Begin typing your search above and press return to search.

దేశ ప్రజలనుద్దేశించి మాట్లాడబోతున్న మోడీ

By:  Tupaki Desk   |   10 April 2020 8:50 AM GMT
దేశ ప్రజలనుద్దేశించి మాట్లాడబోతున్న మోడీ
X
కరోనా వైరస్ నుంచి దేశాన్ని కాపాడడానికి 21 రోజులు లాక్ డౌన్ విధించిన ప్రధాని మోడీ ఇప్పుడు మరోసారి దేశ ప్రజల ముందుకు వస్తున్నారు.కరోనా వైరస్ తో విధించిన లాక్ డౌన్ మంగళవారం ముగుస్తుందా లేదా అనే దానిపై తన నిర్ణయాన్ని ప్రకటించడానికి ప్రధాని మోడీ దేశ ప్రజలను ఉద్దేశించి ప్రసంగించనున్నారని ఢిల్లీ వర్గాల సమాచారం.దీనికి ముందు పీఎం మోడీ రేపు రాష్ట్రాల ముఖ్యమంత్రులతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహిస్తున్నారు.

అయితే ఢిల్లీ వర్గాల నుంచి అందుతున్న సమాచారం ప్రకారం.. లాక్ డౌన్ ను పొడిగించవచ్చని.. కానీ చాలా మినహాయింపులు.. మార్పులతో దీన్ని అమలు చేస్తారని అంటున్నారు. అవసరమైన సేవలు అందించే వీలు కల్పిస్తూ అంతర్రాష్టంగా అన్నీ పరిమితం చేసే కొత్త ఆలోచనను ప్రధాని మోడీ తెరపైకి తెస్తారని సమాచారం అందుతోంది.

ఇక లాక్ డౌన్ షరతులు సడలించినా పాఠశాలలు - కళాశాలలు - మత సంస్థలు మాత్రం మూసివేసే ఉండే అవకాశం కనిపిస్తోంది.

దీర్ఘకాలికంగా షట్ డౌన్ కారణంగా దేశ ఆర్థిక వ్యవస్థ భారీగా పతనమవుతోంది. ఇది అన్ని రంగాలను కుదేలు చేస్తోంది. అందుకే కొన్ని నిర్ధిష్ట రంగాలకు సడలింపు ఇచ్చి అనుమతించాలని ప్రధాని మోడీ అనుకుంటున్నట్టు తెలిసింది. అయితే ఇది సామాజిక దూర నిబంధనలతోనే పనిచేయడానికి అవకాశం కల్పిస్తారని సమాచారం.

ముఖ్యంగా కరోనాతో తీవ్రంగా నష్టపోయిన విమానయాన రంగాన్ని ప్రారంభించాలని.. విమానంలో కూర్చునే చోట ఒక సీటు వదిలి..మధ్యలో ఖాళీ ఉంచి ఒకరు ప్రయాణించేలా ఏర్పాట్లు చేయాలని చూస్తున్నారు.

దేశంలో 600కు పైగా జిల్లాల్లో 75 జిల్లాల్లోనే కరోనా తీవ్రంగా ఉందని..అక్కడే లాక్ డౌన్ కొనసాగించాలనే ఆలోచన కూడా చేస్తున్నారు.

అన్ని పార్టీల నాయకులతో బుధవారం సమావేశంలో లాక్ డౌన్ ఎత్తివేయడం సాధ్యం కాదని మోడీ చెప్పారు. ప్రజల ప్రాణాలు కాపాడడం ప్రభుత్వం ప్రాధాన్యత అని చెప్పారు.

ఇక రాష్ట్రాలను కరోనాపై పొడిగించుకునే అవకాశం కూడా కల్పిస్తున్నాయి. తాజాగా ఒడిషా ఈనెల 31వరకు లాక్ డౌన్ పొడిగించిన దేశంలోనే మొదటి రాష్ట్రంగా ఉంది. ఇక కర్ణాటక కూడా అదే బాటలో ఉంది. మిగతా రాష్ట్రాలు కేంద్రం నిర్ణయం కోసం ఎదురుచూస్తున్నాయి.

ఆర్థిక వ్యవస్థను కుదుటపరచాలంటే వేలాది మంది పేద కార్మికులు - ఉద్యోగాలు కోల్పోయిన లక్షలాది మందికి ఉపాధి దక్కాలంటే లాక్ డౌన్ ఎత్తివేయాలన్న వాదన వినిపిస్తోంది. మోడీ ఏం చేస్తారన్నది ఆసక్తిగా మారింది. దీంతో ప్రజలనుద్దేశించి ప్రసంగించబోతున్న మోడీ నిర్ణయం ఏమై ఉంటుందన్న ఉత్కంఠ మొదలైంది..