Begin typing your search above and press return to search.

మొద‌టి మీటింగ్ లోనే మోడీ వ‌రాల జ‌ల్లు

By:  Tupaki Desk   |   1 Jun 2019 11:01 AM IST
మొద‌టి మీటింగ్ లోనే మోడీ వ‌రాల జ‌ల్లు
X
మోడీ 1.0 అప్ గ్రేడ్ వెర్ష‌న్ గా మోడీ 2.0ను అభివ‌ర్ణిస్తున్న దానికి త‌గ్గ‌ట్లే మోడీ తీరు ఉంది. కేబినెట్ కొలువు తీరిన త‌ర్వాతి రోజున నిర్వ‌హించిన మంత్రివ‌ర్గ స‌మావేశంలో సంచ‌ల‌న నిర్ణ‌యాల్ని తీసుకుంది మోడీ స‌ర్కారు. తొలి మంత్రివ‌ర్గ స‌మావేశంలో వ‌రాల జ‌ల్లు కురిపిస్తూ ప‌లు నిర్ణ‌యాల్ని తీసుకోవ‌టం గ‌మ‌నార్హం. జై జ‌వాన్.. జై కిసాన్ అన్న రీతిలో ఆయ‌న వ‌రాలు ఉన్నాయి.

దేశంలో ఇప్ప‌టివ‌ర‌కూ ఎప్పుడూ లేని రీతిలో చిరు వ్యాపారుల‌కు ఒక కొత్త ప‌థ‌కాన్ని ప్ర‌క‌టించి ఆశ్చ‌ర్యానికి గురి చేశారు. రైతుల‌తో పాటు చిన్న వ్యాపారుల‌కు పెన్ష‌న్ విధానాన్ని తాజాగా ప్ర‌క‌టించారు. ప‌రిమితుల‌తో తాను గ‌తంలో ప్ర‌క‌టించిన పీఎం-కిసాన్ ప‌థ‌కాన్ని తాజాగా రైతులంద‌రికి అమ‌లు చేయ‌నున్న‌ట్లుగా ప్ర‌క‌టించారు. రెండు హెక్టార్ల ప‌రిమితిని ఎత్తివేస్తూ నిర్న‌యం తీసుకున్నారు.

దీంతో ప్ర‌తి ఏటా 14.5 కోట్ల మంది రైతుల‌కు ఏటా రూ.6వేలు చొప్పున సాయం అంద‌నుంది. రైతుల‌కు.. చిన్న వ్యాపారుల‌కు భాగ‌స్వామ్య పింఛ‌న్ స్కీంను ప్ర‌క‌టించి సంచ‌ల‌నంగా మారారు మోడీ. అంతేకాదు.. మాజీ.. అమ‌ర జ‌వాన్ల పిల్ల‌ల‌కు సాయం చేసేలా వారికి ఇచ్చే ఉప‌కార వేత‌నాల్ని పెంచేస్తూ నిర్ణ‌యం తీసుకున్నారు. ఉగ్ర‌వాద‌.. మావోయిస్ట్ దాడుల్లో మ‌ర‌ణించిన పోలీసుల పిల్ల‌ల‌కూ సాయం అందించే ప‌థ‌కానికి ఆయ‌న సంతకం చేశారు. త‌న మొద‌టి కేబినెట్ స‌మావేశంలో సంచ‌ల‌న నిర్ణ‌యాల‌తో పాటు.. వ‌రాల జ‌ల్లు కురిపించిన మోడీ తీరు ఇప్పుడు అంద‌రి దృష్టిని ఆక‌ర్షించేలా ఉంద‌ని చెప్ప‌క త‌ప్ప‌దు.

త‌న తొలి స‌మావేశంలో తీసుకున్న నిర్ణ‌యాలు.. ప్ర‌క‌టించిన ప‌థ‌కాలు.. వాటి తీరు తెన్నుల్ని చూస్తే..

+ తెలంగాణ‌లో కేసీఆర్ స‌ర్కారు అమ‌లు చేస్తున్న రైతుబంధు ప‌థ‌కం త‌ర‌హాలో మోడీ స‌ర్కారు ఎన్నిక‌ల‌కు ముందు పీఎం-కిసాన్ ప‌థ‌కాన్ని ప్ర‌క‌టించింది. ఇందులో భాగంగా రెండు హెక్టార్లు.. 5 ఎక‌రాల వ్య‌వ‌సాయ‌ భూమి ఉన్న రైతుల‌కు ఏటా రూ.6వేలు చొప్పున పెట్టుబ‌డి సాయం ఇవ్వ‌నున్న‌ట్లు ప్ర‌క‌టించి.. తొలి విడ‌త‌లో 3.11 కోట్ల మందికి.. రెండో విడ‌త‌లో 2.66 కోట్ల మంది ల‌బ్థిదారుల బ్యాంకు ఖాతాల్లో డ‌బ్బులు ప‌డ్డాయి. తాజాగా నిర్వ‌హించిన మంత్రివ‌ర్గ స‌మావేశంలో రెండు హెక్టార్ల కండిష‌న్ ను తీసేశారు. ఇక‌పై.. చిన్న‌.. పెద్ద అన్న తేడా లేకుండా ప్ర‌తి రైతుకు పీఎం కిసాన్ ప‌థ‌కం వ‌ర్తిస్తుంది. ఈ నిర్ణ‌యం కార‌ణంగా 14.5కోట్ల మంది రైతుల‌కు మేలు జ‌ర‌గ‌నుంది. అదే స‌మ‌యంలో ప్ర‌భుత్వ ఖ‌జానాపై రూ.12,500 కోట్ల భారం ప‌డ‌నుంది. ఇక‌పై ఏటా ఈ ప‌థ‌కం కోసం రూ.87వేల కోట్లు అవ‌స‌రం కానున్నాయి.

