Begin typing your search above and press return to search.

అద్వాణీకి న్యాయం చేస్తున్నారా.. మాయ చేస్తున్నారా

By:  Tupaki Desk   |   4 Jun 2019 12:37 PM IST
అద్వాణీకి న్యాయం చేస్తున్నారా.. మాయ చేస్తున్నారా
X
బీజేపీలో నరేంద్ర మోదీ, అమిత్ షాల హవా సాగుతున్న వేళ సీనియర్లంతా పక్కకుపోయిన సంగతి తెలిసిందే. మొన్నటి ఎన్నికల్లో వయసు కారణంగా కొందరు నేతలకు టికెట్లు కూడా ఇవ్వలేదు. మరికొందరు ఆరోగ్య కారణాలతో పోటీ నుంచి తప్పుకున్నారు. ఇలాంటి వేళ సీనియర్లలో కొందరిని ఇప్పుడు రాజ్యసభకు పంపనున్నట్లు తెలుస్తోంది. అయితే.. ఇది వారికి న్యాయం చేయడానికా.. లేదంటే సీనియర్లను పక్కనపెట్టారన్న మచ్చను తుడుచుకోవడానికా అన్నదే ప్రశ్న.

మొన్నటి ఎన్నికల్లో భారతీయ జనపార్టీ దిగ్గజ నాయకులు ఎల్‌.కె.అద్వానీ, మురళీమనోహర్‌ జోషి వంటి వారిని పక్కన పెట్టి విమర్శలు ఎదుర్కొన్న సంగతి తెలిసిందే. లోక్‌ సభ ఎన్నికల్లో టికెట్టు నిరాకరించిన అద్వానీ, జోషీతోపాటు సుస్మాస్వరాజ్‌ లను రాజ్యసభకు పంపే యోచనలో పార్టీ ఉన్నట్లు సమాచారం. ఈ వారంలోనే సమావేశం నిర్ణయించి దీనిపై నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది. ఎన్నికల్లో పోటీ చేసే అభ్యర్థుల విషయంలో వయోపరిమితి విధించాలని నిర్ణయించిన బీజేపీ అధిష్టానం అన్నట్టే ఈసారి 75 ఏళ్లు దాటిన అద్వానీ, జోషీలకు టికెట్టు కేటాయించలేదు. తాను వచ్చే ఎన్నికల్లో పోటీ చేయడం లేదని గత ఏడాదే సుస్మాస్వరాజ్‌ ప్రకటించారు.

అయితే.. సీనియర్లను పక్కనపెట్టడమనేది కొంత విమర్శలకు కూడా తావిచ్చింది. దీంతో ఆ మచ్చ చెరిపేసుకోవడానికి దిద్దుబాటు చర్యలకు దిగినట్లు తెలుస్తోంది. ఆ క్రమంలోనే వీరిని పెద్దల సభకు పంపాలనకుంటున్నారట. అంతేకాదు.. ఒకప్పుడు హోం మంత్రిగా పనిచేసిన అద్వాణీ స్థానంలో ఇప్పుడు అమిత్ షా ఉండడాన్ని కూడా చాలామంది పోల్చి చూసుకుంటున్నారు. దీంతో పెద్దలో సభలో ఈ నేతల అనుభవాన్ని ఉపయోగించుకుని.. వారిని, వారి అభిమానులను సంతృప్తి పరచడంతో పాటు విమర్శకుల నోళ్లు మూయించడం కూడా బీజేపీ ఆలోచనగా తెలుస్తోంది.