Begin typing your search above and press return to search.

మోదీ కాన్ఫిడెన్స్ డ‌బుల్ అయ్యిందే!

By:  Tupaki Desk   |   30 Aug 2017 10:13 AM IST
మోదీ కాన్ఫిడెన్స్ డ‌బుల్ అయ్యిందే!
X
2014 సార్వ‌త్రిక ఎన్నిక‌ల్లో బీజేపీ ప్ర‌ధాన‌మంత్రి అభ్య‌ర్థిగా బ‌రిలోకి దిగిన నాటి గుజ‌రాత్ ముఖ్య‌మంత్రి... చాలా కాన్ఫిడెన్స్‌గా ప్ర‌చారం సాగించారు. సోష‌ల్ మీడియాను అప్ప‌టిదాకా ఏ ఒక్క‌రూ వినియోగించ‌నంత‌గా వాడేసిన మోదీ... ఎన్నిక‌ల్లో విజ‌య దుందుబి మోగించారు. ఎన్డీఏ మిత్ర‌ప‌క్షాల‌తో క‌లిసే బ‌రిలోకి దిగిన మోదీ... ఏ ఒక్క మిత్ర‌ప‌క్షం మ‌ద్ద‌తు అవ‌స‌రం లేకుండానే బీజేపీనే సొంతంగా ప్ర‌భుత్వాన్ని ఏర్పాటు చేసేంత‌గా సీట్లు సాధించారు. ఈ త‌ర‌హాలో సింగిల్ పార్టీ సంపూర్ణ మెజారిటీ సాధించి అప్ప‌టికి 30 ఏళ్ల‌వుతోంది. అంటే 30 ఏళ్ల త‌ర్వాత సింగిల్ పార్టీ బ‌లంతోనే మోదీ కేంద్రంలో ప్ర‌భుత్వాన్ని ఏర్పాటు చేసేంత మెజారిటీని సాధించేశారు. అయితే మిత్ర‌ధ‌ర్మాన్ని పాటించిన మోదీ... త‌న సొంత పార్టీ బీజేపీతో పాటు ఎన్డీఏ కూటమిలోని పార్టీల‌కు కూడా త‌న కేబినెట్ లో చోటు ఇచ్చారు.

ఇదంతా గ‌త‌మైతే.. బీజేపీ నేతృత్వంలో కేంద్రంలో కొత్త ప్ర‌భుత్వాన్ని ఏర్పాటు చేసిన మోదీ... ఆ త‌ర్వాత పాల‌న‌లో త‌న‌దైన మార్కును చూపుతూ స‌రికొత్త ప‌థ‌కాల‌కు రూప‌క‌ల్ప‌న చేశారు. కేవలం రూప‌క‌ల్ప‌న‌కు మాత్ర‌మే ప‌రిమితం కాకుండా... ఆయా ప‌థ‌కాల‌ను ప‌క్కాగా అమ‌లు చేసే బాధ్య‌త‌ను కూడా ఆయ‌న త‌న భుజ స్కందాల‌పై ఎత్తుకున్నారు. ఈ క్ర‌మంలో బీజేపీ స‌ర్కారు తీసుకున్న ప‌లు కీల‌క నిర్ణ‌యాల‌పై ప్ర‌జ‌ల నుంచి భారీ ఎత్తున వ్య‌తిరేక‌త వెల్లువెత్తినా... ఏమాత్రం బెదురు లేకుండా ముందుకు సాగిన మోదీ... స‌ద‌రు ప‌థ‌కాల వ‌ల్ల ఎంత‌టి లాభ‌ముంద‌న్న విష‌యాన్ని ప్ర‌జ‌ల‌కు చూపించారు. ఫ‌లితంగా 2019 ఎన్నిక‌ల్లోనూ బీజేపీ నేతృత్వంలోని ఎన్డీఏదే గెలుపు అన్న భావ‌న వ‌చ్చేసింది. ఈ భావ‌న‌ను త‌ప్పుబ‌ట్టే ధైర్యం ఇప్పుడు దేశంలోని ఏ ఒక్క‌రికి కూడా లేద‌నే చెప్పాలి. దేశాన్ని సుదీర్ఘ కాలం పాలించిన ఘ‌న‌కీర్తి క‌లిగిన గ్రాండ్ ఓల్డ్ పార్టీ కూడా ఈ భావ‌న‌ను త‌ప్పుబ‌ట్టే ప‌రిస్థితి క‌నిపించ‌డం లేదు.

