Begin typing your search above and press return to search.

అమ‌రావ‌తిపై కీల‌క తీర్పు వ‌చ్చేసింది

By:  Tupaki Desk   |   17 Nov 2017 9:10 AM GMT
అమ‌రావ‌తిపై కీల‌క తీర్పు వ‌చ్చేసింది
X
బాబు క‌ల‌ల్ని అడ్డుకునే వారే లేరు. విభ‌జ‌న నేప‌థ్యంలో ఏపీకి లేని రాజ‌ధానిని నిర్మించేందుకు అమ‌రావ‌తి అనే భారీ క‌ల‌ను ఏపీ ముఖ్య‌మంత్రి చంద్ర‌బాబు క‌న‌టం తెలిసిందే. అయితే.. బాబు అమ‌రావ‌తి క‌ల నిబంధ‌న‌ల‌కు విరుద్ధంగా ఉంద‌ని.. అమ‌రావ‌తిలో ఇప్ప‌టికే ఉన్న ప‌ర్యావ‌ర‌ణానికి హాని క‌లిగించేలా ఏపీ స‌ర్కారు ప్ర‌య‌త్నిస్తోంద‌ని.. దీనిపై చ‌ర్య‌లు తీసుకోవాలంటూ జాతీయ హ‌రిత ట్రైబ్యున‌ల్ (ఎన్జీటీ)ను ఆశ్ర‌యించిన సంగ‌తి తెలిసిందే.

ఈ కేసును విచారించిన ఎన్జీటీ పిటిష‌న‌ర్ల అభ్యంత‌రాల్ని తోసిపుచ్చింది. అమ‌రావ‌తిపై త‌మ‌కున్న అభ్యంత‌రాల్ని ఎన్జీటీ దృష్టికి తీసుకెళ్లిన పి.శ్రీమన్నారాయణ.. మాజీ ఐఏఎస్‌ అధికారి ఈఎఎస్‌ శర్మ.. బొలిశెట్టి సత్యనారాయణ తదితరులు 2015 నుంచి న్యాయపోరాటం చేస్తున్నారు. వీరి పిటిష‌న్‌ను విచార‌ణ‌కు స్వీక‌రించిన ఎన్జీటీ చైర్‌పర్సన్‌ జస్టిస్‌ స్వతంత్య్ర‌ కుమార్‌.. సభ్యులు జస్టిస్‌ రఘువేంద్ర రాథోర్‌.. జస్టిస్‌ బిక్రమ్‌ సింగ్‌ సజ్వాన్‌ లతో కూడిన ధర్మాసనం తాజాగా తీర్పునిచ్చింది. పిటిష‌న‌ర్ల అభ్యంత‌రాలను కొట్టిపారేస్తూ..కొన్ని సూచ‌న‌ల్ని చేసింది.

ప‌ర్యావ‌ర‌ణ శాఖ విధించిన 191 నిబంధ‌న‌ను క‌చ్ఛితంగా అమ‌లు చేయాల‌ని.. అందుకు త‌గ్గ‌ట్లే నిర్మాణాల్ని నిర్మించాల‌ని సూచ‌న చేసింది. కొండ‌వీటి వాగు దిశ మార్చినా ప్ర‌వాహానికి ముప్పు లేకుండా జాగ్ర‌త్త‌లు తీసుకోవాల‌ని పేర్కొంది. అదే స‌మ‌యంలో అమ‌రావ‌తిలో నిర్మాణాల్ని ప‌ర్య‌వేక్షించేందుకు రెండు కమిటీల‌ను నియ‌మించింది. ఈ క‌మిటీలు ఎప్ప‌టిక‌ప్పుడు అమ‌రావ‌తిలో ప‌రిస్థితిని ఎన్జీటీకీ తెలియ‌జేయాల‌ని ఆదేశించింది.

ట్రైబ్యున‌ల్ నుంచి తీర్పు వెలువ‌డిన నేప‌థ్యంలో అమ‌రావ‌తి ప్రాంత రైతులు పండ‌గ చేసుకున్నారు. ఒక‌రికొక‌రు స్వీట్లు తినిపించుకున్నారు. తాజా తీర్పు నేప‌థ్యంలో అమ‌రావ‌తిలో నిర్మాణాల‌కు ఉన్న అడ్డంకి తొలిగిన‌ట్లైంది. ఇక‌.. బాబు క‌న్న క‌ల‌ల్ని అమ‌రావ‌తి నేల మీద ఆవిష్క‌రించేందుకు కీల‌క అనుమ‌తి రావ‌టంతో బాబు క‌ల‌లు వాస్త‌వ‌రూపంలోకి మార‌ట‌మే మిగిలి ఉంది.