Begin typing your search above and press return to search.

కేంద్రంతో కొట్లాడినా కొత్తగా పోయేదేమీ లేదు

By:  Tupaki Desk   |   26 Aug 2016 7:48 AM GMT
కేంద్రంతో కొట్లాడినా కొత్తగా పోయేదేమీ లేదు
X
నవ్యాంధ్రకు ప్రత్యేక హోదా వచ్చేఅవకాశాల్లేవని తేలిపోయింది. ప్రత్యేక సాయం కూడా అరకొరేనని తెలుస్తోంది. మరోవైపు పోలవరం ప్రాజెక్టకు కూడా కేంద్ర సాయం అంతంతగానే కనిపిస్తోంది. ప్రాజెక్ట్‌ నిర్మాణానికి నాబార్డ్‌ ద్వారా ఇప్పించే రుణానికి కేంద్రం గ్యారంటీర్‌గా మాత్రమే వ్యవహరిస్తుంది. వాస్తవానికి ప్రాజెక్ట్‌కు జాతీయ హోదా కల్పిస్తే మొత్తం వ్యయంలో 90శాతాన్ని కేంద్రం భరించాలి. రాష్ట్ర ప్రభుత్వం తరపున పదిశాతం భరిస్తే సరిపోతుంది. ఇప్పటికే మొత్తం ప్రాజెక్ట్‌ వ్యయంలో సుమా రు 30శాతం వరకు రాష్ట్రం ఖర్చుపెట్టేసింది. ఇలా చూస్తే కేంద్రం తిరిగి 20శాతం సొమ్మును రాష్ట్రానికి తిరిగి ఇవ్వాల్సి ఉంటుంది. కానీ... కేంద్రం కేవలం తన పూచీకత్తుతో రుణం మాత్రమే ఇప్పిస్తోంది. దీంతో కేంద్రం ఇక ఆంధ్రప్రదేశ్‌కు ఎలాంటి ప్రయోజనాలు చేకూర్చే అవకాశాల్లేవని స్పష్టమైంది.

గతంలోనే హోదా రాకుంటే ఎన్‌డిఎ నుంచి వైదొలగాలంటూ ప్రజల్తో పాటు పార్టీలోని ఓ వర్గం కూడా బాబుపై ఒత్తిడి తెచ్చింది. ముందుగా ఇద్దరు మంత్రుల్తో రాజీనామా చేయించండంటూ డిమాండ్లువెల్లువెత్తాయి. అయితే కేంద్రంలో భాగస్వామిగా లేకుంటే కనీసం మోడి అపాయింట్‌మెంట్‌ కూడా దొరికే అవకాశాలుండవంటూ చంద్రబాబు వారికి నచ్చచెబుతున్నారు. రీసెంటుగా కేంద్రం ఆంధ్రప్రదేశ్‌కు 1750కోట్లు మాత్రమే ప్రకటించడంపై చంద్రబాబు కూడా అసంతృప్తిగా ఉన్నట్లు తెలుస్తోంది. మరోవైపు అమరావతికి కూడా ఇంతవరకు 1500కోట్లు మాత్రమే ఆర్ధికసాయంగా అందింది. ఇవికాక విజయవాడ, గుంటూరు నగరాల అభి వృద్దికి చెరో 500కోట్లు ఇచ్చారు. ఇప్పుడు కేంద్రం ఈ మొత్తాన్ని కూడా రాజధాని అభివృద్ధి నిధుల క్రింద జమ చేసినట్లు ప్రకటించింది. దీంతో అమరాతికి కేంద్రం నుంచి ఇప్పటికే 2500కోట్లు జమైనట్లు కేంద్రం లెక్కలు చెబుతోంది. దీంతో ఇక అమరావతి ఖాతాలో ఒక్క రూపాయి కూడా వచ్చే అవకాశాల్లేవు. అయినా చంద్రబాబు మాత్రం కేంద్రాన్ని గట్టిగా నిలదీయలేకపోతున్నారు. మొన్న పార్లమెంటు సమావేశాల సమయంలో హడావుడి చేసినా ఆ తరువాత చల్లబడిపోయారు.

నిజానికి చంద్రబాబు చెబుతున్నట్లుగా మోడీ అపాయింటుమెంటు కూడా దొరక్కపోయే పరిస్థితి వస్తే ఏమవుతుంది. మిగతా రాష్ర్టాలు మోడీకి మోకరిల్లకుండా పాలించడం లేదా? నవీన్‌పట్నాయక్‌, జయలలిత, నితీష్‌కుమార్‌, మమతాబెనర్జీలు కూడా ఎన్‌డిఎలో భాగస్వాములు కారు. వారిలో జయలలిత ఒక్కరే కొంత మోడీకి అనుకూలంగా ఉన్నారు. అయినా వారెవ్వరూ కేంద్రం ముందు తలొగ్గడంలేదు. కానీ... నిబంధనల ప్రకారం రావాల్సిన నిధులు వారికి వస్తున్నాయి. నవ్యాంధ్రకు కూడా అంతకుమించి ఏమీ రావడం లేదు. అలాంటప్పుడు కేంద్రంతో అమీతుమీ తేల్చుకోవడానికి చంద్రబాబు ఎందుకు భయపడుతున్నారో అర్థం కాని పరిస్థితి. కేంద్రంతో కొట్లాడితే కొత్తగా పోయేదేమీ లేదని తెలిసినా చంద్రబాబు మౌనం ఎందుకో అని టీడీపీ శ్రేణుల్లోనూ వినిపిస్తోంది.