Begin typing your search above and press return to search.

ముంద‌స్తుకు మోడీ రెఢీ.. అక్టోబ‌రులో ఎన్నిక‌లు!

By:  Tupaki Desk   |   27 Jun 2018 5:06 AM GMT
ముంద‌స్తుకు మోడీ రెఢీ.. అక్టోబ‌రులో ఎన్నిక‌లు!
X
కొంద‌రంతే, తాము అనుకున్న‌ది సాధించుకోవ‌టానికి దేనికైనా రెఢీ అవుతారు. ప్ర‌ధాని న‌రేంద్ర మోడీ తీరు కూడా ఇప్పుడిలానే ఉంది. చేతిలో ఉన్న అధికారాన్ని మ‌రో ఐదేళ్లు పొడిగించుకోవ‌టానికి ఆయ‌న త‌హ‌త‌హ లాడుతున్నారు. రోజురోజుకీ త‌గ్గిపోతున్న జ‌నాద‌ర‌ణ నేప‌థ్యంలో ఎంత త్వ‌ర‌గా అయితే అంత త్వ‌ర‌గా ముంద‌స్తు ఎన్నిక‌ల్ని నిర్వ‌హించాల‌ని భావిస్తున్న‌ట్లుగా చెబుతున్నారు. దీనికి త‌గ్గ‌ట్లే ఈ ఏడాది చివ‌ర‌న ముంద‌స్తు ఎన్నిక‌ల‌కు మోడీ రెఢీ అవుతున్న‌ట్లుగా వార్త‌లు వ‌చ్చాయి.

అయితే.. అందుకు భిన్నంగా స‌రికొత్త మాట ఒక‌టి తాజాగా వినిపిస్తోంది. ముంద‌స్తు ఎన్నిక‌లు డిసెంబ‌రులో కాద‌ని.. మ‌రింత ముందుకు జ‌రిపి అక్టోబ‌రులోనే పూర్తి చేయాల‌ని భావిస్తున్న‌ట్లుగా విశ్వ‌స‌నీయ స‌మాచారం. ముంద‌స్తు ఎన్నిక‌ల‌కు మోడీ మాష్టారు ప‌క్కాగా రెఢీ అయ్యార‌ని.. ఆయ‌నిప్పుడు ఫుల్లీ లోడెడ్ గ‌న్ అని చెబుతున్నారు.

తొలుత ప్ర‌చారం జ‌రిగిన‌ట్లుగా డిసెంబ‌రులో కాకుండా అక్టోబ‌రులోనే ముంద‌స్తు ఎన్నిక‌లు నిర్వ‌హించ‌టం వెనుక ప‌క్కా వ్యూహ‌మేన‌ని చెబుతున్నారు. తొలుత ముంద‌స్తు మాట వినిపించ‌టం.. ఏడాది చివ‌ర్లో అన్న ప్ర‌చారం జ‌ర‌గ‌టంతో విప‌క్ష పార్టీలు ఎన్నిక‌ల‌కు సిద్ధంగా లేవు.

మ‌రోవైపు మోడీ మాత్రం త‌న ప్లానింగ్‌లో భాగంగా అంద‌రూ అనుకున్న‌ట్లుగా డిసెంబ‌రులో కాకుండా మ‌రో మూడు నెల‌లు ముందు అంటే అక్టోబ‌రులో ఎన్నిక‌లు నిర్వ‌హించ‌టానికి సంబంధించి త‌న షెడ్యూల్ ను సిద్ధం చేసుకున్న‌ట్లుగా చెబుతున్నారు. అక్టోబరులో ఎన్నిక‌లు జ‌ర‌గాలంటే.. సెప్టెంబ‌రులోనే ఎన్నిక‌ల షెడ్యూల్ ప్ర‌క‌టించాల్సి ఉంటుంది. అదే జ‌రిగితే.. ఇప్పుడు జూన్ నెలాఖ‌రులో ఉన్న నేప‌థ్యంలో గ‌ట్టిగా మూడు నెల‌ల స‌మ‌యం కూడా ఉండ‌దు.

