Begin typing your search above and press return to search.

అల్ల‌ర్లు చేస్తోంది వాళ్లే..మోడీ ఇన్ డైరెక్ట్ స్పీచ్!

By:  Tupaki Desk   |   16 Dec 2019 1:43 PM IST
అల్ల‌ర్లు చేస్తోంది వాళ్లే..మోడీ ఇన్ డైరెక్ట్ స్పీచ్!
X
పౌర‌స‌త్వ స‌వ‌ర‌ణ‌ల బిల్లు విష‌యంలో రేగిన మంటల గురించి ప్ర‌ధాన‌మంత్రి న‌రేంద్ర‌మోడీ మాట్లాడిన మాట‌లు సంచ‌ల‌నం రేపుతూ ఉన్నాయి. ఈ బిల్లును వ్య‌తిరేకిస్తూ అల్ల‌ర్లు జ‌రుగుతున్న సంగ‌తి తెలిసిందే. ఈశాన్య రాష్ట్రాల్లోనూ - ప‌శ్చిమ బెంగాల్ లోనూ ఈ అల్ల‌ర్లు సాగుతూ ఉన్నాయి. విదేశాల‌తో స‌రిహ‌ద్దును పంచుకునే ప్రాంతాలతో పాటు.. మ‌తం లేకుండా తెగ‌ల ప్ర‌జ‌లు మాత్ర‌మే ఉండే ప్రాంతాల్లోనూ ఈ అల్ల‌ర్లు సాగుతూ ఉన్నాయి.

ఈ అంశంపై మోడీ స్పందించారు. తాము చారిత్ర‌క బిల్లును తెచ్చిన‌ట్టుగా ప్ర‌క‌టించుకున్న న‌రేంద్ర‌మోడీ ఈ బిల్లుపై వ్య‌క్తం అవుతున్న ఆందోళ‌న మీద స్పందించారు. ఈ బిల్లును వ్య‌తిరేకిస్తూ అల్ల‌ర్లు సాగిస్తున్న‌ది ఒక వ‌ర్గం వారే అనే అర్థం వ‌చ్చేలా మోడీ మాట్లాడారు.

'ఆందోళన‌కారులు ధ‌రించిన దుస్తుల‌ను బ‌ట్టి అల్ల‌ర్లు చేస్తున్న‌ది ఎవ‌రో అర్థం చేసుకోవ‌చ్చు...' అని మోడీ వ్యాఖ్యానించారు. ఈ మాట‌ల అర్థం ఏమిటో తెలుసుకోవ‌డం క‌ష్టం కాదు. మ‌న దేశంలో దుస్తులు - టోపీల ద్వారా ఏ మ‌త‌మో చెప్ప‌డం సులువే. ఇలా మోడీ అల్ల‌ర్లు చేస్తున్న వాళ్లంతా ఒక మ‌తానికి చెందిన వారు అని తేల్చిన‌ట్టుగా అయ్యింది.

అయితే ఈశాన్య రాష్ట్రాల్లో మ‌తాల క‌న్నా తెగ‌ల ప్ర‌భావ‌మే ఎక్కువ‌. అక్క‌డ వివిధ తెగ‌ల ప్ర‌జ‌లు ఈ చ‌ట్టాన్ని వ్య‌తిరేకిస్తూ ఉన్నారు. అస్సాం గ‌ణ‌ ప‌రిష‌త్ వంటి రాజ‌కీయ పార్టీ కూడా ఈ ఆందోళ‌న‌ల్లో పాల్గొంటూ ఉంది. అలాగే బెంగ‌ళూరులో కూడా ఈశాన్య రాష్ట్రాల ప్ర‌జ‌లు ఈ బిల్లును వ్య‌తిరేకిస్తూ ఆందోళ‌న చేప‌ట్టారు. ఇలాంటి నేప‌థ్యంలో మోడీ ప్ర‌భుత్వం తెచ్చిన బిల్లుపై వ్య‌తిరేక‌త‌ను ఒక మ‌తానికి ఆపాదించ‌డం ఎంత వ‌ర‌కూ స‌బ‌బో మ‌రి!