Begin typing your search above and press return to search.

న‌వ్వుతూ షేక్ హ్యాండ్ ఇచ్చుకున్న ఆ ఇద్ద‌రు

By:  Tupaki Desk   |   4 Sep 2017 7:08 AM GMT
న‌వ్వుతూ షేక్ హ్యాండ్ ఇచ్చుకున్న ఆ ఇద్ద‌రు
X
ప్ర‌పంచంలో అత్య‌ధిక జ‌నాభా ఉన్న రెండు పెద్ద దేశాలు ప‌క్క‌ప‌క్క‌నే ఉండ‌టం ఒక ఎత్తు అయితే.. ఈ రెండు దేశాల మ‌ధ్య ఉద్రిక్త ప‌రిస్థితులు చోటు చేసుకోవ‌టం ప్ర‌పంచాన్ని క‌ల‌వ‌ర‌పెట్టే అంశ‌మే. ప్ర‌పంచ జ‌నాభాలో పావు కంటే కాస్త ఎక్కువ‌గా ఉండే ఈ దేశాల మ‌ధ్య ఉద్రిక్త‌త చోటు చేసుకోవ‌టం.. ఎప్పుడేం జ‌రుగుతుందో అర్థం కాని ప‌రిస్థితి నెల‌కొంది.

త‌న తీరుకు భిన్నంగా వ్య‌వ‌హ‌రించిన భార‌త్ వైఖ‌రిని ప్ర‌పంచ దేశాలు మౌనంగానే మ‌ద్ద‌తునిచ్చాయి. డోక్లాం స‌రిహ‌ద్దుల్లో డ్రాగ‌న్ దొంగాట‌కు తెలివిగా చెక్ పెట్టిన దెబ్బ‌కు చైనా కిందామీదా ప‌డిపోయింది. అక్క‌డి పాల‌కులు.. మీడియా క‌లిసి భార‌త్ మీద ఒత్తిడి పెంచేందుకు.. త‌ప్పు చేసేందుకు చాలానే ప్ర‌య‌త్నాలు చేసినా త‌న ప‌ట్టును స‌డ‌లించ‌లేదు. చివ‌ర‌కు భార‌త్ చేసిన ప్ర‌తిపాద‌న‌కు త‌గ్గ‌ట్లే రెండు దేశాల బ‌ల‌గాలు ఒకే స‌మ‌యంలో వెన‌క్కి వెళ్లాల‌న్న సూచ‌న‌ను డ్రాగ‌న్ అంగీక‌రించ‌టంతో రెండు నెల‌ల పాటు సాగిన డోక్లాం వివాదం ఒక కొలిక్కి వ‌చ్చింది.

అయితే.. ఇదంతా ప్ర‌ధాని మోడీ చైనా ప‌ర్య‌ట‌న సంద‌ర్భంగా చోటు చేసుకోవ‌టం విశేషంగా చెప్పాలి. డోక్లాం ఎపిసోడ్ నేప‌థ్యంలో రెండు దేశాధినేత‌లు క‌లిసిన‌ప్పుడు ఇద్ద‌రు ఎలా వ్య‌వ‌హ‌రిస్తార‌న్న అంశంపై ఆస‌క్తి నెల‌కొంది. భార‌త ప్ర‌ధాని మోడీ.. చైనా అధ్యక్షుడు జిన్ పింగ్ ల భేటీ మీద పెద్ద ఎత్తున ఆస‌క్తి వ్య‌క్త‌మైంది. అంద‌రూ ఎదురుచూసిన స‌మ‌యం రానే వ‌చ్చేసింది. ఈ ఇద్ద‌రూ న‌వ్వుతూ ప‌లుక‌రించుకోవటంతో పాటు షేక్ హ్యాండ్ ఇచ్చుకోవ‌టం ఆస‌క్తిక‌రంగా మారింది.

వీరిద్ద‌రి షేక్ హ్యాండ్‌ కు ఇంట‌ర్నేష‌న‌ల్ కార్ఫ‌రెన్స్ సెంట‌ర్ వేదికైంది. రెండు రోజుల చైనా ప‌ర్య‌ట‌న‌లో మోడీ.. ర‌ష్యా అధ్య‌క్షుడు వ్లాదిమ‌ర్ పుతిన్ తో స‌హా బ్రిక్స్ దేశాధినేత‌ల‌తోనూ ద్వైపాక్షిక చ‌ర్చ‌లు జ‌ర‌ప‌నున్నారు. చైనా ప‌ర్య‌ట‌న త‌ర్వాత మోడీ.. మ‌య‌న్మార్ ప‌ర్య‌ట‌న‌కు వెళ్ల‌నున్నారు. ఆ దేశంలో ఆయ‌న మూడు రోజులు ప‌ర్య‌టించ‌నున్నారు.