Begin typing your search above and press return to search.

శ్రీనగర్ లాల్ చౌక్ లో జాతీయజెండా ఎగిరింది ఇదే మొదటిసారా?

By:  Tupaki Desk   |   27 Jan 2022 4:49 AM GMT
శ్రీనగర్ లాల్ చౌక్ లో జాతీయజెండా ఎగిరింది ఇదే మొదటిసారా?
X
గణతంత్ర దినోత్సవాన్ని పురస్కరించుకొని బుధవారం జమ్ముకశ్మీర్ రాజధాని శ్రీనగర్ లోని చారిత్రక లాక్ చౌక్ లోని క్లాక్ టవర్ మీద త్రివర్ణ పతాకం ఎగిరింది. దీనికి సంబంధించిన వార్తలు ప్రముఖంగా వస్తున్నాయి. అయితే.. కొన్ని వార్తల్లో త్రివర్ణ పతాకం ఎగిరింది ఇదే తొలిసారి అని పేర్కొంటే.. కొందరు ముప్ఫై ఏళ్ల క్రితం ఒకసారి ఎగురవేశారని.. ఇది రెండోసారి అని చెబుతున్నారు?

ఇంతకు ముప్ఫై ఏళ్ల క్రితం అప్పుడుజెండా ఎగురవేసింది ఎవరు? దాన్ని పరిగణలోకి తీసుకోవాలా? ఇవాళ ఎగురవేసిన దానిని మాత్రమే పరిగణలోకి తీసుకోవాలా? అన్న చర్చ జరుగుతోంది. మోడీ సర్కారు రెండోసారి అధికారంలోకి వచ్చిన తర్వాత ఆర్టికల్ 370ను రద్దు చేయటం.. ఆ తర్వాత ఈ ప్రాంతం సున్నితత్వంగా మారిందంటూ జాతీయజెండాను ఆవిష్కరించేందుకు అధికారులు అనుమతిని ఇచ్చేవారు కాదు.

అందుకు భిన్నంగా ఈసారి మాత్రం అధికారులు అనుమతి ఇవ్వటం గమనార్హం. దీనికి కారణం స్థానిక కశ్మీరులు స్వయంగా అధికారుల్ని త్రివర్ణ పతాకాన్ని ఎగురవేస్తామని కోరటం జరిగింది.

సాజిద్ యూసుఫ్ షా.. సాహిల్ బషీర్ అనే ఇద్దరు క్రేన్ సాయంతో క్లాక్ టవర్ మీదకు చేరుకొని.. అక్కడ జాతీయ పతాకాన్ని ఆవిష్కరించారు. ఈ సందర్భంగా స్థానిక ముస్లిం మహిళలు..పిల్లలు జాతీయజెండాను పట్టుకొని దేశం మీద తమకున్న అభిమానాన్ని చాటారు. లాల్ చౌక్ వద్ద జాతీయ జెండా ఎగురవేసింది ఇది రెండోసారి అన్నప్పుడు.. మొదటిసారి ఎప్పుడు? ఎవరు ఎగురువేశారు? అన్న ప్రశ్నలకు సమాధానం వెతికితే.. ఆసక్తికర విషయాలు వెలుగుచూస్తాయి.

సరిగ్గా 30ఏళ్ల క్రితం 1992లో కశ్మీర్ లోయలో తీవ్రవాదం తీవ్రంగా ఉన్న సమయంలో బీజేపీ సీనియర్ నేత మురళీ మనోహర్ జోషి తొలిసారి గా శ్రీనగర్ లోని లాల్ చౌక్ ప్రాంతంలో జాతీయ జెండాను ఆవిష్కరించారు. అయితే.. లాల్ చౌక్ లో జాతీయ జెండా ఆవిష్కరణ అంశం ఎప్పుడు వివాదాస్పదంగానే ఉండేది.

అయితే.. మురళీ మనోహర్ జోషి.. కట్టుదిట్టమైన భద్రత మధ్య జాతీయ జెండా ఎగురవేశారే కానీ.. ఈసారి మాదిరి స్థానికులే ముందుకు వచ్చి జెండా ఎగురవేసింది లేదు. టెక్నికల్ గా చూసినప్పుడు మాత్రం జాతీయ జెండా ఆవిష్కరణ ఇది రెండో సారిగా కనిపిస్తుంది కానీ.. కశ్మీరీలే స్వయంగా త్రివర్ణ పతాకాన్ని ఎగురవేయాలన్న నిర్ణయాన్ని తీసుకోవటం చూసినప్పుడు ఇదే తొలిసారిగా చెప్పక తప్పదు. ఈ విషయంలో మోడీదే మొత్తం క్రెడిట్ అని చెప్పక తప్పదు.