+ దేశంలోని కోట్లాదిమంది రైతుల‌కు ప్ర‌ధాన‌మంత్రి కిసాన్ పింఛ‌న్ యోజ‌న పేరుతో ప‌థ‌కాన్ని అమ‌లు చేయాల‌ని నిర్ణ‌యించారు. అయితే.. ఇది ఎవ‌రికి వారు త‌మ‌కు న‌చ్చితేనే భాగ‌స్వాములు కావొచ్చు. ఈ ప‌థ‌కం 18 నుంచి 40 ఏళ్ల లోపు ఉన్న చిన్న‌.. మ‌ధ్య‌త‌ర‌హా రైతుల‌కు అమ‌లు చేస్తారు. వీరు నెల‌కు కొంత మొత్తాన్ని త‌మ వాటాగా చెల్లించాల్సి ఉంటుంది. రైతు త‌మ వాటాగా ఎంత చెల్లిస్తారో.. ప్ర‌భుత్వం కూడా అంతే మొత్తాన్ని చెల్లిస్తుంది. స‌ద‌రు రైతుకు 60 ఏళ్లు వ‌చ్చాక అత‌నికి ప్ర‌తి నెల రూ.3వేల చొప్పున పింఛ‌న్ అందిస్తారు. ఒక‌వేళ పింఛ‌న్ తీసుకునే రైతు మ‌ర‌ణిస్తే.. వారి భాగ‌స్వామికి ప‌థ‌కంలో మొత్త‌మైన స‌గాన్ని నెల‌స‌రి పింఛ‌న్ గా అందిస్తారు. మ‌రో కీల‌క‌మైన నిర్ణ‌యం ఏమంటే.. ఈ ప‌థ‌కంలో భాగ‌స్వామి అయ్యే రైతు.. నెల వారీగా తాము చెల్లించాల్సిన మొత్తాన్ని.. త‌మ‌కు ఇచ్చే ప‌థ‌కాల మొత్తంలో మిన‌హాయించుకునే అవ‌కాశాన్ని క‌ల్పించారు. తొలి మూడేళ్ల‌లో ఈ ప‌థ‌కం ద్వారా 5కోట్ల మంది ల‌బ్థి పొందుతార‌ని.. ఇందుకోసం క‌నీసం రూ.10వేల కోట్ల వ‌ర‌కు ఖ‌ర్చు కానుంది.

+ రైతుల‌కు ఏ విధంగా అయితే పింఛ‌న్ సౌక‌ర్యాన్ని క‌ల్పిస్తున్నారో.. దేశ వ్యాప్తంగా ఉన్న చిరు వ్యాపారులకు సైతం వ‌ర్తించేలా నిర్ణ‌యం తీసుకున్నారు. ఏడాదికి కోటిన్న‌ర లోపు ట‌ర్నోవ‌ర్ ఉండే వ్యాపారులు ఈ పింఛ‌న్ ప‌థ‌కానికి అర్హులు. 18 ఏళ్ల నుంచి 40 ఏళ్ల మ‌ధ్య వ‌య‌స్కులు ఇందులో చేరొచ్చు. నెల నెలా వారు కొంత మొత్తాన్ని క‌ట్టాల్సి ఉంటుంది. 60 ఏళ్లు వ‌చ్చిన త‌ర్వాత నుంచి వారికి నెల‌కు రూ.3వేల చొప్పున పింఛ‌న్ అందిస్తారు. దేశ వ్యాప్తంగా ఈ ప‌థ‌కం కార‌ణంగా 3 కోట్ల మంది వ్యాపారులు ల‌బ్థి పొందే వీలుంది.

+ జాతీయ రక్షణ నిధి (ఎన్డీఎఫ్‌) కింద అందజేసే ప్రధాన మంత్రి స్కాలర్‌షిప్‌ పథకాన్ని ఇకపై రాష్ట్రాల్లోని పోలీసు సిబ్బందికి కూడా వర్తింపజేయనున్నారు. ప్రస్తుతం ఇస్తున్న స్కాలర్‌షిప్‌ మొత్తాన్ని కూడా పెంచారు. ఈ పథకం కింద ప్రస్తుతం బాలురకు ప్రతినెలా రూ.2000 చొప్పున స్కాలర్‌షిప్‌ ఇస్తుండగా.. దీనిని రూ.2,500కు పెంచారు. బాలికలకు ఇస్తున్న మొత్తాన్ని రూ.2,250 నుంచి 3,000కు పెంచారు. ఇకపై దీనిని ఉగ్రవాద, నక్సల్స్‌ దాడుల్లో అమరులైన పోలీసుల పిల్లలకూ అందించనున్నారు.

+ దేశవ్యాప్తంగా ఆవులు, గేదెలు, గొర్రెలు, మేకలు, పందులు తదితరాలకు సోకే గాలికుంటు వ్యాధికి టీకాలు ఇప్పించడానికి కేంద్రం ప్రత్యేక పథకాన్ని అమలు చేయనుంది. ఈ పథకంలో భాగంగా 30 కోట్ల ఆవులు, ఎద్దులు, గేదెలతో పాటు, 20 కోట్ల గొర్రెలు, మేకలు, కోటి పందులకు టీకాలు ఇస్తారు.