Begin typing your search above and press return to search.

మోడీ సర్కార్ పప్పులో కాలేసిందా?

By:  Tupaki Desk   |   5 April 2018 9:53 AM IST
మోడీ సర్కార్ పప్పులో కాలేసిందా?
X
కేంద్రంపై అవిశ్వాస తీర్మానం ఎట్టి పరిస్థితుల్లోనూ చర్చకు రాకుండా.. అన్నా డీఎంకే తమ శక్తివంచన లేకుండా మోడీ సర్కారుకు సహకరిస్తోందనే అభిప్రాయం.. దేశవ్యాప్తంగా ప్రతి ఒక్కరిలోనూ ఏర్పడిపోయింది. సభలో సభ్యులు చేస్తున్న ఆందోళనలు శృతిమించుతున్నాయని భావిస్తే గనుక.. గాడితప్పుతున్నట్లుంటే గనుక.. వారిని సభ నుంచి సస్పెండ్ చేయాలి. అలాంటిదేమీ లేకుండా.. అన్నా డీఎంకే వారి ఆటలకు పాలకపక్షం సహకరించడం - పాలకపక్షం పై అవిశ్వాసం చర్చకు రాకుండా వారు సహకరించడం జరుగుతూ వచ్చింది. ఇలాంటి డ్రామాలను నడిపించడం వల్ల తాము ఎంత మేరకు లాభపడ్డాం అని మోడీ సర్కారు భావిస్తున్నదో తెలియదు గానీ.. వీటి పర్యవసానంగా కర్ణాటక ప్రజలు భాజపాను నమ్మే పరిస్థితిని వారు కోల్పోయారు.

ప్రస్తుతం కర్నాటకలో ఎన్నికలు ఉన్నాయి. అసెంబ్లీ ఎన్నికల ప్రచారం ముమ్మరంగా జరుగుతోంది. ఇలాంటి నేపథ్యంలో అన్నా డీఎంకే చేస్తున్న కావేరీ నదీ బోర్డు ఏర్పాటు ఆందోళనలను తెర వెనుకనుంచి భాజపా నడిపిస్తోందనే అభిప్రాయం కన్నడిగుల్లో ఏర్పడడం భాజపాకు చాలాపెద్ద దెబ్బ అని విశ్లేషకులు భావిస్తున్నారు. దానికి తగినట్లుగా... అన్నాడీఎంకే-భాజపా కుమ్మక్కు అయి కావేరీ బోర్డు వ్యవహారం నడిపిస్తున్నాయనే ప్రచారాన్ని అక్కడ ప్రధానంగా పోటీలో ఉన్న జనతాదళ్ (ఎస్) కూడా ప్రచారం చేయడం మొదలెట్టింది.

తమిళ తంబీల డిమాండుకు కేంద్ర తలొగ్గి బోర్డు ఏర్పాటుచేస్తే గనుక..తీవ్ర పరిణామాలు ఎదుర్కోవాల్సి ఉంటుందంటూ... ఆ పార్టీ అధినేత దేవెగౌడ కేంద్రాన్ని హెచ్చరిస్తున్నారు. అన్నాడీఎంకే తో కలిసి డ్రామాలు ఆడితే కన్నడిగులు హర్షించరని ఆయన హెచ్చరిస్తున్నారు. ఈ విషయంలో భిన్నమైన నిర్ణయాలు వస్తే గనుక.. తమ పార్టీ ఎంపీలంతా రాజీనామాలు చేసి నిరసనలు తెలియజేస్తారనే హెచ్చరిక కూడా చేస్తున్నారు.

మొత్తానికి అన్నాడీఎంకే కావేరీ బోర్డు ఆందోళనల వెనుక భాజపా ఉన్నదనే విషయం కన్నడసీమలో విస్తృతంగా ప్రచారం అవుతోంది. కావేరీ విషయం అనేది తమిళ- కన్నడ రాష్ట్రాల మధ్య తీవ్రమైన అంశం కావడంతో.. తమిళులకు సహకరిస్తున్నారనే ప్రచారం.. భాజపాకు చేటు చేయవచ్చు అని పలువురు భావిస్తున్నారు.