Begin typing your search above and press return to search.

సర్టిఫికేట్ ఇవ్వమంటూ ప్రత్యర్థుల్నిదులిపేశారు

By:  Tupaki Desk   |   28 Sept 2015 12:02 PM IST
సర్టిఫికేట్ ఇవ్వమంటూ ప్రత్యర్థుల్నిదులిపేశారు
X
ప్రధాని మోడీ స్టైల్ కాస్త భిన్నంగా. ఇప్పటివరకూ ప్రధానులుగా వ్యవహరించిన వారు.. తమ విదేశీ పర్యటనల సందర్భంగా ఆయా దేశాల నేతలతో చర్చలు జరపటం.. మహా అయితే సంయుక్త సమావేశాన్ని నిర్వహించటం లాంటి అధికారిక కార్యక్రమాల్ని నిర్వహించి సైలంట్ అయిపోతారు. కానీ.. మోడీ అందుకు పూర్తి భిన్నం.

ఆయన వెళ్లే ఏ దేశంలో అయినా సరే.. తన ముద్రను వేసి వస్తారు. కొన్ని దేశాల్లో అయితే.. బహిరంగ సమావేశాలు ఏర్పాటు చేసి.. రాజకీయ విమర్శలు చేయటానికి కూడా వెనుకాడరు. ప్రస్తుతం అమెరికా పర్యటనలో ఉన్న ఆయన.. భారత కాలమానం ప్రకారం సోమవారం ఉదయం కాలిఫోర్నియాలోని శాప్ సెంటర్ లో ప్రవాస భారతీయుల్ని ఉద్దేశించి ప్రసంగించారు.

ఈ సందర్భంగా ఉత్తేజపూరిత వ్యాఖ్యలతో పాటు.. తన రాజకీయ ప్రత్యర్థులపై తనదైన శైలిలో సటైర్లు వేశారు. భరతమాత ముద్దు బిడ్డలకు శతకోటి వందనాలంటూ తన ప్రసంగాన్ని ఇంగ్లిషులో మొదలు పెట్టి.. హిందీలోకి వెళ్లిపోయిన ఆయన కాంగ్రెస్ అధినేత్రి.. కుమారుడు.. కూతురు.. అల్లుడిపై సటైర్లు.. విమర్శలు చేశారు.

తన నిజాయితీకి మీ సర్టిఫికేట్ కావాలన్న మోడీ.. పనిలో పనిగా సోనియా ఫ్యామిలీ గురించి పరోక్ష వ్యాఖ్యలు చేశారు. ‘‘మన దేశంలో రాజకీయ నాయకులు మీద.. వారు పదవుల్లోకి వచ్చిన కొద్ది కాలానికే ఆరోపణలు వస్తాయి. ఆయన రూ.50కోట్లు.. ఈయన రూ.100కోట్లు తీసుకున్నారంటారు. కొడుకు రూ.150కోట్లు.. కూతురు రూ.500కోట్లు.. అల్లుడు రూ.1000 కోట్లు సంపాదించుకున్నారని చెబుతారు. సవతి తమ్ముడు కాంట్రాక్టులు.. ఇంకొకళ్లు ఇంకోటి తీసుకున్నారని చెబుతారు. ఇలాంటివి మీరు విని.. విని మీ చెవులు దిబ్బళ్లు పడిపోయాయా? అవినీతి మీద మీకు చికాకు పుట్టిందా లేదా? నేను మీ మధ్యన నిలబడి ఉన్నా. నా మీద ఏమైనా ఆరోపణలు వచ్చాయా?’’ అంటూ మోడీ ప్రశ్నించారు.

దానికి ప్రతిగా.. లేదు లేదంటూ ప్రవాస భారతీయులు పెద్ద ఎత్తున తమ స్పందనను వినిపించారు. తనకు సర్టిఫికేట్ ఇప్పించుకునే క్రమంలో.. రాజకీయ ప్రత్యర్థులపై అవినీతి ముద్ర వేయటంలో మోడీ సక్సెస్ అయ్యారని చెప్పొచ్చు.