Begin typing your search above and press return to search.

పూరి తమ్ముడి ఆవేశం .. బూతులే బూతులు

By:  Tupaki Desk   |   8 Jun 2022 5:58 AM GMT
పూరి తమ్ముడి ఆవేశం ..  బూతులే బూతులు
X
న‌ర్సీప‌ట్నం ఎమ్మెల్యే పెట్ల ఉమాశంక‌ర్ గ‌ణేశ్ ఆగ్ర‌హంతో ఊగిపోయారు. బూతుల పురాణం అందుకున్నారు. దీంతో అక్క‌డున్న వారంతా అవాక్క‌య్యారు. తాను త‌ల్చుకుంటే మాజీ మంత్రి అయ్య‌న్న పాత్రుడు ఇంటి నుంచి బ‌య‌ట‌కు రాలేర‌ని అన్నారు. ఇంకా చాలా రాయ‌లేని భాష‌లో చాలా మాట‌లు అన్నారు. ముఖ్యంగా టీడీపీ నాయ‌కుల‌ను ఉద్దేశించి తిట్లు అందుకుని, అక్క‌డికి వ‌చ్చిన మ‌హిళ‌ల‌పై ఆగ్ర‌హంతో ఊగిపోయారు. ఇప్పుడీ వార్త ఉత్త‌రాంధ్రలో సంచ‌ల‌నం అవుతోంది.

ఇంతకీ ఏం జరిగిందంటే... 45 నుంచి 60 ఏళ్ల మ‌ధ్య ఉన్న మ‌హిళ‌ల ఆర్థిక స్వావ‌లంబ‌న కోసం, వారికి ఉపాధి అవ‌కాశాల మెరుగుద‌ల కోసం ఉద్దేశించిన వైఎస్సార్ చేయూత ప‌థ‌కం త‌మ‌కు అంద‌లేద‌ని కొంద‌రు ఫిర్యాదు చేశారు. తెలుగు యువ‌త మండ‌ల కార్య‌ద‌ర్శి చిట్టి బాబు నేతృత్వంలో కొంద‌రు అక్క‌డికి చేరుకున్నారు. ఇదే స‌మ‌యంలో ఫిర్యాదులు వినిపించుకుని అర్థం చేసుకుని ప‌రిష్క‌రించాల్సిన ఎమ్మెల్యే ఎన్న‌డూ లేనంత కోపంతో ఊగిపోయి నోటికి వ‌చ్చిందంతా తిట్టి వెళ్లారు.

వాస్త‌వానికి న‌ర్సీప‌ట్నం కేంద్రంగా ఎప్ప‌టి నుంచో టీడీపీ నాయ‌కుడు అయ్య‌న్న‌పాత్రుడు ప్ర‌భుత్వం పై విమ‌ర్శ‌లు చేస్తూ ఉన్నారు. ఇవి విని త‌ట్టుకోలేక‌పోయిన వైసీపీ నాయ‌కులు అంతే స్థాయిలో కౌంట‌ర్లు ఇస్తున్నారు. ప్ర‌భుత్వం ప‌నిచేస్తున్న తీరుపై ఆయ‌న మ‌హానాడులోనూ స్పందించారు.

అవ‌న్నీ సోషల్ మీడియాలో ట్రోల్ అవుతుండ‌డంతో అయ్య‌న్న‌పై కోపం ఈ విధంగా నియోజ‌క‌వ‌ర్గ మ‌హిళ‌ల‌పై చూపించ‌డం ఎంత‌వ‌ర‌కూ స‌మంజ‌సం అని తెలుగు యువ‌త ప్ర‌శ్నిస్తోంది. ఇక త‌మ‌కు న్యాయం చేయ‌మ‌ని అడిగిన పైలా వెంక‌ట స‌త్య భ‌వాని అనే మ‌హిళ‌ను నిన్న‌టి వేళ వైసీపీ కార్య‌క‌ర్త‌లు కొట్టారు అన్న వార్త‌లూ ఉన్నాయి. గ‌తంలో కూడా తాము ఇదేవిధంగా అధికారుల‌ను అడిగితే న్యాయం చేయ‌లేద‌ని ఎమ్మెల్యే దృష్టికి తీసుకువెళ్లారు.

కేసు న‌మోదు చేస్తే చాలా ?ఇదే సంద‌ర్భంలో అక్క‌డ గొడ‌వ జ‌రిగింది. స‌ర్పంచ్ ర‌మ‌ణ (వైసీపీ) ఆమె వెన‌క్కు నెట్ట‌గా, ఆమెతో వ‌చ్చిన యువ‌కుడు కింద ప‌డిపోకుండా ప‌ట్టుకున్నాడు. ఇంత‌లోనే వైసీపీ కార్య‌క‌ర్త‌లు వ‌చ్చి ఆమెపై భౌతిక దాడి చేసి వెళ్లారు.

ఇంత జ‌రిగినా కూడా ఎమ్మెల్యే ఎక్క‌డా త‌గ్గిన దాఖలాలు అయితే లేవు అని ప్ర‌త్య‌క్ష సాక్షులు చెబుతున్నారు. పోలీసులు చొర‌వ కూడా పెద్ద‌గా ఏం లేద‌నే తెలుస్తోంది. బాధితురాలు భ‌వాని ఫిర్యాదు మేరకు వారు స‌ర్పంచ్ పై కేసు న‌మోదు చేయ‌డం మిన‌హా వివాదాన్ని త‌గ్గించేందుకు, ఉద్రిక్త‌త‌లు త‌గ్గించేందుకు చ‌క్క‌దిద్దింది ఏం లేదు అన్న విమ‌ర్శ‌లూ వ‌స్తున్నాయి.