Begin typing your search above and press return to search.

స్కాంకు మించిన ఈ ముచ్చ‌ట మాటేంది న‌మో?

By:  Tupaki Desk   |   17 Feb 2018 5:05 AM GMT
స్కాంకు మించిన ఈ ముచ్చ‌ట మాటేంది  న‌మో?
X
ఇప్పుడు మోడీ అన్న ప‌దాన్ని ఇట్టే వాడేసే ప‌రిస్థితి లేదు. చెప్పేది ఒక మోడీ గురించి అయితే.. మ‌రో మోడీ గుర్తుకు వ‌చ్చే ప‌రిస్థితి. నిన్న మొన్న‌టి వ‌ర‌కూ జ‌న‌సామ్యానికి పెద్ద‌గా ప‌రిచ‌యం లేని నీర‌వ్ మోడీ ఇప్పుడు ఫేమ‌స్ అయిపోయారు. దేశ ప్ర‌ధాని పేరులో కొంత భాగం ఆయ‌న పేరులో ఉండ‌టం.. చేసింది మామూలు స్కాం కాక‌పోవ‌టంతో ఆయ‌న పేరు ఇప్పుడు యావ‌త్ మీడియాలో మారుమోగిపోతోంది.

మౌన ప్ర‌ధాని మ‌న్మోహ‌న్ నేతృత్వంలోని యూపీఏ 1&2ల‌లో వెలుగు చూసిన స్కాంల పుణ్య‌మా అని మాకిలాంటి పాల‌న వ‌ద్దు మ‌హాప్ర‌భో అని దేశ ప్ర‌జ‌లు అనుకోవ‌ట‌మే కాదు.. మొన‌గాడు లాంటి మోడీ సీన్లోకి వస్తే.. అవినీతికి షాక్ త‌గిలి అచేత‌నావ‌స్థ‌లో ఉండిపోతుంద‌నుకున్నారు. అందుకు త‌గ్గ‌ట్లే భారీ ప్ర‌చారం జ‌రిగింది.

ప్ర‌ధానిగా న‌రేంద్ర మోడీ కుర్చీలో కూర్చొని దాదాపు నాలుగేళ్లు కావొస్తోంది. మ‌రో ఏడెనిమిదినెల‌లు గ‌డిస్తే సార్వ‌త్ర హ‌డావుడి షురూ అవుతుంది. తాను ప్ర‌ధాని అయితే.. దేశానికి కాప‌లా కుక్క‌లా ఉంటాన‌ని చెప్పిన మోడీ గ‌డిచిన రెండు రోజులుగా దేశ వ్యాప్తంగా సంచ‌ల‌నంగా మారిన నీర‌వ్ కుంభ‌కోణం గురించి మాట వ‌ర‌స‌కు మాట్లాడింది లేదు.

ఇప్పుడున్న ప‌రిస్థితుల్లో మాట్లాడ‌టం ఎలా సాధ్య‌మ‌వుతుంద‌న్న ప్ర‌శ్న‌లు కొంద‌రు లేవ‌నెత్తే వీలుంది. ఒక‌వేళ‌.. మాట్లాడ‌క‌పోతే మాట్లాడ‌క‌పోయారు? ఇంత భారీ కుంభ‌కోణం ఎలా సాగింది? దేశ ఆర్థిక వ్య‌వ‌స్థ‌ను కాపాడే వ్య‌వ‌స్థ‌లు ఇంత స్కాం జ‌రుగుతుంటే ఎలా చూస్తుండిపోయాయి? అన్న‌ది ఇప్పుడు ప్ర‌శ్న‌గా మారింది. మ్యూట్ సింగ్ ప్ర‌ధానిగా ఉన్న‌ప్పుడు గుట్టుగా స్కాంలు జ‌రిగితే.. తాజాగా మాట్లాడే ప్ర‌ధాని చేతిలో అధికారం ఉన్న వేళ ద‌ర్జాగా వ్య‌వ‌స్థ‌ల్ని దోచేయ‌టం క‌నిపిస్తుంది.

అంతేనా.. జ‌రిగిన దారుణం బ‌య‌ట‌కు వ‌చ్చాక‌.. గాఢ నిద్ర నుంచి ఉలిక్కిప‌డి లేచే ద‌ర్యాప్తు సంస్థ‌లు విచార‌ణ‌కు రెఢీ అయ్యే లోపు నిందితులు సుర‌క్షితంగా విదేశాల‌కు చెక్కేస్తున్న తీరు చూస్తే.. మోడీ హ‌యాంలో స్కాంల‌కు మించిన‌వే జ‌రుగుతున్నాయ‌న్న భావ‌న క‌ల‌గ‌టం ఖాయం. స్కాంల నుంచి భార‌త్ ను విముక్తి చేస్తామ‌ని ప్ర‌తిన పూనిన వారి హ‌యాంలో స్కాంల‌కు మించిన ఉదంతాలు చోటు చేసుకోవ‌టం దేనికి నిద‌ర్శ‌నం? అన్న‌ది ఇప్పుడు ప్ర‌శ్న‌గా మారింద‌ని చెప్ప‌క‌త‌ప్ప‌దు. ఈ విష‌యంలో న‌రేంద్ర మోడీ బాధ్య‌త వ‌హించాల్సిందే. ఎందుకంటే.. మాల్యా విష‌యంలో త‌ప్పు దొర్లింద‌ని అనుకుంటే.. ఆ త‌ర‌హాలోనే మ‌ళ్లీ త‌ప్పు దొర్ల‌టం చూస్తే.. వ్య‌వ‌స్థ‌లు నిర్వీర్య‌మైపోయాయా? అన్న సందేహం రాక మాన‌దు.