Begin typing your search above and press return to search.

మోడీ తర్వాతి టార్గెట్ పై క్లారిటీ వచ్చేసినట్లే..!

By:  Tupaki Desk   |   7 Aug 2019 1:58 PM IST
మోడీ తర్వాతి టార్గెట్ పై క్లారిటీ వచ్చేసినట్లే..!
X
ట్రిపుల్ తలాక్.. ఆర్టికల్ 370 నిర్వీర్యం.. ఇలా చెప్పుకుంటూ పోతే సంచలన నిర్ణయాలన్ని మోడీ సర్కారు వరుస పెట్టి తీసుకుంటున్నట్లుగా కనిపిస్తుంది. వాస్తవానికి ఇవన్నీ ఎప్పటినుంచో బీజేపీ ఎజెండాలో ఉన్నవే. తమ ప్రభుత్వం కొలువు తీరితే.. తాము చేయాల్సిన మార్పులకు సంబంధించి ఎప్పటినుంచో లిస్ట్ రాసుకొని మరీ ఎదురుచూస్తోంది.

2014లో ఎన్డీయే 2 ప్రభుత్వం కొలువు తీరినా.. రాజ్యసభలో బీజేపీకి బలం అంతంతమాత్రమ. ఇటీవల పెరిగిన బలంతో పాటు.. దేశంలో విపక్షాలు బలహీనమైపోవటం.. కాంగ్రెస్ పార్టీ తన ఆస్తిత్వం కోసం పోరాడుతున్న వేళ.. వరుస పెట్టి మరీ సంచలన నిర్ణయాలు తీసుకుంటున్న మోడీ.. తర్వాతి టార్గెట్ ఏమిటి? అన్నది ఇప్పుడు ప్రశ్నగా మారింది.

దశాబ్దాల తరబడి నానుతున్న కొన్ని అంశాల మీద కాంగ్రెస్ అండ్ కో ప్రభుత్వాలు దమ్ముగా నిర్ణయాలు తీసుకునే సాహసం చేయలేదు. ఎలాంటి నిర్ణయంతో ఎలాంటి స్పందన ఉంటుందోనన్న భయం.. సరిహద్దు దేశాలకు చెక్ పెట్టేంత స్థైర్యం లేకపోవటంతో పాటు.. చిత్తశుద్ధి లేని పరిస్థితి. ఇలాంటి వేళ పవర్లోకి వచ్చిన మోడీ.. బీజేపీ ఎప్పటినుంచో చెబుతున్న అంశాల్ని సమయం చూసుకొని తెర మీదకు తెచ్చేశారు. అంతేకాదు.. ఒకటి తర్వాత ఒకటిగా పార్లమెంటులో ప్రవేశ పెట్టేసి పాస్ చేయిస్తూ.. చట్టాలుగా మార్చేస్తున్నారు.

ఈ ప్రక్రియను చూస్తే.. ఇంత సింఫుల్ వ్యవహారాల్ని ఇన్నేసి సంవత్సరాలు ఎందుకు మురగబెట్టారన్న సందేహం రాక మానదు. ట్రిపుల్ తలాక్ బిల్లును తీసుకురావటం.. ఉభయ సభలు ఆమోదం పలకటం.. ఆ వెంటనే ఆర్టికల్ 370ను నిర్వీర్యం చేయటంతో పాటు.. ప్రత్యేక ప్రతిపత్తిని తీసేస్తూ నిర్ణయం తీసుకుంది. ఒక షాక్ నుంచి తేరుకొనే లోపే మరో షాకిస్తున్న మోడీ సర్కారుతో విపక్షాలుఉక్కిరిబిక్కిరి అవుతున్నాయి. ఇక.. కాంగ్రెస్ పార్టీలో పరిస్థితి గందరగోళంగా మారింది. ఏ నేత ఏం మాట్లాడుతున్నారో అర్థం కాని పరిస్థితి. ఇలాంటివేళ.. సందట్లో సడేమియా అన్న తీరుతో మరో కీలకమైన బిల్లును తెర మీదకు తీసుకురానున్నట్లుగా చెబుతున్నారు. ఒకదేశం.. ఒకే చట్టం అని చెప్పే ఉమ్మడి పౌరస్మృతి బిల్లును ప్రవేశ పెట్టే దిశగా అడుగులు వేస్తున్నట్లుగా చెబుతున్నారు.

ఇప్పటికే చోటు చేసుకున్న పరిణామాల్ని చూస్తే.. మోడీ సర్కారు ఉమ్మడి పౌరస్మృతి దిశగా అడుగులు వేస్తుందని చెప్పాలి. ఇప్పుడున్న ఊపులో అయితే.. ఉమ్మడి పౌరస్మృతి కూడా పూర్తి చేయొచ్చన్న ఆలోచనలో ఉన్నట్లుగా చెబుతున్నారు. దేశంలో రెండు పౌరస్మృతులు ఉండటం.. మతం ఆదారంగా ఉండే దానికి బదులుగా.. ఈ దేశంలో ఉండే ఎవరికైనా ఒకే న్యాయం.. ఒకే దర్శం అన్నట్లుగా ఉండాలన్న ఆలోచనలో మోడీ సర్కారు ఉంది. అదే జరిగితే.. అదో సంచలనంగా మారుతుందనటంతో సందేహం లేదు. ఒకవేళ.. ఆ బిల్లును పార్లమెంటులో ప్రవేశ పెడితే.. మోడీ చరిత్రలో నిలిచిపోవటం ఖాయమని చెప్పక తప్పదు.