Begin typing your search above and press return to search.
సింగపూర్ ప్రధాని మాటకు ఇరకాటంలో మోదీ
By: Tupaki Desk | 1 Jun 2018 10:40 PM ISTఎందుకో తెలియదు కానీ ఏపీ అంటే మోదీకి అస్సలు పడదు. చంద్రబాబు మొహం చూడ్డానికి కూడా ఆయనిష్టపడడం లేదు. ఏపీ రాజధాని అమరావతికి ఏమాత్రం సహకారం అందించడం లేదు.. అప్పుడెప్పుడో చెంబుడు నీరు - మట్టి తప్ప ఇంకేమీ ఇవ్వలేదంటారు ఏపీ సీఎం చంద్రబాబు. అలా చంద్రబాబు - ఏపీ - అమరావతికి మోదీ బాగా దూరమైపోయారిప్పుడు. రాజకీయంగా టీడీపీ - బీజేపీలు బద్ధ శత్రువులైపోయాయి. కానీ... నిత్య విదేశీయాత్రికుడైన మోదీ తాజాగా సింగపూర్ వెళ్లినప్పుడు ఆయనకు ఏమాత్రం నచ్చని మాట ఒకటి సింగపూర్ ప్రధాని నుంచి వినిపించింది. అది అమరావతి.. అవును సింగపూర్ వెళ్లిన మోదీ వద్ద అక్కడి ప్రధాని అమరావతి ప్రస్తావన తెచ్చి ఇరకాటంలో పడేశారు.
మోదీ తన పర్యటనలో భాగంగా సింగపూర్ ప్రధాని లీ హసీన్ లూంగ్ - అధ్యక్షురాలు హలీమా యాకోబ్ తో సమావేశమయ్యారు. లీపై మోడీ ప్రశంసలు కురిపించారు. భారత్‌తో సంబంధాలను బలోపేతం చేసేందుకు లీ హసీన్ లూంగ్ చాలా కృషి చేస్తున్నారని - భారత్ తో పాటు ఇతర దేశాల్లో విదేశీ ప్రత్యక్ష పెట్టుబడులకు సింగపూర్ కేంద్రంగా మారిందన్నారు. ఈ సందర్భంగా లీ కూడా భారత్ లో తమ పెట్టుబడుల గురించి మాట్లాడారు. నవ్యాంధ్ర రాజధాని అమరావతి ప్రస్తావన తీసుకు వచ్చారు. సింగపూర్ కన్సార్టియం ఆధ్వర్యంలో అమరావతి నగర ప్రాజెక్టు పురోగతి బ్రహ్మాండంగా ఉందన్నారు.
సింగపూర్ ప్రధాని మాటలకు మోదీ పాపం ఇరకాటంలో పడినట్లయింది. బీజేపీ - టీడీపీ రాజకీయ సంబంధాలు పూర్తిగా దెబ్బతినడం.. అమరావతి విషయంలో టీడీపీ మోదీపై తీవ్ర ఆరోపణలు చేస్తున్న నేపథ్యంలో అమరావతి గురించి ఆయన మాట్లాడడం మోదీకి ఏమాత్రం రుచించకపోయి ఉండొచ్చు. అయితే.. చిన్న విషయాన్ని కూడా రాజకీయంగా క్యాష్ చేసుకోవడంలో ఆరితేరిపోయిన చంద్రబాబు ఈ విషయాన్ని ఎలా తనకు అనుకూలంగా చెప్తారో చూడాలి.
