Begin typing your search above and press return to search.

కేసీఆర్ కోర‌గా.. కోర‌గా మోడీ అపాయింట్ మెంట్!

By:  Tupaki Desk   |   13 Jun 2019 12:17 PM IST
కేసీఆర్ కోర‌గా.. కోర‌గా మోడీ అపాయింట్ మెంట్!
X
అన్ని రోజులు ఒకేలా ఉండ‌వు. ఈ విష‌యం తెలంగాణ రాష్ట్ర ముఖ్య‌మంత్రి కేసీఆర్ కు తెలియ‌ని విష‌యం ఏమీ కాదు. కానీ.. అన్ని తెలిసిన‌ప్ప‌టికీ కొన్నిసార్లు ఆయ‌న తొంద‌ర‌ప‌డుతుంటారు. సార్వ‌త్రిక ఎన్నిక‌ల వేళ‌లో కేసీఆర్ వేసుకున్న లెక్క‌ల సంగ‌తి తెలియంది కాదు. దేశ వ్యాప్తంగా మోడీకి వ్య‌తిరేక వాతావ‌ర‌ణం ఉంద‌ని.. ప్రాంతీయ‌ప‌క్షాలు బ‌లంగా ఉన్న వేళ‌.. కాంగ్రెస్‌.. బీజేపీకి బ‌లం రాద‌ని.. దీంతో కీల‌క‌భూమిక ప్రాంతీయ పార్టీల‌దేన‌న్న న‌మ్మ‌కం ఆయ‌న‌ది.

అలాంటి వేళ‌.. తాను కీ రోల్ ప్లే చేయ‌టానికి వీలుగా ఫెడ‌ర‌ల్ ఫ్రంట్ పేరుతో ఆయ‌నో నినాదాన్ని తెర మీద‌కు తేవ‌ట‌మే కాదు.. ప్ర‌త్యేక విమానాల్ని వేసుకొని వివిధ రాష్ట్రాల‌ను చుట్టొచ్చిన సంగ‌తి తెలిసిందే.

కేసీఆర్ ఒక‌లా తలిస్తే.. దేశ ప్ర‌జ‌లు మ‌రోలా త‌లిచారు. అయితే.. ప్ర‌జ‌ల మ‌నోగ‌తాన్ని అర్థం చేసుకోవ‌టంలో త‌ప్పులో కాలేసిన కేసీఆర్‌.. ఎన్నిక‌ల ప్ర‌చార వేళ మోడీని.. అమిత్ షాపైనా నిప్పులు చెరిగారు. ప్ర‌తి చిన్న మాట‌ను జాగ్ర‌త్త‌గా ప‌రిశీలించే మోడీషాలు.. కేసీఆర్ చేసిన వ్యాఖ్య‌ల్ని మ‌న‌సులో రిజిస్ట‌ర్ చేసుకున్న ప‌రిస్థితి.

ఎన్నిక‌ల ఫ‌లితాల‌తో మోడీ తిరుగులేని శ‌క్తిగా మారిన నేప‌థ్యంలో కేసీఆర్ వెన‌క్కి త‌గ్గ‌క త‌ప్ప‌లేదు. త‌న‌ను బ్ర‌తిమిలాడుకోవాల్సిన ప‌రిస్థితి ఉంటుంద‌నుకున్న స్థాయి నుంచి.. తానే సాయం కోసం అర్రులు జాచాల్సి వ‌స్తుంద‌ని కేసీఆర్ ఊహించ‌క‌పోవ‌టంతో ఆయ‌న ఇబ్బంది ప‌డ్డారు. తాను పెట్టుకున్న‌ది మోడీషాల‌తో అన్న విష‌యం మీద క్లారిటీ ఉన్నా.. ఊరించే ప‌వ‌ర్ ముందు కాస్త సాహ‌సం చేశారు.

త‌న ప్లాన్ వ‌ర్క్ వుట్ కాక‌పోవ‌టంతో.. ఫ‌లితాలు వ‌చ్చిన త‌ర్వాత నుంచి ఆయ‌న కేంద్రంతో స్నేహం కోసం ట్రైచేస్తున్నా.. మోడీషాలు ప‌డ‌నివ్వ‌టం లేదంటున్నారు. ఈ వాద‌న‌కు బ‌లం చేకూరేలా మోడీతో భేటీ కోసం కేసీఆర్ ట్రై చేయ‌టం.. అందుకు స్పంద‌న లేక‌పోవ‌టాన్ని చెబుతున్నారు. ఇదిలా ఉంటే.. ఒక‌టికి ప‌దిమార్లు మోడీ డేట్ కోసం కేసీఆర్ చేస్తున్న ప్ర‌య‌త్నాల‌కు తాజాగా ఓకే చెప్పారు. ఈ నెల 16న మోడీతో భేటీకి టైమిచ్చారు.

త‌మ ప్ర‌భుత్వం ప్ర‌తిష్ఠాత్మ‌కంగా తీసుకొని నిర్మించిన కాళేశ్వ‌రం ప్రాజెక్టును ప్రారంభించ‌నున్న నేప‌థ్యంలో.. ఈ ప్ర‌తిష్ఠాత్మ‌క‌మైన ప్రాజెక్టును ప్ర‌ధాని మోడీ చేత‌లు మీదుగా స్టార్ట్ చేయాల‌ని ప్లాన్ చేశారు. కేంద్రం నుంచి సాయం తీసుకోకుండా రాష్ట్రం నిర్మించిన ఈ ప్రాజెక్టును చూప‌టం ద్వారా త‌న ప‌నితీరును ప్ర‌ద‌ర్శించుకోవాల‌ని భావిస్తున్న కేసీఆర్‌.. మోడీతో తాను సున్నం పెట్టుకోవ‌టానికి సిద్ధంగా లేన‌న్న విష‌యాన్ని చెప్పాల‌ని తెలుస్తోంది.

మొత్తమ్మీదా కిందామీదా ప‌డితే కానీ కేసీఆర్ కు మోడీ అపాయింట్ మెంట్ ఫిక్స్ కాలేదంటున్నారు. విశ్వ‌స‌నీయ స‌మాచారం ప్ర‌కారం.. మోడీతో భేటీ అయ్యే వేళ కాళేశ్వ‌రం ప్రాజెక్టు ప్రారంభానికి త‌ప్ప‌నిస‌రిగా రావాల‌న్న మాట‌తో పాటు.. ఎన్నిక‌ల వేళ‌లో తాను చేసిన వ్యాఖ్య‌ల్ని మ‌న‌సులో పెట్టుకోవ‌ద్ద‌ని విన్న‌వించ‌నున్న‌ట్లుగా తెలుస్తోంది. ఇప్ప‌టికే ప‌లుమార్లుకేసీఆర్ తీరును గుర్తించిన మోడీషాలు.. తాజాగా చేసే విన్న‌పాన్ని ప‌రిగ‌ణ‌లోకి తీసుకుంటారా?అన‌్న‌దిప్పుడు ప్ర‌శ్న‌గా మారింది. కేసీఆర్ కు ఇచ్చే స‌మ‌యం.. భేటీ త‌ర్వాత గులాబీ బాస్ చేసే వ్యాఖ్య‌ల ఆధారంగా మీటింగ్ ఎలా జ‌రిగింద‌న్న విష‌యంపై స్ప‌ష్ట‌త రానుంది.