Begin typing your search above and press return to search.

ట్విట్టర్ లో మోదీ!..బాబుకు త‌డిసిపోవాల్సిందేనా?

By:  Tupaki Desk   |   3 Jan 2019 7:00 AM IST
ట్విట్టర్ లో మోదీ!..బాబుకు త‌డిసిపోవాల్సిందేనా?
X
ఎన్నిక‌ల‌కు స‌మ‌యం ద‌గ్గ‌ర‌ ప‌డుతున్న నేప‌థ్యంలో ఈ నెల 6న గుంటూరులో బీజేపీ నిర్వ‌హించాల‌నుకున్న స‌భ‌కు ప్ర‌ధాని హోదాలో న‌రేంద్ర మోదీ వ‌స్తున్నార‌ని - ఆయ‌న వ‌స్తే... టీడీపీ అధినేత - ఏపీ సీఎం నారా చంద్ర‌బాబునాయుడికి ద‌బిడిదిబిడేన‌న్న వాద‌న వినిపించింది. అయితే కావాల‌నుకునే ర‌ద్దు చేసుకున్నారో - లేదంటే అనివార్య కార‌ణాల వ‌ల్ల ఆ స‌భ‌ను బీజేపీ నేత‌లు ర‌ద్దు చేసుకున్నారో తెలియ‌దు గానీ... ఈ స‌భ ర‌ద్దు వార్త చెవిన ప‌డిన వెంట‌నే చంద్ర‌బాబు మోములో చిరున‌వ్వు ప్ర‌త్య‌క్ష‌మైంది. అయితే నేను రాకుంటే ఊపిరిపీల్చుకుంటారా? అన్న కోణంలో గొంతు స‌వ‌రించుకున్న న‌రేంద్ర మోదీ... చంద్ర‌బాబుపై వ‌రుస దాడుల‌కు శ్రీ‌కారం చుట్టారు. నిన్న‌టి ఏఎన్ ఐ ఇంట‌ర్వ్యూలో ఓ మోస్త‌రులో చంద్ర‌బాబును ఆడుకున్న మోదీ... నేటి ఏపీకి చెందిన బీజేపీ కార్య‌క‌ర్త‌ల‌తో నిర్వ‌హించిన వీడియో కాన్ఫ‌రెన్స్‌లో ఏకంగా చెడుగుడు ఆడేసుకున్నార‌నే చెప్పాలి. పోవ‌ల‌రం ప్రాజెక్టుపై చంద్ర‌బాబు స‌ర్కారు చెబుతున్న విష‌యాల‌తో పాటు త‌మ‌కు తాముగా కేంద్రాన్ని దేబిరించి మ‌రీ పోల‌వ‌రం ప‌నుల‌ను ద‌క్కించుకున్న చంద్ర‌బాబు వ్య‌వ‌హారం - కేంద్రం నుంచి ఏపీకి విడుద‌ల అవుతున్న నిధులు - ఆ నిధుల‌కు చంద్ర‌బాబు స‌ర్కారు నుంచి అంద‌ని యుటిలైజేష‌న్ స‌ర్టిఫికెట్లు... త‌దిత‌రాల‌పై త‌న‌దైన శైలిలో విమ‌ర్శ‌లు గ‌ప్పించ‌డంతో పాటు సూటిగానే కాకుండా క్లిస్ట‌ర్ క్లియ‌ర్‌ గా మోదీ సంధించిన ప్ర‌శ్న‌లు చంద్ర‌బాబు శిబిరంలో పెను క‌ల‌క‌ల‌మే రేపాయ‌ని చెప్ప‌క త‌ప్ప‌దు.

