Begin typing your search above and press return to search.

ప్ర‌పంచంలో ఎత్తైన విగ్ర‌హం -జాతికి అంకితం

By:  Tupaki Desk   |   31 Oct 2018 8:49 AM GMT
ప్ర‌పంచంలో ఎత్తైన విగ్ర‌హం -జాతికి అంకితం
X
బ్రిటిష్ పాల‌న అనంత‌రం ముక్క‌లు ముక్క‌లుగా ఉన్న భార‌తదేశాన్ని త‌న ఉక్కు సంక‌ల్పంతో ఏకం చేసిన సమైక్యతా సారథి స‌ర్దార్ వ‌ల్ల‌భ్‌ భాయ్ ప‌టేల్‌ కు ప్ర‌ధాని న‌రేంద్ర మోదీ నేతృత్వంలోని కేంద్ర‌ ప్ర‌భుత్వం ఘ‌నంగా నివాళుల‌ర్పించింది. ఉక్కు మ‌నిషి ప‌టేల్ జ్ఞాప‌కార్థం గుజ‌రాత్‌ లోని కేవ‌డియాలో న‌ర్మ‌దా నదీ తీరంలో నిర్మించిన ఆయ‌న నిలువెత్తు విగ్రహాన్ని.. ఆయ‌న 143వ జ‌యంతిని పుర‌స్క‌రించుకొని మోదీ బుధ‌వారం ఆవిష్క‌రించారు. విగ్ర‌హం ఎత్తు 182 మీట‌ర్లు. ప్ర‌పంచంలో అత్యంత ఎత్తైన విగ్ర‌హంగా అది రికార్డు సృష్టించింది.

విగ్ర‌హావిష్క‌ర‌ణ కార్య‌క్ర‌మంలో ప్ర‌ధాని మోదీ ప్ర‌సంగిస్తూ.. దేశ సమగ్రతకు కృషి చేసిన పటేల్‌ విగ్రహావిష్కరణ త‌న చేతుల మీదుగా జ‌ర‌గ‌డం త‌న అదృష్టమని అన్నారు. దేశ సమగ్రతే ఆశ - శ్వాసగా భావించిన మహనీయుడు ప‌టేల్ అని గుర్తుచేశారు. కౌటిల్యుడి వ్యూహం - శివాజీ శౌర్య ప్రతాపం మిళితమైన వ్యక్తిగా పటేల్‌ను అభివ‌ర్ణించారు. భారత్ ప్ర‌స్తుతం ఐక్యంగా ఉందంటే అది సర్దార్‌ చొరవేనంటూ కీర్తించారు. గుజరాత్‌ ముఖ్యమంత్రిగా ఉన్నప్పటి నుంచి పటేల్‌ విగ్రహం ఏర్పాటుపై ఆలోచిస్తున్నాన‌ని.. ప్ర‌ధాని అయ్యాక త‌న క‌ల నెర‌వేరింద‌ని పేర్కొన్నారు. ఐక్య‌తా విగ్ర‌హాన్ని జాతికి అంకిత‌మిస్తున్న‌ట్లు ప్ర‌క‌టించారు. విగ్ర‌హావిష్క‌ర‌ణ కార్యక్రమంలో బీజేపీ జాతీయ అధ్యక్షుడు అమిత్‌ షా - గుజరాత్‌ ముఖ్యమంత్రి విజయ్‌ రూపానీ తదితరులు పాల్గొన్నారు.

విగ్ర‌హం విశేషాలివిగో..

* ఎత్తు: 182 మీటర్లు

* ఎక్క‌డ నిర్మించారు? - గుజ‌రాత్‌ లోని సర్దార్‌ సరోవర్‌ డ్యామ్‌ కు 3.5 కిలోమీటర్ల దూరంలో గల సాధు బెట్‌ ఐలాండ్‌.

* నిర్మాణ వ్యయం: రూ.2,989 కోట్లు.

* ప్రాజెక్టు మొత్తం పరిధి 19,700 చదరపు మీటర్లు.

* విగ్ర‌హ‌ నిర్మాణంలో 1,700 టన్నుల కాంస్యం - 1,80,000 క్యూబిక్‌ మీటర్ల సిమెంటు - 18,500 టన్నుల స్టీల్‌ కాంక్రీట్‌ లో కలిపి - 6500 టన్నుల స్టీల్‌ విడిగా వినియోగించారు.

* 3 వేల మంది కార్మికులు - 300 మంది ఇంజినీర్లు ఈ నిర్మాణం కోసం పని చేశారు.

* విగ్రహం ఛాతీ భాగం వరకూ రెండు లిఫ్ట్‌ ల్లో సందర్శకులు వెళ్లవచ్చు. ఆ ప్రాంతంలో ఒకేసారి 200 మంది నిల్చొని పరిసరాలను వీక్షించవచ్చు.