Begin typing your search above and press return to search.

ఆ ఐడియా రాలేదని చాయ్ వాలా ఫీలయ్యాడే

By:  Tupaki Desk   |   17 Jan 2016 11:55 AM IST
ఆ ఐడియా రాలేదని చాయ్ వాలా ఫీలయ్యాడే
X
దేశానికి రాజైనా తన మూలాల్ని సమయోచితంగా ప్రస్తావిస్తూ దేశ జనుల మనసుల్ని దోచుకోవటం నరేంద్రమోడీకి మామూలే. తాజాగా ఆయన మరోసారి తన మూలాల్ని చెప్పుకొచ్చారు. ఒక సాదాసీదా వ్యక్తికి వచ్చిన ఐడియా పట్ల విస్మయానికి గురి కావటమే కాదు.. అలాంటి ఐడియా తనకెందుకు రాలేదని ఆయన తెగ ఫీలైనట్లుగా ఆయన మాటల్ని చూస్తే అర్థమవుతుంది.

స్టార్టప్ ఇండియా కార్యక్రమ కార్యాచరణను ప్రకటించిన ప్రధాని మాట్లాడుతూ.. ‘‘ఓయో రూమ్స్’’ వ్యవస్థాపకుడు రితేష్ గురించి ప్రత్యేకంగా ప్రస్తావించారు. తన ప్రసంగంలో పలువురి గురించి ప్రస్తావించటం.. వారి గొప్పతనాన్ని కీర్తించటం.. మరెందరికో స్ఫూర్తిగా మార్చటం లాంటివి మోడీ తరచూ చేస్తుంటారు. ప్రముఖుల్ని.. సామాన్యుల్ని తన ప్రసంగంలో ప్రస్తావించటం ద్వారా మోడీ తనను తాను ఒక అరుదైన వ్యక్తిగా ఆవిష్కరిస్తారు.

నిజమే.. మోడీకి ముందు ప్రధానమంత్రిగా వ్యవహరించిన ఎవరూ ఇలా మాట్లాడింది లేదు. ప్రధానమంత్రి లాంటి వ్యక్తి నోటి నుంచి ఇప్పటివరకూ వినని చాలానే మాటలు మోడీ నోటి నుంచి వింటున్న పరిస్థితి. ఒక మేనేజ్ మెంట్ గురు మాట్లాడిన తీరులో మాటలు చెప్పే మోడీ ఈసారి మాత్రం పెద్దరికాన్ని పక్కన పెట్టి తాను సైతం కొన్ని విషయాల పట్ల విస్మయానికి గురి అవుతానని.. ఒక సామాన్యుడి ఆలోచనల విషయంలోఅసూయ పడతానన్నట్లు మాటలు చెప్పారు. ఇదంతా వ్యూహాత్మకం కావొచ్చు. కానీ.. ఒక ప్రధాని స్థాయి వ్యక్తి నోటి నుంచి ఇలాంటి మాటలు వింటుంటే కలిగే అనుభూతి వేరుగా ఉంటుంది.

ఇలాంటి విషయాలు మోడీకి బాగా తెలుసు. అందుకే ఆయన తనకొచ్చిన మంచి అవకాశాన్ని వదులుకోలేదు. తన దృష్టికి వచ్చిన ఓయో రూమ్స్ వ్యవస్థాపకుడి గురించి చెప్పి.. అతడి గొప్పతనాన్ని కీర్తించే పనిలో తనను తాను కాస్త తక్కువ చేసుకునే ప్రయత్నం చేశారు. ‘‘ఒయో రూమ్స్ వ్యవస్థాపకుడు రితేష్ గురించి విన్నాక.. హోటళ్లను అనుసంధానం చేసే ఆలోచన ఈ ఛాయ్ వాలాకు ఎందుకు రాలేదా అని విస్మయం చెందా’’ అంటూ పొగిడేశారు. నిజానికి ఇదంతా జాతి జనుల మనసు దోచుకోవటానికేనన్న విషయాన్ని ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదేమో.