Begin typing your search above and press return to search.

మోడీ ట్విస్ట్: ఇద్ద‌రు చంద్రుల్ల‌తో భేటీ

By:  Tupaki Desk   |   27 Jun 2018 6:37 AM GMT
మోడీ ట్విస్ట్: ఇద్ద‌రు చంద్రుల్ల‌తో భేటీ
X
తెలుగు రాష్ట్రాల రాజ‌కీయాల్లో కీల‌క ప‌రిణామం చోటుచేసుకునే అవ‌కాశం క‌నిపిస్తోంది. ఇందుకు ప‌దేళ్ల ఉమ్మ‌డి రాజ‌ధాని అయిన హైద‌రాబాద్ లేదంటే..న‌వ్యాంధ్ర ప్ర‌దేశ్ వేదిక కావ‌డం లేదు. ఢిల్లీ వేదిక‌గా ఈ ప‌రిణామం చోటుచేసుకునే అవ‌కాశాలు ఉన్నాయి. ఇంత‌కీ ఈ ట్విస్ట్ ఏంటంటే... తెలుగు ముఖ్యమంత్రులతో ప్రధానమంత్రి నరేంద్రమోడీ త్వరలో సమావేశంకానున్నారని స‌మాచారం. తెలుగు రాష్ట్రాలకు సంబంధించి విభజన చట్టంలో పొందుపరిచిన హామీల అమలు పురోగతి ఇతర అంశాలపై చర్చించనున్నట్టు తెలిసింది. జులై నెలలో వర్షాకాల పార్లమెంట్‌ సమావేశాలకు ముందు తెలంగాణ సీఎం కేసీఆర్‌తో, ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడితో ఢిల్లీలో భేటీకానున్నారని సమాచారం.

విభజన చట్టంలో రెండు తెలుగు రాష్ట్రాలకు పలు హామీలను పొందుపరిచిన విషయం తెలిసిందే. ఇప్పటికే ఉక్కు పరిశ్రమ ఏర్పాటు చేయాలని ఏపీలోని కడప జిల్లాలో అన్ని పార్టీల నాయకులు ఆందోళన చేపడుతున్న విషయం తెలిసిందే. కడపతో పాటు ఖమ్మం జిల్లాలోని బయ్యారంలోనూ స్టీల్‌ప్లాంట్‌ ఏర్పాటు చేయాల్సి ఉంది. ఈ విష‌యంలో అధికార టీఆర్ఎస్ పార్టీ చురుగ్గా ప్ర‌య‌త్నాలు చేస్తోంది. దీంతోపాటు విభజన చట్టంలో పేర్కొన్నట్టుగా రెండు రాష్ట్రాల్లో అసెంబ్లీ స్థానాలను పెంచాల్సి ఉంది. ఈ అంశంపై ఇప్పటికే ఇద్దరు ముఖ్యమంత్రులు పలుమార్లు ఢిల్లీకి వచ్చారు. తాజాగా మంత్రి కేటీఆర్ ఢిల్లీలో భేటీ కానున్నారు. ముఖ్యంగా తెలంగాణకు సంబంధించి స్టీల్‌ప్లాంట్‌తో పాటు ఉమ్మడి హైకోర్టు విభజన పెండింగ్‌లో ఉంది. అదనంగా రాష్ట్రంలో రిజర్వేషన్‌ కోటా పెంచాలని రాష్ట్ర ప్రభుత్వం డిమాండ్‌ చేస్తున్నది. ఈ అంశంపై గత బడ్జెట్‌ సమావేశాల్లో టీఆర్‌ఎస్‌ ఎంపీలు పార్లమెంట్‌లో ఆందోళన చేపట్టిన విషయం తెలిసిందే. అలాగే నూతన జోన్ల పరధులను సవరిస్తూ రాష్ట్రపతి ఉత్తర్వుల విడుదల చేయాల్సి ఉన్నది.

ఇలా రెండు రాష్ట్రాల‌కు సంబంధించిన కీల‌క అంశాల‌పై ప్ర‌ధాని మోడీ న‌జ‌ర్ వేసిన‌ట్లు స‌మాచారం. అందుకే ఇద్ద‌రు సీఎంల‌తో భేటీ అయ్యేందుకు నిర్ణ‌యం తీసుకున్న‌ట్లు స‌మాచారం. ఈ విషయాలన్నింటిపై ప్రధాని చర్చించే అవకాశమున్నది. ఫలితంగా పార్లమెంట్‌ సమావేశాలకు టీఆర్‌ఎస్‌ ఎంపీలు ఆటంకపరచకుండా చూడాలన్న ఆలోచనలో ప్రధాని ఉన్నట్టు తెలుస్తోంది. ఇక ఏపీకి సంబంధించి ప్రత్యేకహోదా, రైల్వేజోన్‌ తదితర అంశాలు పెండింగ్‌లో ఉన్నాయి. వీటిని సైతం ప‌రిష్క‌రించ‌నున్న‌ట్లు స‌మాచారం.