అంటే వ‌చ్చే ఎన్నిక‌ల్లో మోదీ నేతృత్వంలోనే మ‌రోమారు ఎన్డీఏ స‌ర్కారు కొలువుదీరుతుంద‌న్న మాట‌. ప్ర‌స్తుత టెర్మ్‌ తో పాటు వ‌చ్చే ఐదేళ్ల టెర్మ్ కూడా క‌లుపుకుంటే... మోదీ ఏకంగా ప‌దేళ్ల పాటు ప్ర‌ధానిగా కొన‌సాగుతార‌న్న భావ‌న వినిపిస్తోంది. అయితే మోదీ... ఆ ప‌దేళ్ల పాల‌న‌కే సంతృప్తి ప‌డ‌టం లేదు. ఈ ప‌దేళ్ల‌తో పాటు మ‌రో ఐదేళ్ల పాటు కూడా త‌మ ప్ర‌భుత్వానికి ఎలాంటి ఢోకా లేద‌న్న కోణంలో ఆయ‌న ఉన్నారు. అందులో భాగంగానే ఆయ‌న నిన్న చేసిన వ్యాఖ్య‌లు రాజ‌కీయ విశ్లేష‌కుల‌ను కూడా ఆశ్చ‌ర్యానికి గురి చేస్తున్నాయి. నిన్న రాజ‌స్థాన్‌ లోని ఉద‌య్‌ పూర్‌ లో ప‌ర్య‌టించిన మోదీ... అక్క‌డ రూ.15 వేల కోట్ల విలువ‌తో కొత్త‌గా జాతీయ ర‌హ‌దారుల నిర్మాణానికి భూమి పూజ చేశారు. ఈ సంద‌ర్భంగా ఏర్పాటు చేసిన బ‌హిరంగ స‌భ‌లో మాట్లాడిన మోదీ... తాము ప్రారంభించిన ప‌థ‌కాల‌ను త‌మ ప‌ద‌వీ కాలంలోనే పూర్తి చేస్తామ‌ని స్ప‌ష్టం చేశారు.

మోదీ ప్రారంభించిన జాతీయ ర‌హ‌దారుల ప్రాజెక్టులు పూర్తి కావాలంటే... ఎంత‌లేద‌న్నా 11 ఏళ్లు ప‌డుతుంద‌ట‌. అంటే ఇప్పుడు ప్రారంభించిన స‌ద‌రు ప్రాజెక్టుల‌ను తామే పూర్తి చేస్తామ‌ని చెప్ప‌డంతో... 2019తో పాటు 2024 ఎన్నికల్లో తామే అధికారం చేప‌డ‌తామ‌ని ఆయ‌న చెప్ప‌క‌నే చెప్పారు. ఈ విష‌యంలోని గూఢార్థాన్ని అప్ప‌టిక‌ప్పుడు అర్థం చేసుకోలేని రాజ‌కీయ విశ్లేష‌కులు... ఆ త‌ర్వాత మోదీ ప‌లుకులోని అస‌లు విష‌యాన్ని గ్ర‌హించి... మోదీ కాన్ఫిడెన్స్ పీక్స్‌కు వెళ్లిందంటూ వ్యాఖ్యానించార‌ట‌. 2014 ఎన్నిక‌ల్లో విజ‌యం సాధించిన మోదీ... 2019లోనూ విజ‌యం సాధించే దిశ‌గానే సాగుతున్నారు. మ‌రి 2019లో మ‌రిన్ని కొత్త ప‌థ‌కాల‌తో 2024లో అధికారం చేజిక్కించుకునే విష‌యంలో మోదీ... త‌న‌దైన మార్కును చూపుతార‌న‌డంలో ఎలాంటి సందేహం లేద‌న్న వాద‌న కూడా వినిపిస్తోంది.