Begin typing your search above and press return to search.

మోడీ : యోగా అయిపోయింది.. ఇక వేదాలే

By:  Tupaki Desk   |   11 March 2018 7:20 PM IST
మోడీ : యోగా అయిపోయింది.. ఇక వేదాలే
X
నరేంద్రమోడీ ప్రభుత్వం ఒక ప్రణాళిక ప్రకారం భారతదేశాన్ని నెమ్మదిగా కాషాయీకరణ చేసేస్తున్నదనే ప్రచారం భాజపా వ్యతిరేక శక్తులనుంచి చాలాకాలంగా జరుగుతూనే ఉంది. ఇలాంటి విమర్శలు ఎన్ని ఎదురవుతున్నప్పటికీ.. నరేంద్రమోడీ తాను చేయదలచుకున్న పని చేసుకుంటూ పోతూనే ఉన్నారు. హైందవ ధర్మం ప్రతిపాదించే యోగా ను - ఒక మతానికి చెందిన వ్యవహారం గా కాకుండా - ప్రపంచం మొత్తం ఆమోదించి తీరాల్సిన విషయంగా ఆయన దానికి బ్రాండ్ అంబాసిడర్ గా నిలబడ్డారు. యోగాను ఇప్పుడు ప్రపంచ వ్యాప్తం చేశారు. ప్రపంచమంతా యోగా డే నిర్వహించే పరిస్థితి తీసుకువచ్చారు. ఈ పర్వం అయిపోయింది. ఇప్పుడిక వేదాల ను ప్రపంచవ్యాప్తం చేయడం మీద మోడీ దృష్టి పెట్టినట్టు తెలుస్తోంది.

గురజాడ వారు రాసిన కన్యాశుల్కం నాటకంలో.. ‘‘అన్నీ వేదాల్లోనే ఉన్నాయి’’ అంటూ అవధాన్లు నోరు నొక్కుకుంటూ చెబుతూ ఉంటే.. మనం కామెడీకోసం అలా రాశారేమో అనుకున్నాం.. కానీ కొన్ని కొన్ని దృష్టాంతాలు బయటపడుతున్న కొద్దీ. విమాన శాస్త్రమూ - ఇత్యాది అనేక నవతరపు శాస్త్రీయ ఆవిష్కరణలకు సంబంధించిన మూలాలు వేదాల్లో ఉన్నాయని తెలుసుకుంటూ వచ్చాం. అయితే ఇప్పుడు ప్రధాని మోడీ.. వేదాల ప్రాధాన్యాన్ని ప్రపంచం మొత్తం గుర్తించడానికి ఓ సరికొత్త ప్రచారాస్త్రాన్ని సిద్ధం చేసినట్లుగా కనిపిస్తోంది.

వాతావరణ మార్పుల సమస్యల పరిష్కారానికి కూడా వేదాల సారాన్ని వాడుకోవాలని.. ప్రధాని కోరుతున్నారు. ఇంటర్నేషనల్ సోలార్ అలయెన్స్ మొదటి సదస్సులో ప్రధాని మాట్లాడారు. ఇదేమీ చిన్న వేదిక కాదు. భారత రాష్ట్రపతి, ఫ్రెంచి అధ్యక్షుడితో పాటు 23 దేశాల అధినేతలు పాల్గొన్న సమావేశం ఇది. ఇలాంటి కీలక సమావేశంలో.. ప్రపంచపు భవితవ్యానికి సవాలుగా మారుతున్న వాతావరణ మార్పుల సమస్యలను పరిష్కరించడానికి వేదాల సారం ఉపయోగపడుతుందని మోడీ అన్న మాటలు ఖచ్చితంగా ఎంతో కొంత పనిచేస్తాయనే చెప్పాలి.

సూర్యుడు విశ్వానికి ఆత్మ అని వేదాలు చెబుతున్న సంగతిని పరిగణించి.. వేదసారాల దృక్కోణంలోంచి శాస్త్రీయ సంగతుల్ని అధ్యయనం చేయాలని ఆయన అంటన్నారు. సోలార్ ప్రచారం వరకు ఓకె.. కానీ.. వేదాల సారాన్ని ప్రపంచవ్యాప్తం చేయడానికి ఆయన కొత్త వ్యూహంతో వెళుతున్నట్లుంది.