Begin typing your search above and press return to search.

రేణుకా చౌదరిపై మోడీ వెటకారాలు!

By:  Tupaki Desk   |   7 Feb 2018 11:33 AM GMT
రేణుకా చౌదరిపై మోడీ వెటకారాలు!
X
ప్రధాని నరేంద్రమోడీ బుధవారం ఉదయం లోక్ సభలో ప్రసంగించిన సంగతి, కాంగ్రెస్ పార్టీని అమితంగా నిందించిన సంగతి, తెలుగుదేశం పార్టీని ఆంధ్రుల వైభవాన్ని అదే పనిగా పొగిడిన సంగతి, ఆంద్రప్రదేశ్ కు ఒక్క పైసా హామీ కూడా తేల్చకుండా ప్రసంగం పూర్తి చేసిన సంగతి అందరికీ తెలిసిందే. బుధవారం మధ్యాహ్నం రాజ్యసభలో కూడా మోడీ ప్రసంగించారు. ఆయన తన సహజ శైలిలో కాంగ్రెస్ మీద సెటైర్లు వేస్తూనే ఈ ప్రసంగాన్ని నడిపించారు.

అయితే మోడీ ప్రసంగానికి విపక్షం కాంగ్రెస్ సభ్యులు ఉన్న బెంచీల నుంచి పదేపదే అభ్యంతరాలు వ్యక్తం అయ్యాయి. ఆయన ప్రసంగానికి అడ్డు తగలడానికి కాంగ్రెస్ సభ్యులు పదేపదే ప్రయత్నించారు. వారిని నియంత్రించడానికి సభాపతి స్థానంలో ఉన్న ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు చాలా కష్టపడాల్సి వచ్చింది. ‘‘మీరు అదుపులో ఉండాలి.. నిబంధనలకు విరుద్ధంగా మీరు వ్యవహరించడాన్ని నేను ఎట్టి పరిస్థితుల్లోనూ అనుమతించేది లేదు.. ప్రసంగం సాగుతుండగా మధ్యలో అడ్డు పడడానికి వీల్లేదు.. మీకు అభ్యంతరాలు ఉంటే చేయి పైకి లేపి సూచించిండి.. నేను గుర్తుంచుకుని తర్వాత అవకాశం ఇస్తా..’’ అంటూ వెంకయ్య పదేపదే చెప్పారు. అయితే మోడీ ప్రసంగిస్తుండగా.. ఆయన చెబుతున్న వివరాలు హాస్యాస్పదంగా ఉన్నాయనే అర్థం వచ్చేలా కాంగ్రెస్ కు చెందిన రేణుకాచౌదరి పెద్దపెట్టున ‘‘హ్హహ్హ..హ్హహ్హ’’ అంటూ నవ్వసాగారు. వెంకయ్యనాయుడు నియంత్రించే ప్రయత్నం చేసినా.. తన నవ్వుల్ని ఆమె కొనసాగించారు.

వెంకయ్యనాయుడు మోడీ ప్రసంగాన్ని కాసేపు ఆపుచేయించి రేణుకా చౌదరిని హెచ్చరించారు. మీరిలా ప్రవర్తించడం కరెక్టు కాదు. ‘నేను మీ పేరు కూడా చెప్పాల్సి వస్తుంది.. ఇది కరెక్టు కాదు.. మీకు ఇష్టం లేకపోతే.. వెళ్లిపొండి’’ అంటూ హెచ్చరించారు. అయితే మోడీ జోక్యం చేసుకుని.. ఉపరాష్ట్రపతిని ఉద్దేశించి.. ‘‘రేణుకా చౌదరిని నవ్వనివ్వండి సార్.. ఎందుకంటే.. రామాయణ్ సీరియల్ తర్వాత.. ఇన్నేళ్ల తర్వాత అలాంటి నవ్వులను వినే అవకాశం ఈ సభకు కలగనివ్వండి’’ అంటూ మోడీ వ్యాఖ్యానించారు. రేణుకా చౌదరి పెద్దపెట్టున నవ్వడాన్ని రామాయణ్ సీరియల్ లో ఎవరి నవ్వులతో పోల్చి, మోడీ అలా వెటకారం చేశారో.. ఎవరికి వారు ఊహించుకోవచ్చు. మోడీ వేసిన అంతటి కాస్ట్ లీ సెటైర్ కు కాంగ్రెస్ సభ్యులు నిరసన తెలిపారు. రేణుకా చౌదరి తీవ్ర స్వరంతో ప్రతిఘటించారు. అయితే ఆ గందరగోళంలో ఆమె ఏం చెబుతున్నారో వినిపించలేదు.

కానీ.. ఎంత ప్రధాని అయినప్పటికీ.. విపక్షానికి చెందిన ఓ మహిళా సభ్యురాలిపై ఇలాంటి వెటకారాల జోకులు వేయడం సంస్కారం కాదని పలువురు భావిస్తున్నారు.