Begin typing your search above and press return to search.

రాష్ర్టపతి అభ్యర్థిపై మోడీకి ఎందుకింత కన్ఫ్యూజన్?

By:  Tupaki Desk   |   15 Jun 2017 7:22 AM GMT
రాష్ర్టపతి అభ్యర్థిపై మోడీకి ఎందుకింత కన్ఫ్యూజన్?
X
రాష్ర్టపతి ఎన్నికల రేసు మొదలైంది. ఎన్నికల సంఘం నోటిఫికేషన్ ఇవ్వడంతో తెర వెనుక వ్యూహాలు తెరపైకి వస్తున్నాయి. పాలక పక్షం ఎన్డీయేకే స్పష్టమైన అవకాశాలు ఉండడంతో ఆ పక్షం నుంచి అభ్యర్థి ఎవరా అన్నది ఇప్పుడు దేశమంతా చర్చనీయమవుతోంది. మరోవైపు యూపీఏ కూడా గెలుపు అవకాశం లేదని తెలిసి కూడా తమ తరఫున అభ్యర్థిని నిలిపేందుకు తెగ ప్రయత్నాలు చేస్తోంది. సరైన అభ్యర్థి దొరక్క ఎన్డీయే డోలాయమానంలో ఉంటే.... ముందుకొచ్చేవారు లేక యూపీయే కంగారు పడుతోంది.

రాష్ట్ర‌ప‌తి ఎన్నిక కోసం వచ్చేనెల 17న పోలింగ్ - 20న కౌంటింగ్‌ నిర్వహించనున్న విషయం తెలిసిందే. ఈ నేప‌థ్యంలో ఆ ఎన్నిక‌ బ‌రిలోకి త‌మ అభ్య‌ర్థిగా ఎవ‌రిని దింపాల‌నే అంశంపై ఎన్డీఏ - యూపీఏ వేర్వేరుగా ముమ్మ‌రంగా చ‌ర్చ‌లు నిర్వ‌హిస్తున్నాయి. నిన్న ప్ర‌ధాని మోదీ ఆధ్వ‌ర్యంలో బీజేపీ కీల‌క నేత‌లు భేటీ అయ్యారు. త‌మ అభ్య‌ర్థి ఎంపిక‌పై చ‌ర్చ‌లు జ‌రిపారు. మోడీ అమెరికా ప‌ర్య‌ట‌న‌కు వెళ్లే జూన్ 24లోపు ఎన్డీఏ నామినేష‌న్ వేయాల‌ని యోచిస్తోంది. మ‌రోవైపు ఎల్లుండి రాష్ట్రప‌తి ఎన్నిక‌పై బీజేపీ త్రిస‌భ్య క‌మిటీ... ప్ర‌తిప‌క్ష నేత‌ల‌తో భేటీ కానుంది. ఇందులో కేంద్ర మంత్రులు రాజ్‌ నాథ్ సింగ్‌ - వెంక‌య్య నాయుడు - సోనియా గాంధీ - ఏచూరీ పాల్గొన‌నున్న‌ట్లు తెలుస్తోంది. అక్కడ ఒకవేళ ఏకగ్రీవానికి అంగీకారం కుదురుతుందేమో చూడాలి.

ఇక రాష్ర్టపతిని అందివ్వనున్న ఎన్డీయే తరఫున అభ్యర్థి ఎవరు అవుతారనే విషయంలో స్పష్టత ఇంకా రాలేదు. అద్వానీ - మురళీ మనోహర్ జోషీలు ఎప్పుడో సీను నుంచి సైడయిపోవడంతో ఆశావహులు పెద్ద సంఖ్యలోనే కనిపిస్తున్నారు.

ఎన్టీయే తరఫున ఇంతవరకు జార్ఖండ్ ఆదివాసీ నేత ద్రౌపది ముర్ము పేరు బాగా వినిపించింది. ఆమె పేరు కన్ఫర్మయిపోయిందని జాతీయ మీడియా సహా దేశమంతా కోడై కూసింది. చివరు ఆమె ప్రొఫైల్స్ కూడా వేసేశారు. కానీ, హఠాత్తుగా ఆమె పేరు మళ్లీ వినపడడం మానేసింది. అభ్యర్థి ఎంపికపై చర్చలు సాగిస్తున్న బృందంలో ఉన్న కేంద్ర మంత్రి వెంకయ్యనాయుడు పేరు కూడా వినిపించింది. అంతేకాదు... తమిళనాడుకు చెందిన , ప్రస్తుత కేరళ గవర్నరుగా ఉన్న సుప్రీంకోర్టు మాజీ ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ సదాశివం పేరు కూడా నిన్నమొన్న ప్రచారంలోకి వచ్చింది. తాజాగా అంతకుముందు నుంచి అడపాదడపా వినిపిస్తున్న లోక్‌ సభ స్పీకర్‌ సుమిత్రా మహాజన్‌ మరోసారి తెరమీదికొచ్చారు.

