Begin typing your search above and press return to search.

గాడ్సే, కసబ్ కంటే రాజీవ్ క్రూరుడు

By:  Tupaki Desk   |   17 May 2019 6:58 AM GMT
గాడ్సే, కసబ్ కంటే రాజీవ్ క్రూరుడు
X
నాథూరాం గాడ్సేను హిందూ ఉగ్రవాదిగా చిత్రీకరించి ప్రముఖ నటుడు, రాజకీయ నాయకుడు అయిన కమల్ హాసన్ అంటించిన మంటల వేడి చల్లారడం లేదు. తాజాగా దీనిపై హిందుత్వ, మైనార్టీ వర్గాలు రెండుగా చీలి కొట్లాడుకుంటున్నాయి. తాజాగా బీజేపీ భోపాల్ లోక్ సభ అభ్యర్థి ప్రజ్ఞాసింగ్ కూడా నోరుజారింది. గాడ్సేను దేశభక్తుడు అని కొనియాడడం పెద్ద దుమారం రేపింది. అనంతరం బీజేపీ మొట్టికాయలు వేయడంతో క్షమాపణలు చెప్పింది.

ఈ వివాదం ముగియక ముందే మరో బీజేపీ ఎంపీ నోరుజారారు. భారత మాజీ ప్రధాని రాజీవ్ గాంధీపై దారుణ వ్యాఖ్యలు చేశారు. దక్షిణ కర్ణాటక లోక్ సభ నుంచి రెండు సార్లు గెలుపొందిన నిళిన్ కుమార్ కటేల్ తాజాగా నాథూరాం గాడ్సే, పాకిస్తాన్ ఉగ్రవాది కసబ్ కంటే కూడా రాజీవ్ గాంధీ అత్యంత ప్రమాదకరమైన వ్యక్తి అని నోరుపారేసుకున్నారు.

అందుకు గల కారణాలను వివరించి దుమారం రేపారు. గాడ్సే ఒక్క గాంధీని మాత్రమే చంపాడని.. కసబ్ వల్ల ముంబైలో 72మంది చనిపోయారని.. కానీ రాజీవ్ గాంధీ వల్ల సిక్కుల ఊచకోత జరిగి 17వేల మంది చనిపోయారని నిళిన్ కుమార్ తీవ్ర వ్యాఖ్యలు చేశారు. ఈ ముగ్గురిలో అత్యధిక మంది చావుకు కారణమైన క్రూరుడు రాజీవ్ అంటూ నోరుపారేసుకున్నారు. అయితే రాజీవ్ క్రూరుడంటూ చేసిన వ్యాఖ్యలు దుమారం రేగడంతో నిళిన్ కుమార్ ఆ ట్వీట్ ను తొలగించారు.

ప్రధాని నరేంద్రమోడీ అభివృద్ధి, సంక్షేమం పై ఎటువంటి ప్రచారం చేయడం లేదు. ఎందుకంటే ఐదేళ్లలో మోడీ చేసిందేమీ లేదనే విమర్శ ప్రతిపక్షాలు చేస్తున్నాయి. . అందుకే ప్రతిపక్ష రాహుల్ గాంధీని, ఆయన తండ్రి రాజీవ్ గాంధీని టార్గెట్ చేసి విమర్శలు చేస్తున్నారంటున్నారు. రాజీవ్ హయాంలో సిక్కుల ఊచకోత జరిగి 17వేల మంది చనిపోవడాన్ని ఇప్పుడు బీజేపీ ప్రచారాస్త్రంగా మలుచుకుంది. ఇలా బీజేపీ ఎంపీ కూడా నోరుపారేసుకోవడం.. దుమారం రేగడం జరిగిపోయింది. తమ బలం కంటే.. ప్రత్యర్థి కాంగ్రెస్ బలహీనతల మీదే బీజేపీ ప్రచారం చేస్తుండడం విస్తుగొలుపుతోంది.