Begin typing your search above and press return to search.

ఇక్క‌డ ఎవ‌రూ సుద్ద‌పూస‌లు కాదు..!

By:  Tupaki Desk   |   4 Feb 2019 9:48 AM IST
ఇక్క‌డ ఎవ‌రూ సుద్ద‌పూస‌లు కాదు..!
X
మొద‌లే మేం క్లారిటీ ఇవ్వ‌ద‌లిచాం. ఇక్క‌డ ఎవ‌రూ సుద్ద‌పూస‌లు కాదు. నిరాడంబ‌రంగా క‌నిపిస్తూ.. చిన్న ఇంట్లో స‌ర్దుకుపోయే ప‌శ్చిమ‌బెంగాల్ ముఖ్య‌మంత్రి మ‌మ‌తా బెన‌ర్జీ అవినీతిప‌రురాల‌ని ఎవ‌రూ చెప్ప‌రు. కాకుంటే.. ఆమె ప్ర‌భుత్వంలోని కొంద‌రి ముఖ్యుల క‌క్కుర్తి అంతా ఇంతా కాదు. అదే.. ఇప్పుడామెను ఆత్మ‌ర‌క్ష‌ణ‌లో ప‌డేలా చేశాయి. అయితే.. దీదీని దెబ్బ తీయ‌టానికి త‌మ‌కున్న వ్య‌వ‌స్థ‌ల్ని వినియోగించ‌టం లాంటి పెద్ద త‌ప్పును మోడీ స‌ర్కారు చేయ‌టం అభ్యంత‌ర‌క‌రం. ఇలా చూసిన‌ప్పుడు ఇరువురు దొందూ దొందేన‌ని చెప్పాలి.

ఆ మాట‌కు వ‌స్తే.. అవినీతి ఆరోప‌ణ‌లు ఎదుర్కొన్న వారిని దీదీ ప్ర‌భుత్వం గ‌తంలోనే అరెస్ట్ చేసింది. కానీ.. ప్ర‌భుత్వాన్ని నిర్వీర్యం చేయ‌టంతోపాటు.. అధికార‌ప‌క్షానికి షాకిచ్చేందుకు అత్యున్న‌త అధికారుల మీద విచార‌ణ పేరుతో ఇష్టం వ‌చ్చిన‌ట్లుగా వ్య‌వ‌హ‌రించ‌టం భ‌విష్య‌త్తుకు ఏ మాత్రం మంచిది కాదు. ఇలాంటి వాటి విష‌యంలో దీదీ ఎంత మొండిగా ఉంటారో తాజా ప‌రిణామాలు చూస్తే ఇట్టే అర్థ‌మ‌వుతాయి.

ఒక‌వేళ మోడీ మాష్టారు క‌నిపించ‌ని నాలుగో సింహం మాదిరి అంటూ ఎవ‌రైనా ఆకాశానికి ఎత్తేయ‌ద‌లుచుకుంటే అలాంటి వారికి సూటిప్ర‌శ్న ఒక్క‌టే. మోడీకి ఆత్మ‌లాంటి అమిత్ షా అబ్బాయిగారి మీద కూడా ఆరోప‌ణ‌లు వ‌చ్చాయి క‌దా? వారి ఆయ‌న‌పై సీబీఐ.. ఈడీలాంటి వ్య‌వ‌స్థ‌లు ఎందుకు చెల‌రేగిపోలేదు? అన్న‌ది ప్ర‌శ్న‌. ఆ మాట‌కు వ‌స్తే.. రాజ‌స్థాన్ లో బీజేపీ స‌ర్కారు ప‌వ‌ర్లో ఉన్న‌ప్పుడు.. ముఖ్య‌మంత్రిగా వ్య‌వ‌హ‌రించిన వ‌సుంధ‌రా రాజె ప్ర‌భుత్వంపైనా చాలానే ఆరోప‌ణ‌లు వ‌చ్చాయి. మ‌రి.. వాటి విష‌యంలో సీబీఐ.. ఈడీలు మిన్న‌కుండిపోయాయి ఎందుకు?

