Begin typing your search above and press return to search.

చేతులెత్తేసిన నరేంద్రమోడి - పోలవరం అవుట్

By:  Tupaki Desk   |   25 July 2021 6:41 AM GMT
చేతులెత్తేసిన నరేంద్రమోడి - పోలవరం అవుట్
X
పోలవరం ప్రాజెక్టుపై నరేంద్రమోడి సర్కార్ చేతులెత్తేసింది. ఏదైనా ప్రాజెక్టంటే నిర్మాణాలు మాత్రమే కాదు భూసేకరణ, పునరావాసం కూడా ప్రాజెక్టు పరిధిలోకే వస్తాయి. 15 ఏళ్ళు గుజరాత్ ముఖ్యమంత్రిగా ఏడేళ్ళనుండి ప్రధానమంత్రిగా పనిచేస్తున్న మోడికి ఇంకోరు చెప్పాల్సిన పనిలేదు. కానీ ఏపి ప్రయోజనాలను మొదటినుండి కాలరాస్తున్నట్లే తాజాగా పోలవరం ప్రాజెక్టు విషయంలో కూడా చేతులెత్తేసింది.

పోలవరం ప్రాజెక్టు నిర్మాణానికి చంద్రబాబునాయుడు హయాంలో సుమారు రు. 55 వేల కోట్ల సవరించిన అంచనాలను కేంద్రం అంగీకరించింది. అయితే ఆ తర్వాత ఏమైందో ఏమో వెంటనే రివర్సు మాట్లాడింది. ప్రాజెక్టు అంచనాల్లో సుమారు 30 వేల కోట్ల రూపాయలు భూసేకరణ, పునరావాసానికే ఖర్చవుతుంది. ఇంతటి కీలకమై ఖర్చుల విషయాన్ని తనకు సంబంధం లేదని కేంద్రం తాజాగా తేల్చేసింది. తామిచ్చే నిధులు కేవలం ప్రాజెక్టు హెడ్ వర్క్స్ కు మాత్రమే అని చెప్పింది.

2013-14లో సవరించిన అంచనాలు రు. 20,398 కోట్లకు మించి ఇచ్చేది లేదని రాష్ట్రానికి స్పష్టంగా చెప్పేసింది. నిజానికి ఈ నిధులతో ప్రాజెక్టు నిర్మాణం జరిగే పనికాదు. భూసేకరణ, పునరావాసం జరగకుండా ఏ ప్రాజెక్టు నిర్మాణం కూడా సాధ్యంకాదు. అసలు ఈ సమస్యకు ప్రధాన కారణం చంద్రబాబనే చెప్పాలి. విభజన చట్టంలో పోలవరం ప్రాజెక్టు నిర్మాణ బాధ్యత కేంద్రానిదే అన్న విషయం అందరికీ తెలిసిందే.

2014లో అధికారోంలోకి రాగానే ప్రాజెక్టు నిర్మాణ బాధ్యతను చంద్రబాబు కేంద్రం నుండి బలవంతంగా తీసుకున్నారు. అప్పట్లో ప్రాజెక్టు నిర్మాణాన్ని చంద్రబాబు తన చేతుల్లోకి తీసుకోకుండా ఉండుంటే మొత్తం బాధ్యత కేంద్రానిదే అయ్యుండేది. అప్పుడు ప్రాజెక్టు నిర్మాణం చేసినా చేయకపోయినా కేంద్రమే జనాలకు సమాధానం చెప్పాల్సుండేది. కానీ చంద్రబాబు చేసినపని వల్ల ఇపుడు ఆ భారం మొత్తం రాష్ట్రానిపై పడింది. కేంద్రం నిధులివ్వదు, రాష్ట్రానికి అంత స్తోమతలేదు.

సవరించిన అంచనాల ప్రకారం రు. 20,398 కోట్లలో ఇప్పటికే రు. 11,182 కోట్లు ఇచ్చేసినట్లు కేంద్రం పార్లమెంటులోనే ప్రకటించింది. అంటే కేంద్రం ఇక ఇవ్వాల్సింది సుమారు రు. 9000 కోట్లు మాత్రమే. ఈ మొత్తంతో ప్రభుత్వం చేయగలిగేది ఏమీలేదని అందరికీ తెలిసిందే. కేంద్రం తాజా వైఖరి వల్ల ప్రాజెక్టు నిర్మాణం అయోమయంలో పడింది. ప్రాజెక్టు ఎత్తు తగ్గించుకుంటే భూసేకరణ, పునరావాసం వ్యయం తగ్గుతుంది. ఎత్తు తగ్గించుకుంటే ప్రాజెక్టు అసలు ఉద్దేశ్యమే దెబ్బతింటుంది. మరీ పరిస్ధితుల్లో జగన్మోహన్ రెడ్డి ఏమి చేస్తారో చూడాల్సిందే.