Begin typing your search above and press return to search.

జాతీయ ప‌రీక్ష‌లు కూడా: జేఈఈ, నీట్ ర‌ద్దు?

By:  Tupaki Desk   |   24 Jun 2020 1:30 AM GMT
జాతీయ ప‌రీక్ష‌లు కూడా: జేఈఈ, నీట్ ర‌ద్దు?
X
వైర‌స్ వ్యాప్తి తీవ్రంగా ఉన్న నేప‌థ్యంలో ప‌బ్లిక్ ప‌రీక్ష‌లు నిర్వ‌హించ‌డం సాధ్యం కాద‌ని చాలా రాష్ట్రాలు ప‌దో త‌ర‌గ‌తి, ఇంట‌ర్మీడియ‌ట్ త‌దిత‌ర ప‌రీక్ష‌లు ర‌ద్దు చేసి అంద‌రినీ ప్ర‌మోట్ చేస్తూ నిర్ణ‌యం తీసుకున్నాయి. త‌మ ప‌రిధిలోని ప‌రీక్ష‌ల‌పై రాష్ట్రాలు సొంతంగా చ‌ర్య‌లు తీసుకున్నాయి. ఇప్పుడు జాతీయ ప‌రీక్ష‌ల నిర్వ‌హ‌ణ‌పై కూడా నీలి మేఘాలు అలుముకున్నాయి. ప‌రీక్ష‌లు నిర్వ‌హించాలా వ‌ద్దా అనేది కేంద్ర ప్ర‌భుత్వం మ‌ల్ల‌గుల్లాలు ప‌డుతోంది. ప‌రీక్ష‌లు నిర్వ‌హించే దానిపై సాధ్య‌సాధ్యాల‌ను ప‌రిశీలిస్తోంది. ఈ క్ర‌మంలో ప‌రీక్ష‌ల ర‌ద్దుకే సిద్ధ‌మైంద‌ని స‌మాచారం.

జులై 18 నుంచి 23వ తేదీ వరకు జేఈఈ మెయిన్‌ పరీక్షలు నిర్వ‌హించారు. జూలై 26వ తేదీన నీట్ ప‌రీక్ష నిర్వ‌హించాల్సి ఉంది. ఈ ప‌రీక్ష‌ల కోసం నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ (ఎన్‌టీఏ) ఏర్పాట్లు చేస్తోంది. ఏప్రిల్‌లో జరగాల్సిన ఈ పరీక్షలను వైర‌స్‌ నేపథ్యంలో జులైకి వాయిదా వేసిన సంగతి తెలిసిందే. ఇప్పుడు ఈ ప‌రీక్ష‌లు నిర్ణ‌యించిన షెడ్యూల్ ప్ర‌కారం జ‌రిగేటట్టు లేదు. మొత్తానికి ర‌ద్ద‌య్యే అవ‌కాశం ఉంది.

ప్ర‌స్తుతం ఉన్న ప‌రిస్థితుల నేప‌థ్యంలో ఆ ప‌రీక్ష‌ల‌ను ర‌ద్దు చేయ‌డ‌మే ఉత్త‌మంగా ప‌లువురు అధికారులు ప్ర‌భుత్వానికి నివేదించార‌ని ఢిల్లీలో టాక్ వినిపిస్తోంది. అన్ని విధాల ఆలోచించి చివ‌ర‌కు జేఈఈ, నీట్ ప‌రీక్ష‌లు ర‌ద్దుకే కేంద్ర ప్ర‌భుత్వం మొగ్గు చూపుతోంద‌ని జాతీయ మీడియాలో చ‌ర్చ న‌డుస్తోంది.