Begin typing your search above and press return to search.

మాట‌లు ఓట్ల‌ను తెప్పించ‌లేవ‌ని అర్థ‌మైందిగా మోదీజీ?!

By:  Tupaki Desk   |   26 Oct 2019 2:00 AM IST
మాట‌లు ఓట్ల‌ను తెప్పించ‌లేవ‌ని అర్థ‌మైందిగా మోదీజీ?!
X
గతంలో కంటే...ఓట్లు - సీట్లు త‌గ్గిపోవ‌డం...సౌత్‌ను ఆర్థికంగా కంట్రోల్ చేసే రాష్ట్రంలో మునుప‌టి హ‌వాను లేక‌పోవ‌డం, పైగా త‌మ ఇలాకా అయిన గుజరాత్ ప‌క్క రాష్ట్రంలో...మిత్ర‌ప‌క్షంతో పొత్తు పెట్టుకున్నా...బొటాబొటీగా అధికారం చేజిక్కించుకోవ‌డం...ఇవ‌న్నీ మ‌హారాష్ట్ర ఎన్నిక‌ల్లో బీజేపీ సాధించిన `విజ‌యం` గురించి ప‌రిచ‌య వాక్యాలు. మహారాష్టలో శివసేనతో కలసి పోటీ చేసిన బీజేపీ అధికారంలోకి రావడం ఖాయమైంది. ఈ కూటమికి 159 సీట్లు లభించాయి. గత ఎన్నికలతో పోలిస్తే 26 స్థానాలను ఈ కూటమి కోల్పోయింది. త‌ద్వారా ప్ర‌ధాని మోదీ - బీజేపీ జాతీయ అధ్య‌క్షుడు అమిత్‌షా ద్వ‌యం చేస్తున్న ప్ర‌చారం ఓట్ల‌ను రాల్చ‌లేద‌ని...క్షేత్ర‌స్థాయిలో ప‌రిస్థితులు - అభివృద్ధి-సంక్షేమ కార్య‌క్ర‌మాలు మాత్ర‌మే ఓట్లు సంపాదించ‌గ‌ల‌వ‌ని స్ప‌ష్టం చేస్తున్నాయి.

మహారాష్ట్రలో ప్రభంజనం సృష్టిస్తాయనుకున్న బీజేపీ-శివసేనలు సాధారణ మెజారిటీతో అధికారాన్ని నిలబెట్టుకున్నాయి. మొత్తానికి మహారాష్టలో బీజేపీ అధికారాన్ని నిలబెట్టుకుంటున్నప్పటికీ నైతికంగా మాత్రం పరాజయమే. కాంగ్రెస్ - ఎస్సీపీ కూటమి గత ఎన్నికలతో పోలిస్తే తాజాగా 17 సీట్లను అదనంగా గెల్చుకుంది. ఈ కూటమికి 102 స్థానాలు దక్కాయి. ఇతరులు 27 మంది ఎన్నికయ్యారు. హర్యానాలో అధికార బీజేపీ సంక్లిష్టమైన పరిస్థితులను ఎదుర్కొంటోంది. ఎవరి సహకారం లేకుండానే ఒంటిరిగా బరిలోకి దిగిన ఈ పార్టీ 40 సీట్లను కైవసం చేసుకుంది. గత ఎన్నికలతో పోలిస్తే 7 స్థానాలను కోల్పోయింది. కాంగ్రెస్ 31 - జననాయక్ జనతా పార్టీ (జేజేపీ) 10 స్థానాలు గెల్చుకోగా - ఇతరులు 9 మంది ఉన్నారు. ఫలితంగా ఇక్కడ హంగ్ తప్పలేదు. అధికారాన్ని నిలబెట్టుకోవడానికి జేజేపీతో చర్చలు జరపాల్సిన పరిస్థితిని బీజేపీ ఎదుర్కొంటోంది.జమ్మూకాశ్మీర్‌ కు ప్రత్యేక ప్రతిపత్తి కల్పించే 370 ఆర్టికల్ రద్దు తర్వాత జరిగిన మొట్టమొదటి ఎన్నికల్లో బీజేపీ ఓటర్లను గొప్పగా ప్రభావితం చేయలేకపోయిందనే చెప్పాలి.

గత లోక్‌ సభ ఎన్నికల్లో పూర్తిగా చతికిలబడిన కాంగ్రెస్ మహారాష్ట్ర - హర్యానా అసెంబ్లీ ఎన్నికల్లో మెరుగైన ఫలితాలను సాధించింది. శరద్‌ పవార్ నేతృత్వంలోని నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీ (ఎన్సీపీ) బాగా పుంజుకుంది. తన భాగస్వామి కాంగ్రెస్ కన్నా ఈసారి ఎన్సీపీ అత్యధిక స్థానాలు గెలుచుకోవడం విశేషం. జమ్ముకశ్మీర్‌ లో ఆర్టికల్ 370 రద్దు - పోలింగ్‌ కు ముందు రోజు పాకిస్థాన్‌ లోని ఉగ్రవాద శిబిరాలపై భారత సైన్యం దాడుల వంటి అంశాలు ఈసారి బీజేపీకి కలిసి రాలేదు. ఎన్నికల ప్రచారంలో ప్రధాని మోదీ - బీజేపీ అధ్యక్షుడు అమిత్ షా జాతీయవాద అంశాలకు ఎక్కువగా ప్రాధాన్యం ఇచ్చినప్పటికీ ఓటర్లు వాటి పట్ల ఆసక్తి చూపినట్టు కనిపించలేదు. త‌ద్వారా కేవ‌లం జాతీయ‌వాదం - మ‌తం - ప్ర‌సంగాల ఆధారంగా ప్ర‌జ‌ల ఓట్ల‌ను రాబ‌ట్టుకోవాల‌ని బీజేపీ పెద్ద‌లు చేసిన ప్ర‌య‌త్నం విఫ‌ల‌మైంద‌ని ప‌లువురు విశ్లేషిస్తున్నారు.