Begin typing your search above and press return to search.

ఢిల్లీ అల్లర్లపై తొలిసారి స్పందించిన మోడీ

By:  Tupaki Desk   |   26 Feb 2020 4:30 PM IST
ఢిల్లీ అల్లర్లపై తొలిసారి స్పందించిన మోడీ
X
రోమ్ తగలబడుతుంటే.. రోమన్ చక్రవర్తి ఫిడేల్ వాయిస్తూ కూర్చున్నాడట.. ఇప్పుడు దేశ రాజధాని ఢిల్లీలో సీఏఏ ఆందోళనలతో 20మంది చనిపోతే దేశ ప్రధాని మోడీ అమెరికా అధ్యక్షుడు ట్రంప్ కు సపర్యలు చేయడంపై ప్రతిపక్షం మండిపడింది. తాజాగా అఖిల భారత కాంగ్రెస్ కమిటీ అధినేత్రి సోనియాగాంధీ విలేకరుల సమావేశం ఏర్పాటు చేసి మరీ అల్లర్లకు మోడీషాలే కారణమని ఆరోపించారు.

సోనియాగాంధీ ఆరోపించిన కొద్ది సేపటికే ఈ వివాదాస్పద అంశంపై ప్రధాని నరేంద్రమోడీ స్పందించారు. రెండు రోజులుగా అట్టుడుకుతూ ప్రాణాలు పోతున్న ఘటనపై ట్విట్టర్ లో కోరారు.శాంతియుత వాతావరణాన్ని నెలకొల్పడానికి సహకరించాలని ఢిల్లీ వాసులకు విజ్ఞప్తి చేశారు. హింసాత్మక పరిస్థితులకు ప్రజాస్వామ్యంలో తావులేదన్నారు. ఢిల్లీ పరిస్థితులపై చర్చించామని ఇవి దురదృష్టకరమన్నారు.

వరుసగా ట్వీట్లు చేసిన ప్రధాని మోడీ శాంతి వచనాలు ఆలపించారు. ఎలాంటి కఠిన పరిస్థితుల్లోనైనా పట్టుసడలని ఐకమత్యాన్ని ప్రదర్శించడం.. శాంతియుత వాతావరణానికి భంగం కలిగించకపోవడం భారతీయుల నైజమని మోడీ హితబోధ చేశారు. దాన్ని నిలబెట్టుకోవాలని సూచించారు. దీని కోసం పోలీసులకు సహకరించాలని సూచించారు. త్వరలోనే సాధారణ పరిస్థితులు నెలకొంటాయని భరోసా ఇచ్చారు.