Begin typing your search above and press return to search.

ఐదు ఎంపీ సీట్ల కోసం మోడీ మాష్టారికి అంత క‌ష్ట‌మా?

By:  Tupaki Desk   |   3 Jan 2019 10:47 AM IST
ఐదు ఎంపీ సీట్ల కోసం మోడీ మాష్టారికి అంత క‌ష్ట‌మా?
X
మోడీ అంటే మాట‌లా? రాష్ట్ర ముఖ్య‌మంత్రుల‌కు సైతం అపాయింట్ ఇవ్వ‌నంత బిజీ. మ‌రి.. అంత‌టి పెద్ద మ‌నిషి ఏపీలాంటి రాష్ట్రంలో ఐదు ఎంపీ స్థానాల‌కు సంబంధించిన పోలింగ్ బూత్ ఏజెంట్ల‌తో టెలీకాన్ఫ‌రెన్స్ లో మాట్లాడ‌ట‌మా? అది కూడా.. ఐదు లోక్ స‌భా స్థానాల‌కు సంబంధించిన వారితోనా? క్ష‌ణం తీరిక లేని మోడీ.. త‌మ ప్ర‌భావం ఏమీ చూపించ‌లేని ఐదు స్థానాల కోసం అంత క‌ష్ట‌ప‌డాల్సిన అవ‌స‌రం ఏమొచ్చింది? అన్న‌ది ఇప్పుడు ఆస‌క్తిక‌రంగా చెప్ప‌క త‌ప్ప‌దు.

ఏపీలో బీజేపీ బ‌లం అంత‌గా ఉన్న‌ది లేదు. అయిన‌ప్ప‌టికీ మోడీ మాత్రం ఏపీ ప‌రిధిలోని ఐదు (మచిలీపట్నం - నరసాపురం - కాకినాడ - విశాఖపట్నం - విజయనగరం) లోక్ స‌భ స్థానాల‌కు సంబంధించి బీజేపీ పోలింగ్ బూత్ కార్య‌క‌ర్త‌ల‌తో భేటీ కావ‌టం.. ఆ సంద‌ర్భంగా ఏపీ ముఖ్య‌మంత్రి చంద్ర‌బాబును టార్గెట్ చేయ‌టం తెలిసిందే.

ఇంత‌కూ అంత‌ శ్ర‌మ మోడీ ఎందుకు ప‌డిన‌ట్లు? అన్న‌ది ప్ర‌శ్న‌. బూత్ కార్య‌క‌ర్త‌లు మాట్లాడే వేళ‌.. ఏపీ ముఖ్య‌మంత్రి చంద్ర‌బాబుపై ఫుల్ గుస్సాను ప్ర‌ద‌ర్శించ‌టం ఒక ఎత్తు అయితే.. తెలంగాణ ఉదాహ‌ర‌ణ‌ను ఏపీలో చూపించ‌టం మ‌రో అంశంగా చెప్పాలి.

ఏపీ మార్పును కోరుకుంటుంద‌ని.. తెలంగాణ‌లో మాదిరే ఏపీలోనూ మ‌హాకూట‌మ‌ని ప్ర‌జ‌లు రిజెక్ట్ చేయ‌బోతున్న‌ట్లుగా మోడీ చెప్పారు. ప్ర‌స్తుతం నాయ‌కత్వం మీద ప్ర‌జ‌లు తీవ్ర ఆగ్ర‌హంతో ఉన్న‌ట్లు చెప్పిన మోడీ.. బాబు పాల‌న‌లో కుంభ‌కోణాలు ఉన్న‌ట్లుగా ఆరోపించారు.

స్కాంలు జ‌రుగుతున్న‌ట్లుగా చెప్పారే కానీ.. వాటి లోతుల్లోకి వెళ్ల‌ని మోడీ.. టీడీపీ.. కాంగ్రెస్ ల మ‌ధ్య దోస్తానా మీద ఎక్కువ‌గా దృష్టి పెట్ట‌టం క‌నిపించింది. నాడు కాంగ్రెస్ ను దుష్ట కాంగ్రెస్ అని అభివ‌ర్ణించిన ఎన్టీఆర్ తీరుకు భిన్నంగా ఇప్పుడు టీడీపీ నేత‌లు కాంగ్రెస్ దోస్త్ అంటున్న విష‌యాన్ని ప్ర‌స్తావించిన మోడీ.. రాష్ట్రానికి కేంద్రం సాయం చేయ‌టం లేద‌న్న విమ‌ర్శ‌లో నిజం లేద‌ని చెప్పే ప్ర‌య‌త్నం చేశారు.

ఏపీకి ఏ ప్ర‌భుత్వ చేయ‌నంత భారీ ప్ర‌యోజ‌నాల్ని తాము చేసిన‌ట్లుగా మోడీ చెప్ప‌కున్నారు. రాష్ట్రాన్ని ముక్క‌లు చేసిన కాంగ్రెస్ తో టీడీపీ క‌ల‌వ‌టం వ‌ల్ల తెలంగాణ‌లో ఏం జ‌రిగిందో తెలుస‌న్న మోడీ.. ఏపీలోనూ అదే రిపీట్ కానున్నట్లుగా చెప్ప‌టం గ‌మ‌నార్హం.

ఇదంతా ఎందుకంటే.. నిద్ర లేచింది మొద‌లు త‌న‌పై ఏపీ సీఎం బాబు అదే ప‌నిగా విమ‌ర్శ‌నాస్త్రాల్ని సంధిస్తున్న వేళ‌.. వాటికి గ‌ట్టి కౌంట‌ర్ ఇవ్వాల్సిన అవ‌స‌రాన్ని మోడీ గుర్తించిన‌ట్లుగా చెబుతున్నారు.కాంగ్రెస్‌తో క‌లిసిన బాబు మోడీపై స‌మ‌రానికి సై అంటున్న వేళ‌.. అలాంటి వాటికి అవ‌కాశం లేకుండా చేయ‌టం.. బాబుపై బ‌ల‌మైన విమ‌ర్శ‌ల్ని సంధించ‌టం ద్వారా ఆయ‌న్ను డిఫెన్స్ లో ప‌డేయాల‌న్న ఆలోచ‌న‌లో ఉన్న‌ట్లుగా చెబుతున్నారు.

బాబు చేస్తున్న ప్ర‌చారానికి బ్రేకులు వేయ‌టం.. ఓట‌ర్ల‌తో నేరుగా సంబంధాలు ఉండే బూత్ స్థాయి కార్య‌క‌ర్త‌ల‌తో మాట్లాడ‌టం ద్వారా వారిలో కొత్త ఉత్తేజాన్ని నింప‌టం.. బాబు చేసే ప్ర‌చారానికి కౌంట‌ర్ అస్త్రాన్ని తానే స్వ‌యంగా అందించాల‌న్న ఉద్దేశంతోనే మోడీ మాష్టారు అంత క‌ష్టానికి సిద్ధ‌మైన‌ట్లుగా చెబుతున్నారు. ఇప్ప‌టి మాదిరే ఏపీలోని మిగిలిన నియోజ‌క‌వ‌ర్గాల బూత్ స్థాయి కార్య‌క‌ర్త‌ల‌తో నేరుగా మాట్లాడ‌నున్నారు. దీని ద్వారా ఏపీలో క‌మ‌ల‌నాథుల వాయిస్ ను ప్ర‌జ‌ల్లోకి బ‌లంగా తీసుకెళ్లాల‌న్న ప్లానింగ్‌లో భాగంగానే తాజా మీడియో కాన్ఫ‌రెన్స్ గా చెప్ప‌క త‌ప్ప‌దు.