Begin typing your search above and press return to search.

నసీరుద్దీన్ షాలో పైత్యం ఎక్కువే బాసూ

By:  Tupaki Desk   |   28 May 2016 4:48 PM IST
నసీరుద్దీన్ షాలో పైత్యం ఎక్కువే బాసూ
X
బాలీవుడ్ సీనియర్ నటుడు నసీరుద్దీన్ షా పైత్యం తాజాగా బయటకు వచ్చింది. సీనియర్ నటుడిగా.. పాత్రలో పరకాయ ప్రవేశం చేసి.. తెర మీద జీవించే ఈ నటుడి నటనకు భాషలకు.. ప్రాంతాలకు.. మతాలకు అతీతంగా ప్రతి ఒక్కరూ పిధా అవ్వాల్సిందే. మరి.. అలాంటి నటుడి ఆలోచన ధోరణి ఎలా ఉందన్న విషయాన్ని చూసినప్పుడు విస్మయకరంగా అనిపించక మానదు. సంకుచితత్వంతో మాట్లాడుతూ.. అనవసర వివాదాన్ని రాజేసే విధంగా ఆయన చేసిన వ్యాఖ్యలపై హాట్ హాట్ గా చర్చ సాగుతోంది.

అయితే.. తాను నోరుజారిన విషయాన్ని గుర్తించిన ఈ సీనియర్ నటుడు నాలుక్కర్చుకొని అందరి మాదిరే తన వ్యాఖ్యల్ని వక్రీకరించినట్లుగా చెప్పుకొచ్చాడు. ఇంతకీ నసీరుద్దీన్ షా వివాదం ఏమిటంటే.. అయ్యగారు ఈ మధ్యనే ‘‘వెయిటింగ్’’ అనే సినిమాలో నటించారు. ఈ చిత్ర ప్రమోషన్ లో భాగంగా ఆయన ఒక వివాదాస్పద వ్యాఖ్య చేశారు. కశ్మీర్ లో ఎప్పుడూ జీవించని ఒక వ్యక్తి కశ్మీర్ పండిట్ల కోసం పోరాటం ప్రారంభించాడు.. నిజానికి ఆయనే ఓ నిర్వాసితుడైనట్లు వ్యవహరిస్తున్నాడంటూ మాట తూలాడు. తనపై చేసిన వ్యాఖ్యపై మరో బాలీవుడ్ నటుడు అనుపమ్ ఖేర్ తీవ్రంగా రియాక్ట్ అయ్యారు. నసీరుద్దీన్ చేసిన వ్యాఖ్యలకు కౌంటర్ గా ఆయన వ్యాఖ్యలు చేస్తూ.. ‘‘జయహో షా గారు. మీ లాజిక్ ప్రకారం ఎన్నారైలు ఇండియా గురించి మాట్లాడవద్దన్న మాట’’ అని వ్యంగ్యంగా వ్యాఖ్యానించారు.

షా మాటల్నే తీసుకుంటే.. బాధితులు తప్పించి మరెవరూ మాట్లాడకూడదన్నట్లుగా చేసిన వ్యాఖ్యలపై బాలీవుడ్ ప్రముఖులు పలువురు ఒక్కసారిగా గళం విప్పటంతో తాను చేసిన వ్యాఖ్యలు ఎంత తీవ్రమైనవన్న విషయాన్ని గుర్తించిన షా.. తన మాటల్ని వక్రీకరించారంటూ రొడ్డుకొట్టుడు డైలాగ్ ఒకటి చెప్పి తప్పించుకునే ప్రయత్నం చేశారు. నోరు జారటమేల..? దానికి కవరింగ్ ఇచ్చుకోవటం ఏల నసీరుద్దీన్ షా జీ..?