Begin typing your search above and press return to search.

మోడీ.. బాబు భేటీ ఎప్పుడంటే..?

By:  Tupaki Desk   |   7 Jan 2018 10:01 AM IST
మోడీ.. బాబు భేటీ ఎప్పుడంటే..?
X
పేరుకు మిత్ర‌ప‌క్ష‌మే అయినా.. ఏ చిన్న అవ‌కాశం వ‌చ్చినా రాజ‌కీయ ల‌బ్థి కోసం ఒక‌రిపై మ‌రొక‌రు మాట‌లు అనుకుంటున్న ప‌రిస్థితి ఏపీలో క‌నిపిస్తోంది. ఈ విష‌యంలో బాబు బ్యాచ్ తో పోలిస్తే మోడీ బ్యాచే హుషారుగా ఉంది. దాదాపు ఏడాదిగా ప్ర‌ధాని మోడీ.. ఏపీ ముఖ్యమంత్రి చంద్ర‌బాబు క‌లిసి కూర్చొని మాట్లాడుకుంది లేదు. మోడీతో మాట్లాడేందుకు బాబు సిద్ధంగా ఉన్నా.. ప్ర‌ధానే టైం ఇవ్వ‌ని ప‌రిస్థితి.

ఇలాంటి వేళ‌.. రెండు రోజుల క్రితం ఏపీ టీడీపీ ఎంపీల ప్ర‌య‌త్నంతో మోడీ టైం దొర‌క‌టం.. ప‌రుగు ప‌రుగున మోడీ వ‌ద్ద‌కు వెళ్లి త‌మ విన‌తుల జాబితాతో పాటు.. త‌మ స‌మ‌స్య‌ల మీద మోడీ దృష్టి సారించాల‌ని వేడుకున్నారు.. మ‌రో ఏడాదికి సార్వ‌త్రిక ఎన్నిక‌లు వ‌చ్చేస్తున్న వేళ‌.. ఇచ్చిన హామీలు ఏవీ పూర్తి కాలేవ‌ని.. బోలెడ‌న్ని స‌మ‌స్య‌లు పెండింగ్‌లో ఉన్నాయ‌ని వాపోయారు.

దీనిపై స్పందించిన మోడీ నేనున్నానుగా అంటూ అభ‌య హ‌స్తాన్ని ఇవ్వ‌టం తెలిసిందే. ఈ సంద‌ర్భంగా మోడీనే క‌ల్పించుకొని మీ అధినేత టైం అడిగారు.. కుద‌రటం లేదు.. త్వ‌ర‌లోనే భేటీ అవుతామ‌న్నారు. బాబుతో భేటీకి మోడీ ఓకే అన్న మాట ఆయ‌న నోటి వెంట రావ‌టంతో ఏపీ సీఎంవో రియాక్ట్ అయ్యింది. ఇరువురునేత‌ల మ‌ధ్య స‌మావేశానికి రెండు అధికారిక కార్యాల‌యాల మ‌ధ్య రాయ‌బారాలు మొద‌ల‌య్యాయి.

జ‌న‌వ‌రి 12న ప్ర‌ధానిని క‌ల‌వ‌టానికి అవ‌కాశం ఉంటుందా? అని ఏపీ ముఖ్య‌మంత్రి చంద్ర‌బాబు త‌ర‌ఫున ఏపీ సీఎంవో డేట్ కోర‌గా.. అందుకు స్పందించిన పీఎంవో జ‌న‌వ‌రి 17 అయితే ఓకే అన్న స‌మాచారం ఇచ్చిన‌ట్లుగా తెలుస్తోంది. దీంతో.. ఈ రెండు డేట్స్ లో ఏదో ఒక‌టి ఫైన‌ల్ అయ్యే అవ‌కాశం ఉంద‌ని చెబుతున్నారు. ఈసారి భేటీకి కేంద్రం నుంచి ఏపీకి రావాల్సిన నిధుల విష‌యంలో కీల‌క భేటీ జ‌ర‌గ‌నుంద‌ని చెబుతున్నారు.

ప్ర‌త్యేక హోదాకు బ‌దులుగా ప్ర‌త్యేక ప్యాకేజీకి ఓకే అన్న బాబు ప్ర‌భుత్వం.. ఇప్ప‌టివ‌ర‌కూ ఆ ఫ‌లాల్ని అందుకున్న‌ది లేదు. రాష్ట్ర విభ‌జ‌న స‌మ‌యంలో విశాఖ‌కు ఇస్తామ‌న్న రైల్వే జోన్ ముచ్చ‌ట ఒక్క అడుగు కూడా ముందుకు వేయ‌లేదు. ఇక‌.. పోల‌వ‌రం మీద కేంద్రం ఇవ్వాల్సిన నిధుల విష‌యంలోనూ పంచాయితీ ఉంది. వీట‌న్నింటి విష‌యంలో తాజా భేటీలో చ‌ర్చ‌కు వ‌చ్చే అవ‌కాశం ఉందంటున్నారు. ఏపీ స‌మ‌స్య‌ల‌పై టీడీపీ ఎంపీలు ఏక‌రువు పెట్టి.. ఎన్నిక‌లు ముంచుకొస్తున్న విష‌యాన్ని గుర్తు చేసిన నేప‌థ్యంలో మోడీ నోటి నుంచి కీల‌క ప్ర‌క‌ట‌న వెలువ‌డే అవ‌కాశం ఉంద‌న్న మాట ప‌లువురి నోట వినిపిస్తోంది.