Begin typing your search above and press return to search.

కొద్దిలో 162 ప్రాణాలు పోకుండా మిగిలాయి

By:  Tupaki Desk   |   15 Jan 2018 1:18 AM GMT
కొద్దిలో 162 ప్రాణాలు పోకుండా మిగిలాయి
X
ఒకరు కాదు ఇద్దరు కాదు ఏకంగా 162 మంది ప్రయాణికులతో వెళ్తున్న విమానం రన్‌వే నుంచి జారి పక్కనే ఉన్న సముద్రం వైపు దూసుకెళ్లింది. ఈఘటన టర్కీ రాజధాని అంకారాలో చోటుచేసుకుంది. టర్కీకి చెందిన పెగాసస్ ఎయిర్‌లైన్స్ విమానానికి ఆదివారం తృటిలో పెను ప్రమాదం తప్పింది. విమానం ల్యాండింగ్ సమయంలో అదుపుతప్పి రన్‌వేపై నుంచి పక్కకు వెళ్లి సముద్రం అంచున ఆగింది. ఇంకొంచెం ముందుకు వెళ్లుంటే నల్లసముద్రంలో పడిపోయేది.

టర్కీ రాజధాని అంకారా నుంచి ట్రబ్‌జాన్ పట్టణానికి 162 మంది ప్రయాణికులతో విమానం ఉదయం బయలుదేరింది. ట్రబ్‌జాన్ ఎయిర్‌పోర్ట్‌లో దిగే సమయంలో మంచుధాటికి విమానం అదుపుతప్పి పక్కకు దూసుకెళ్లింది. నల్ల సముద్రానికి కొన్ని ఫీట్ల దూరంలో ఒండ్రులో విమాన చక్రాలు దిగబడటంతో నిలిచిపోయింది. ఈ సందర్భంలో విమానం నుంచి పెద్దఎత్తున పొగలు వ్యాపించాయి. అగ్నిమాపక దళాలు అక్కడికి చేరుకొని పొగను అదుపుచేశాయి. ముందుగా విమానంలోని మహిళల్ని, పిల్లల్ని జాగ్రత్త గా బయటికి తరలించారు. ఆ తరువాత విమానాన్ని బయటికి తీసి మరమ్మతులు చేశారు. విమానం సముద్రంలోకి పడిపోతున్నప్పుడు తీసిన ఫొటోలు సామాజిక మాధ్యమాల్లో సంచలనం రేపింది. ఈ ఘటనపై విచారణకు ఆదేశించినట్టు ట్రబ్‌జాన్ ప్రభుత్వం తెలిపింది. విమానం అదుపుతప్పిన దృశ్యాలను టర్కీ సీఎన్‌ఎన్ ప్రసారం చేసింది.