లోక్‌ సభ స్పీకర్‌ గా ఆమె వ్యవహార శైలి పట్ల కాంగ్రెస్‌ దగ్గర్నుంచి ఇతర ప్రతిపక్షాలకు ఎలాంటి అభ్యంతరాలు ఈ మూడేళ్లలో రానందున రాష్ట్రపతిగా ఆమె అభ్యర్ధిత్వాన్ని ప్రతిపాదిస్తే ఉమ్మడి ప్రతిపక్షాలు తమ అభ్యర్ధిని పోటీకి నిలుపక పోవచ్చునని ప్రధాని మోడీ అభిప్రాయపడుతున్నట్టు తాజా సమాచారం. అయితే అధికార పక్షం నుంచి ఇంత వరకు ఎలాంటి సంకేతాలు వెలువడలేదు. ఎన్డీయే కూటమి వ్యూహాన్ని బట్టి తాము నిర్ణయం తీసుకోవాలని కాంగ్రెస్‌ నేతృత్వంలోని ప్రతిపక్షం ఎదురుచూస్తున్నది.

మొత్తానికి ఈనెల 23న ఎన్డీయే అభ్యర్ధి నామినేషన్‌ వేస్తారని ఎన్డీయే వర్గాలు వెల్లడించాయి. అభ్యర్థి ఎంపికపై బీజేపీ సారథ్యంలోని ఎన్డీయే - ప్రతిపక్షాలు విడివిడిగా కసరత్తులు ప్రారంభించాయి. అభ్యర్థుల ఎంపి కపై బీజేపీ అధ్యక్షుడు అమిత్‌ షా ముగ్గురు కేంద్రమంత్రు లతో ఓ కమిటీ వేసిన విషయం తెలిసిందే. గతవారం ఆ పార్టీ ప్రకటించిన కమిటీలో కేంద్ర మంత్రులు రాజ్‌ నాథ్‌ సింగ్‌ - వెంకయ్య నాయుడు - అరుణ్‌ జైట్లీ సభ్యులుగా ఉన్నారు. దీంతో వారంతా రాష్ట్రపతి అభ్యర్థిపై ఏకాభిప్రాయ సాధనకు కృషి చేస్తు న్నారు. అందరి అభిప్రాయాలు పరిగణలోకి తీసుకొని అభ్యర్థి ఎంపిక చేయనున్నట్లు సమాచారం. అన్ని పార్టీ అభిప్రాయాలను పరిగణలో తీసుకోవాలని బీజేపీ నిర్ణయించిన నేపథ్యంలో, కమిటీ సభ్యులు బుధవారం పలు పార్టీల నేతలతో మాట్లాడారు. అందులో ఎన్‌ సీపీ నేత ప్రపుల్‌ పటేల్‌ - సీపీఐ(ఎం) ప్రధాన కార్యదర్శి సీతారాం ఏచూరి - సమాజ్‌ వాదీ నేత సతీష్‌ మిశ్రా ఉన్నారు. ఆయా నేతల అభిప్రాయాలను కమిటీ సభ్యులు తెలుసుకున్నారు. వారి అభిప్రాయాలను కమిటీ సభ్యులు ప్రధానమంత్రి నరేంద్రమోడీకి బుధవారం సాయంత్రమే వివరించారు. జూన్‌ 17వ తేదీన అన్ని పక్షాల నేతలను మరోసారి నేరుగా ఈ కమిటీ కలుస్తుంది.

ఎన్డీయే అభ్యర్థి లౌకికవాది అయితే మద్దతు ఇస్తామని విపక్షాలు గతంలోనే ప్రకటించిన విషయం తెలిసిందే. లేని పక్షంలో ఉమ్మడి అభ్యర్థిని బరిలోకి దించుతామని గతంలో చెప్పాయి. ఈ నేపథ్యంలో సుమిత్ర మహాజన్ కు విపక్షాల మద్దతు దొరకొచ్చని భావిస్తున్నారు. మరోవైపు విపక్షాలు కూడా ఆచితూచి అడుగులు వేస్తున్నాయి. ప్రస్తుత పరిస్థితులపై సుదీర్ఘంగా చర్చలు జరిపారు. కాగా, బుధవారం ప్రతిపక్ష పార్టీలు రాష్ట్ర పతి అభ్యర్థిపై పార్లమెంట్‌ హాలులో సమావేశమై చర్చించారు. కాంగ్రెస్‌ నాయకులు గులామ్‌ నబీ ఆజాద్‌ - మల్లిఖార్జున ఖర్గే నాయకత్వంలో విపక్షాలు చర్చలు జరిపాయి. సమావేశానికి ఆర్జేడీ నేత లాలూ ప్రసాద్‌ యాదవ్‌ - సీపీఐ నేత రాజా - ఎన్‌ సీపీ తదితర పార్టీల నాయకులు హాజరై ఉమ్మడి రాష్ట్రపతి అభ్యర్థి అంశంపై ప్రధానంగా చర్చించారు.

కాగా రాష్ర్టపతి ఎన్నికలకు బీజేపీ కోణం నుంచి చూస్తే ప్రధానంగా కొన్ని అంశాల్లో ఆ పార్టీ మీమాంసలో ఉంది. ముఖ్యంగా దక్షిణాది రాష్ర్టాలు - తూర్పు రాష్ర్టాలైన ఒడిశా - బెంగాల్ లో పాగా కోసం ప్రయత్నిస్తున్న ఆ పార్టీ ఆ రాష్ర్టాల నుంచి అభ్యర్థులను ఎంపిక చేయాలన్న ఒక ఆలోచనలో ఉంది. అదేసమయంలో ఏకాభిప్రాయం సాధన కోసం సుమిత్రా మహాజన్ వంటివారినీ ఎంపికచేసే అవకాశం ఉంది.

Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/