అంత‌టితోనే ఆగ‌ని మోదీ... కార్య‌క‌ర్త‌ల‌తో స‌మావేశం ముగియ‌గానే... ట్విట్ట‌ర్‌ లోనే యాక్టివేట్ అయిపోయారు. మొన్న‌టి తెలంగాణ ఎన్నిక‌ల్లో సిద్ధాంతాల‌ను ప‌క్క‌న‌పెట్టి చంద్ర‌బాబు... కాంగ్రెస్ పార్టీతో పొత్తుపెట్టుకున్న వైనాన్ని తూర్పార‌బ‌ట్టారు. టీడీపీ వ్య‌వ‌స్థాప‌కుడు నంద‌మూరి తారక‌రామారావు కాంగ్రెస్ పార్టీకి వ్య‌తిరేకంగానే టీడీపీని స్థాపించార‌ని గుర్తు చేసిన మోదీ... నాడు టీడీపీ నేత‌లు కాంగ్రెస్ పార్టీని దుష్ట కాంగ్రెస్‌ గా అభివ‌ర్ణించే వార‌ని గుర్తు చేశారు. అయితే తన రాజ‌కీయ ప్ర‌యోజ‌నాల కోసం చంద్ర‌బాబు... టీడీపీకి దుష్ట కాంగ్రెస్‌ గా ఉన్న పార్టీతోనే టీడీపీకి పొత్తు కుదిర్చార‌ని కూడా వ్యంగ్యాస్త్రాలు సంధించారు. నాడు కాంగ్రెస్ పార్టీని దుష్ట కాంగ్రెస్ అన్న టీడీపీ... ఇప్పుడు అదే పార్టీని దోస్త్ కాంగ్రెస్ గా వ్య‌వ‌హరించాల్సి వ‌స్తోంద‌ని కూడా ఆయ‌న త‌న‌దైన శైలిలో సెటైర్లు గుప్పించారు. టీడీపీతో పాటు కాంగ్రెస్ పార్టీల కుటిల య‌త్నాలు - వ్యూహాలు ప్ర‌జ‌ల‌కు తెలుసున‌ని కూడా ఆయ‌న చుర‌క‌లంటించారు. గ‌డ‌చిన నాలుగైదేళ్ల ప‌నితీరును ప‌రిశీలిస్తే... ఏపీ అభ్యున్న‌తి బీజేపీకి మాత్ర‌మే సాధ్య‌మ‌ని - ఏపీ ప్ర‌జ‌ల మ‌నోభావాల‌కు అనుగుణంగా ప‌నిచేయ‌గ‌ల స‌త్తా ఒక్క బీజేపీకే ఉంద‌ని కూడా ఆయ‌న చెప్పారు.

అంతకు కాస్తంత ముందుగా చంద్ర‌బాబు వైఖ‌రిపై త‌న‌దైన శైలి విమ‌ర్శ‌లు సంధించిన మోదీ... త‌మ స్వీయ త‌ప్పిదాల‌ను క‌ప్పిపుచ్చుకునేందుకు టీడీపీ ప్ర‌భుత్వం పెద్ద ఎత్తున అస‌త్యాల‌ను ప్ర‌చారం చేస్తోంద‌ని విరుచుకుప‌డ్డారు. టీడీపీ అవాస్త‌వాల‌పై ఎప్ప‌టికైనా బీజేపీ నిజాయితీనే విజ‌యం సాధిస్తుంద‌ని కూడా మోదీ చెప్పుకొచ్చారు. త‌మ త‌ప్పుల వ‌ల్ల ఏపీకి ఎంత‌మేర అన్యాయం జ‌రిగింద‌న్న విష‌యంపై టీడీపీ ప్ర‌భుత్వం త‌మ రాష్ట్ర ప్ర‌జ‌ల‌కు స‌మాధానం చెప్పాల్సిన అవ‌స‌రం వ‌చ్చింద‌ని కూడా మోదీ త‌నదైన వాగ్బాణీని కొన‌సాగించారు. మొత్తంగా రెండు రోజుల వ్య‌వ‌ధిలోనే చంద్ర‌బాబుపై మోదీ మూడు ప‌ర్యాయాలు - మూడు వేదిక‌ల మీద నుంచి విమ‌ర్శ‌లు సంధించ‌డంతో ఇప్పుడు చంద్ర‌బాబు అండ్ ఏం చేయాలో పాలుపోక అయోమ‌యంలో కూరుకుపోయింద‌న్న విశ్లేష‌ణ‌లు సాగుతున్నాయి.