Begin typing your search above and press return to search.

కేంద్రమంత్రి తోమర్ మాటల్ని అలా అర్థం చేసుకోవాలట

By:  Tupaki Desk   |   27 Dec 2021 2:30 AM GMT
కేంద్రమంత్రి తోమర్ మాటల్ని అలా అర్థం చేసుకోవాలట
X
కేంద్రమంత్రి నరేంద్ర సింగ్ తోమర్ చేసిన వ్యాఖ్యలు పెను వివాదంగా మారటమే కాదు.. దీనిపై ఇప్పుడు రాజకీయ రగడ నడుస్తోంది. ఆయన చేసిన వ్యాఖ్యల్ని ఉటంకిస్తూ.. మోడీ సర్కారు ప్రజల్ని మోసం చేస్తుందంటూ ఫైర్ అవుతున్నారు విపక్ష నేతలు. ఇంతకీ కేంద్ర మంత్రి వారి నోటి నుంచి వచ్చిన మాటల్ని చూస్తే.. ‘మేం ఒక్క అడుగు వెనక్కి వేశామంతే. మళ్లీ ముందడుగు వేస్తాం’ అని చేసిన వ్యాఖ్యల సంచలనంగా మారటమే కాదు.. మోడీ సర్కారుపై విరుచుకుపడేందుకు సిద్ధంగా ఉన్న నేతలందరికి మంచి ఫుడ్ అందించారు తోమర్.

తాను చేసిన వ్యాఖ్యలు ఎక్కడికెక్కడికో వెళ్లటమే కాదు.. తాను చేసిన వ్యాఖ్యల అర్థం మొత్తం మారిపోవటమే కాదు.. చూస్తుండగానే మోడీ సర్కారుకే తలనొప్పులు తెచ్చేలా మారటంతో ఆయన తన వ్యాఖ్యలకు అర్థం చెప్పే ప్రయత్నం చేశారు. తన మాటల్ని ఏ అర్థంలో అన్నానో చెబుతూ.. అందరూ అదే విధంగా ఆలోచించాలని కోరారు. ఈ మధ్యనే తాము తీసుకున్న మూడు వ్యవసాయ చట్టాల్ని వెనక్కి తీసుకుంటూ ప్రధాని మోడీ కీలక ప్రకటన చేయటంతో పాటు.. జాతి జనులకు సారీ చెప్పారు.

అలాంటిది కేంద్రమంత్రి తోమర్ తాజా మాటల్ని చూస్తే.. వ్యవసాయ చట్టాలు మళ్లీ తీసుకొస్తామన్నట్లుగా ఉండటం తెలిసిందే. మరి కొద్ది నెలల్లో ఐదు రాష్ట్రాల్లో అసెంబ్లీ ఎన్నికలు జరుగుతున్న వేళ.. తన వ్యాఖ్యలతో మోడీ సర్కారుకు తలనొప్పులు తప్పవన్న విషయాన్ని తోమర్ గుర్తించినట్లుగా కనిపిస్తోంది. వెనక్కి తీసుకున్న మూడు వ్యవసాయ చట్టాల్ని వెనక్కి తీసుకుంటానని తాను చెప్పలేదని.. ఆ చట్టాలి తిరిగి తీసుకురావటం లేదని స్పష్టం చేశారు.
రైతుల సంక్షేమం కోసం ప్రభుత్వం నిరంతరం పని చేస్తుందని మాత్రమే తాను చెప్పినట్లు వెల్లడించారు. కేంద్ర మంత్రిగా ఉంటూ తాను మాట్లాడే మాటలతో లేని రచ్చకు అవకాశం ఉంటుందన్న సోయి లేకుండా వ్యాఖ్యలు చేసిన తోమర్ కు జరగాల్సిందే జరిగిందన్న మాట వినిపిస్తోంది.