాల్లో డీజిల్ కార్లపై నిషేధం ఉంది.

* కొన్ని దేశాల్లో ఆడ్-ఈవెన్ విధానం అమల్లో ఉంది.

Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/