Begin typing your search above and press return to search.

హైద‌రాబాద్ రాక‌ముందే..కేసీఆర్‌కు మోడీ ఝ‌ల‌క్‌

By:  Tupaki Desk   |   26 Nov 2017 7:46 PM IST
హైద‌రాబాద్ రాక‌ముందే..కేసీఆర్‌కు మోడీ ఝ‌ల‌క్‌
X
మ‌రో రెండ్రోజుల్లో తెలంగాణ రాష్ట్ర ప‌ర్య‌ట‌న‌కు వ‌స్తున్న ప్ర‌ధాన‌మంత్రి న‌రేంద్ర మోడీ...త‌న టూర్ కంటే ముందే తెలంగాణ‌ ముఖ్య‌మంత్రి కేసీఆర్‌కు ఝ‌ల‌క్ ఇచ్చారని ప్ర‌చారం జ‌రుగుతోంది. హైద‌రాబాద్‌లో ప్ర‌త్యేక భేటీ కోసం కేసీఆర్ శ‌త‌విధాల ప్ర‌య‌త్నించ‌గా...అలాంటిదేమీ కుద‌ర‌ద‌ని...ఢిల్లీకి వ‌స్తే...మాటామంతి అని మోడీజీ తేల్చిచెప్పారని స‌మాచారం. ఇదంతా ఎస్సీ వ‌ర్గీక‌ర‌ణ విష‌యంలో కేసీఆర్ వేసిన రాజ‌కీయ ముంద‌డుగుకు సంబంధించిన అంశంలో. ఎస్సీ వర్గీకరణపై హైదరాబాద్ పర్యటనలో అఖిలపక్షంతో ప్రధాని చర్చించడం కుదురదని ప్రధానమంత్రి కార్యాలయం రాష్ట్ర ప్రభుత్వానికి స్పష్టం చేసినట్లు సమాచారం.

ఇటీవల అసెంబ్లీ సమావేశాల్లో ఎస్సీ వర్గీకరణ డిమాండ్‌పై చర్చ సందర్భంగా ప్రతిపక్షాల విజ్ఞప్తులను పరిగణనలోకి తీసుకొన్న ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్‌రావు.. నవంబర్ చివరలో హైదరాబాద్‌లో జరుగనున్న గ్లోబల్ ఎంటర్‌ప్రెన్యూర్ సమ్మిట్ (జీఈఎస్) సదస్సుకు హాజరవుతున్న సందర్భంగా ఆ అంశంపై చర్చించడానికి తమకు సమయం ఇవ్వాలని ప్రధానమంత్రికి రాసిన లేఖలో కోరారు. అయితే దీనికి మోడీ టీం నో చెప్పింది. అఖిలపక్ష బృందం ఢిల్లీకి వస్తే.. అక్కడ కూలంకషంగా చర్చించవచ్చని ప్ర‌ధాన‌మంత్రి కార్యాల‌యం నుంచి సమాచారం వచ్చినట్లు తెలిసింది.

హైదరాబాద్ పర్యటనలో భాగంగా జీఈఎస్ సదస్సు, మెట్రో రైల్ ప్రారంభోత్సవం తదితర అంశాలకు సంబంధించి ఇప్పటికే షెడ్యూల్ ఖరారైనందున.. ఇక్కడ ఎస్సీ వర్గీకరణపై చర్చించడం కుదురదని.. ఢిల్లీకి రావాలని ప్రధానమంత్రి కార్యాలయం తెలియజేసినట్లు సమాచారం. ఎస్సీ వర్గీకరణపై చర్చించేందుకు తమ రాష్టానికి చెందిన అఖిలపక్ష బృందానికి హైదరాబాద్ పర్యటన సందర్భంగా అపాయింట్‌మెంట్ ఇవ్వాలని కోరుతూ రాష్ట్రప్రభుత్వం లేఖ రాసినప్ప‌టికీ...కీల‌క విష‌యంలో ప్ర‌ధాని మోడీ నో చెప్ప‌డం...సీఎం కేసీఆర్‌కు ఝ‌ల‌క్ వంటిదేన‌ని ప‌లువురు అంటున్నారు.