ఒక్క రాజ‌స్థాన్ లో మాత్ర‌మే కాదు.. బీజేపీ ప‌వ‌ర్లో ఉన్న ప‌లు రాష్ట్రాల్లో అవినీతి ఆరోప‌ణలు ఎదుర్కొంటున్నారు. వారిపైన చెల‌రేగిపోని సీబీఐ.. ఈడీ లాంటి సంస్థ‌లు.. బీజేపీయేత‌ర ప్ర‌భుత్వాలు ప‌వ‌ర్లో ఉన్న రాష్ట్రాల్లోనే ఎందుకు య‌మా యాక్టివ్ గా వ్య‌వ‌హ‌రిస్తున్నాయ‌న్న‌ది ప్ర‌శ్న‌. రాజ‌కీయంగా త‌మ ప్ర‌త్య‌ర్థుల‌ను కొన్ని కేంద్ర విచార‌ణ సంస్థ‌ల‌తో ఉక్కిరిబిక్కిరి చేస్తున్నారంటూ మోడీ స‌ర్కారు మీద విమ‌ర్శ‌లు ఇప్ప‌టికే పెద్ద ఎత్తున వ‌చ్చాయి.

అది హిమాచ‌ల్ ప్ర‌దేశ్ సీఎం విష‌యంలో కావొచ్చు.. ఢిల్లీ ముఖ్య‌మంత్రి విష‌యంలో కావొచ్చు.. ఈరోజున ప‌శ్చిమ‌బెంగాల్ ప్ర‌భుత్వం మీద అయినా కావొచ్చు. రాజ‌కీయంగా స‌వాల‌చ్చ ఉండొచ్చు. త‌మ‌కు జ‌వాబుదారీ అయిన విచార‌ణ సంస్థ‌ల్ని ఉప‌యోగించి చెల‌రేగిపోయే విష‌యంలో మోడీ స‌ర్కారుకు మించిన ప్ర‌భుత్వం ఇప్ప‌టివ‌ర‌కూ లేద‌ని చెప్పాలి. ఇవాల్టి రోజున ఇన్ని దెబ్బ‌లు తిన్న విప‌క్ష ప్ర‌భుత్వాలు.. రేపొద్దున యూపీఏ ప్ర‌భుత్వం ప‌వ‌ర్లోకి వ‌స్తే.. వారు ఇదే తీరులో ప్ర‌తీకార దాడుల‌కు పాల్ప‌డితే.. ప్ర‌భుత్వాల‌కు.. విచార‌ణ సంస్థ‌ల‌కు మ‌ధ్య ఘ‌ర్ష‌న త‌ప్పించి మ‌రింకేమీ ఉండ‌దు. దేశానికి మోడీ ఎంత మంచి చేశార‌న్న‌ది ప‌క్క‌న పెడితే.. రాజ‌కీయ ప్ర‌త్య‌ర్థులను ఉక్కిరిబిక్కిరి చేసే విష‌యంలో ఆయ‌న త‌న రాజ‌కీయ ప్ర‌త్య‌ర్థులంద‌రికి క‌సి పాఠాలు నేర్పించేలా చేశార‌ని చెప్పాలి.

ఇవాల్టి రోజున మోడీ చేతిలో ప‌వ‌ర్ ఉంది. అది శాశ్వితం ఎంత‌మాత్రం కాదు. రేపొద్దున మోడీ ప్ర‌త్య‌ర్థుల చేతికి అధికారం వ‌చ్చి.. వారు కూడా వ్య‌వ‌స్థ‌ల్ని త‌మ చెప్పు చేతల్లో ఉంచుకొని చెల‌రేగిపోతే.. అప్పుడు ప‌రిస్థితి ఏమిటి? ప‌వ‌ర్లో ఉన్నారు కాబ‌ట్టి మోడీ స‌ర్కారు లీల‌లు బ‌య‌ట‌కు రావ‌టం లేదు. రేపొద్దున బీజేపీయేత‌ర ప్ర‌భుత్వం అధికారంలోకి వ‌చ్చి.. మోడీ హ‌యాంలో భారీ ఎత్తున అవ‌క‌త‌వ‌క‌లు జ‌రిగాయని చెబుతూ.. ఇదే సీబీఐ మాజీ ప్ర‌ధానిగా ఉండే మోడీ ఇంటి మీద‌కు త‌నిఖీలకు వెళ్లి..ఆయ‌న్ను అదుపులోకి తీసుకుంటే..? ఊహించ‌టానికి క‌ష్టంగా ఉన్న‌ప్ప‌టికి ఈ త‌ర‌హా రాజ‌కీయాలు ఇప్ప‌టికే త‌మిళ‌నాడులో చూశాం. ఈ రోజున మోడీ వ్య‌వ‌హ‌రిస్తున్న తీరుతో రేపొద్దున ఇలాంటివి వంట‌బ‌ట్టించుకున్న నేత ప్ర‌ధానిగా మారితే.. అప్పుడు ప‌రిస్థితి ఏమిటంటారు?