Begin typing your search above and press return to search.

బీజేపీ కష్టాల్ని ఏకరువు పెట్టిన మోడీ

By:  Tupaki Desk   |   19 Aug 2016 10:25 AM IST
బీజేపీ కష్టాల్ని ఏకరువు పెట్టిన మోడీ
X
పెద్ద పెద్ద విషయాల గురించి చెప్పుకొచ్చే ప్రధాని మోడీ తాజాగా పార్టీ గురించి కొత్త విషయాల్ని చెప్పుకొచ్చారు. ప్రధాని స్థానంలో ఉన్న ఆయన తాజాగా పూర్తిస్థాయి పార్టీ నాయకుడిగా మాట్లాడారు. సరికొత్త పోలికలతో తమపై రాజకీయ దాడి చేసే వారిపై విమర్శనాస్త్రాల్ని ఎక్కు పెట్టారు. బ్రిటీష్ హయాంలో కాంగ్రెస్ పార్టీ ఎదుర్కొన్న ప్రతికూలతల కంటే కూడా స్వతంత్ర భారతంలో బీజేపీ ఎక్కువ కష్టాల్ని ఎదుర్కొందని చెప్పుకొచ్చారు.

ఢిల్లీలో బీజేపీ కొత్త కార్యాలయానికి శంకుస్థాపన చేసిన సందర్భంగా మాట్లాడిన ప్రధాని మోడీ.. పార్టీ నేత హోదాలో తమ పార్టీ ఎన్ని త్యాగాలు చేసింది.. ఎన్ని కష్టాలు ఎదుర్కొంటున్నదీ వివరించే ప్రయత్నం చేశారు. ప్రస్తుతం ఉన్న పార్టీ కార్యాలయం అవసరాలకు తగినట్లుగా లేని నేపథ్యంలో కొత్త భవనాన్ని ఏర్పాటు చేయనున్నారు. రెండు ఎకరాల స్థలంలో నిర్మించే ఈ కొత్త భవనంలో ఆరు అంతస్తులు ఉండనున్నాయి. పార్టీ సంస్కృతిని.. జాతీయవాదాన్ని ప్రతిబింబించేలా ఈ భవన నిర్మాణం ఉండనుంది. ఒకేసారి 2 నుంచి 3 వేల మంది కార్యకర్తలతో సమావేశం నిర్వహించుకునేందుకు వీలుగా ఈ కొత్త భవనాన్ని ఏర్పాటు చేయనున్నారు.

పార్టీ ఎదుర్కొంటున్న ఇబ్బందుల గురించి.. తమ రాజకీయ ప్రత్యర్థుల తమను ఎంతలా కష్టాలకు గురి చేస్తున్నారన్న విషయాన్ని చెప్పే ప్రయత్నం చేసిన మోడీ.. పుట్టినప్పటి నుంచి కష్టాల్ని ఎదుర్కొంటున్న ఏకైక పార్టీ తమదేనని.. ప్రతి మలుపులోనూ పార్టీ ప్రతికూలతల్ని ఎదుర్కొంటున్నదని చెప్పటం గమనార్హం. తన మాటలకు ఉదాహరణగా పశ్చిమబెంగాల్ లో తమ పార్టీకి ఎదురైన అనుభవాల్ని ఈ సందర్భంగా ప్రస్తావించారు.

పశ్చిమ బెంగాల్ అసెంబ్లీ ఎన్నికల సమయంలో తమ పార్టీ అభ్యర్థులకు ప్రతికూలతలు ఎదురయ్యాయని.. కోల్ కతాలో పార్టీ కార్యాలయాన్ని ఏర్పాటు చేయటానికి స్థలం దొరకలేదని.. ఎవరైనా తమకు స్థలం ఇస్తే వారు కష్టాలు ఎదుర్కోవాల్సి వస్తుందని చెప్పిన మోడీ.. అధికార టీఎంసీ వైఖరిని చెప్పకనే చెప్పేశారు. బీజేపీ మాతృసంస్థ జన్ సంఘ్ 1969లో మధ్యప్రదేశ్ లో పవర్ లోకి వచ్చేవరకూ ఆ సంస్థను అంతర్జాతీయ పరిశోధనా సంస్థలు పట్టించుకోలేదన్నారు.

కొంత మంది నేతలు.. ప్రధాని.. ముఖ్యమంత్రులపై తమ పార్టీ ఆధారపడి అభివృద్ధి చెందలేదన్న మోడీ.. లక్షలాది కార్యకర్తలతోనే పార్టీ పెరిగిందన్నారు. దేశం కోసం.. ప్రజాస్వామ్యం కోసం బీజేపీ ఎంతలా కట్టుబడి పని చేస్తుందో ప్రపంచానికి తెలియజెప్పాల్సిన అవసరం పార్టీమీద ఉందని చెప్పుకొచ్చారు. బీజేపీ చేసే ప్రతి ప్రయత్నాన్ని చెడు దృష్టితో చూస్తున్నారని పేర్కొన్నారన్నారు.