సార్వ‌త్రిక ఎన్నిక‌ల‌కు కేవ‌లం మూడు నెల‌ల వ్య‌వ‌ధిలో విప‌క్షాలు సిద్ధం కావ‌టం అంత తేలికైన విష‌యం కాదు. వారు త‌మ వ్యూహాల‌కు ప‌దును పెట్టి.. వాటిని అమ‌లు చేసే స‌మ‌యానికి ఎన్నిక‌లు ముంచుకొస్తాయ‌ని.. ముందుగా ప్రిపేర్డ్ గా ఉన్న మోడీ ముంద‌స్తులో దూసుకెళ్ల‌టానికి వీలు ఉంటుంద‌న్న మాట వినిపిస్తోంది. బీజేపీకి వ్య‌తిరేకంగా జ‌ట్టు క‌ట్టే విప‌క్షాల‌కు అవ‌కాశం ఇవ్వ‌కుండా ఉండేందుకే డిసెంబ‌రు నుంచి అక్టోబ‌రులోనే ఎన్నిక‌ల్ని నిర్వ‌హించాల‌ని బీజేపీలో మెజార్టీ నేత‌లు కోరుకుంటున్న‌ట్లుగా చెబుతున్నారు.

విశ్వ‌సనీయ స‌మాచారం ప్ర‌కారం పార్ల‌మెంటు వ‌ర్షాకాల స‌మావేశాలు జులై 18 నుంచి ఆగ‌స్టు 10 వ‌ర‌కూ జ‌రుగుతాయ‌ని.. స‌మావేశాలు ముగిసిన వెంట‌నే ఎన్నిక‌ల ప్ర‌క‌ట‌న వ‌చ్చేలా ప‌రిణామాలు చోటు చేసుకుంటాయ‌ని చెబుతున్నారు. సార్వ‌త్రిక ఎన్నిక‌లతో పాటు జ‌మిలి ఎన్నిక‌లు జ‌ర‌పాల‌ని మోడీ మొద‌ట భావించినా.. ఆ విష‌యంలో ప‌ట్టువిడుపుల్ని ప్ర‌ద‌ర్శించాల‌ని భావిస్తున్న‌ట్లు చెబుతున్నారు. ఈ ఏడాది చివ‌ర్లో జ‌ర‌గాల్సిన రాజ‌స్థాన్‌.. ఛ‌త్తీస్ గ‌ఢ్‌.. మ‌ధ్య‌ప్ర‌దేశ్ అసెంబ్లీ ఎన్నిక‌ల‌కు ముందే.. సార్వ‌త్రికం నిర్వ‌హించ‌టం ద్వారా రాజ‌కీయ ల‌బ్థి పొందాల‌న్న ఆలోచ‌న‌లో మోడీ ఉన్న‌ట్లు చెబుతున్నారు.

ఒక‌వేళ ఈ మూడు రాష్ట్రాల్లో అసెంబ్లీ ఎన్నిక‌లు జ‌రిగిన‌.. వాటి ఫలితాలు బీజేపీకి ప్ర‌తికూలంగా ఉంటే.. అందుకు చెల్లించాల్సిన మూల్యం భారీగా ఉంటుంద‌ని.. అందుకే విప‌క్షాలు ఊహాల‌కు భిన్నంగా అక్టోబ‌రుకే ఎన్నిక‌లు నిర్వ‌హించాల‌న్న ఆలోచ‌న‌లో మోడీ ఉన్న‌ట్లు చెబుతున్నారు. ఒక‌వేళ‌.. ఈ స‌మాచారం నిజ‌మైతే.. ఎన్నిక‌ల హ‌డావుడి మొద‌లైన‌ట్లేన‌ని చెప్ప‌క త‌ప్ప‌దు.