Begin typing your search above and press return to search.

మోడీ మ‌ళ్లీ కాపీ క్యాట్ అయ్యారు

By:  Tupaki Desk   |   20 Aug 2016 10:40 AM IST
మోడీ మ‌ళ్లీ కాపీ క్యాట్ అయ్యారు
X
ప్రధానమంత్రి న‌రేంద్ర మోడీ పంద్రాగస్టు ఉపన్యాసంతో ఒక్కసారిగా వెలుగులోకి వచ్చిన గ్రామం నాగ్లా ఫటేలా. ఉత్తరప్రదేశ్‌ లోని హత్రాస్‌ జిల్లాలో వున్న వేలాది గ్రామాల్లో అదీ ఒకటి. ఢిల్లీ నుంచి మూడు గంటల ప్రయాణిస్తే నాగ్లా ఫటేలా గ్రామం చేరుకోవచ్చు. ఈ గ్రామం మొత్తం జనాభా 3,500. ఓటర్లు 900 మంది. అలాంటి గ్రామానికి విద్యుత్‌ సౌకర్యం అందడానికి 70 సంవత్సరాలు పట్టిందని, ఆ ఘనత తమదేనంటూ ప్రధాని మోడీ తన ఉపన్యాసంలో వ్యంగ్యోక్తులు విసిరారు. నిజంగా ఆ గ్రామానికి విద్యుత్‌ మోడీ వచ్చాక వచ్చిందా? అంతకముందే వుందా? అనేది తర్వాత. అసలక్కడ కరెంటు వుందా లేదా అనేదే ప్రధానం. దీనిపై మీడియా అధ్య‌య‌నంలో మోడీ వ్యాఖ్య‌లు అవాస్త‌మ‌ని తేలింది.

నాగ్లా ఫటేలా గ్రామంలో మొత్తం ఇళ్లు 600. వాటిలో కరెంటు లేనివి 450. అందులో దొంగ కరెంటు కనెక్షన్లు వున్నవి 150. కేంద్ర ప్రభుత్వం చేపట్టిన విద్యుదీకరణ పథకంలో భాగంగా కరెంటు ఇవ్వాలనుకున్న గ్రామా ల్లో ఇదీ ఒకటి. అయితే మోడీజీ పేర్కొన్నట్టుగా అక్కడ కరెంటు ఇప్పుడు కొత్తగా రాలేదు. కొన్ని ఇళ్లకు 30 ఏళ్ల కిందటే విద్యుత్‌ సౌకర్యం వుంది. 'బోరు బావుల కోసం వేసిన ట్రాన్స్‌ ఫారం నుంచి 150 ఇళ్ల వాళ్లు కరెంటు లాక్కున్నారు. వీళ్లకు కరెంటు బిల్లు కూడా వేస్తుంటాం అని అలీగఢ్‌ డివిజన్‌ 'దక్షిణాంచల్‌ విద్యుత్‌ వితర‌ణ్‌ నిగమ్‌ లిమిటెడ్‌' (డి.వి.వి.ఎన్‌.ఎల్‌) చీఫ్‌ ఇంజనీర్‌ వి.ఎస్‌.గంగ్వార్‌. గ్రామ పెద్ద యోగేష్‌ కుమార్‌ మాటల్లో అసలు వాస్తవం ఏంటో తెలుస్తుంది. 'నిజానికి ప్రభుత్వం డి.వి.వి.ఎన్‌.ఎల్‌ పథకం కింద మా గ్రామానికి విద్యుత్‌ సౌకర్యం కల్పించేందుకు కావాల్సిన ఏర్పాట్లన్నీ చేసింది. కరెంటు స్తంభాలు పాతి - తీగలు లాగి - మీటర్లు పెట్టారు. కరెంటు రావడమే మిగిలింది. అయితే బోరుబావుల కోసం ఏర్పాటు చేసిన ట్రాన్స్‌ ఫార్మర్‌ నుంచి 150 ఇళ్లకు కరెంటు అందుతోంది. వారు రెండు నెలలకోసారి రు.395 చెల్లిస్తారుస అని స్ప‌ష్టం చేశారు.

మ‌రోవైపు ప్రధాన మంత్రి కార్యాలయం ఆగస్టు 15వ తేదీన వెబ్‌ సైట్‌ లో ఉంచిన ఫొటోలు ఆస‌క్తిక‌రంగా మారింది. పీఏంఓ పేర్కొన్న ప్రకారం టీవీలో స్వాతంత్య్ర దినోత్సవ వేడుకలను వీక్షిస్తున్న నాగ్లా ఫటేలా గ్రామస్తుల ఫొటోల‌ను ఉంచారు. పైగా వాటి కింద ''నాగ్లా ఫటేలా గ్రామస్తులు తొలిసారిగా స్వతంత్ర దినోత్సవ వేడుకలను వీక్షిస్తున్నారు'' అంటూ మోడీ ట్వీట్‌ కూడా చేశారు. అయితే ఆ గ్రామస్తుల స్పందన మరోలా వుంది. 'ఇవి మా గ్రామం ఫొటోలు కావు. బూరలు కట్టిన ఫొటో చూడ్డానికి నాగ్లా సింధీ గ్రామం లాగుంది' అంటున్నారు గ్రామ పూర్వపు పెద్ద దేవేంద్ర సింగ్‌. ఆ తర్వాత పీఎంఓ సదరు ఫొటోలను తొలగించడం కొసమెరుపు.

ప్రధాని గొప్పలు - స్థానికుల మాటలు పరిశీలించిన మీదట విమ‌ర్శ‌కులు స్పందిస్తూ ''నాగ్లా ఫటేలాలో కరెంటు ఎప్పటి నుంచో ఉంది. అయితే అది బోరు బావులకు కేటాయించినది. కాకపోతే కొందరు అక్రమంగా దాన్ని గృహావసరాలకూ వాడుకుంటూ బిల్లులు చెల్లిస్తున్నారు. అంటే ప్రధాని చెప్పినట్టు అక్కడ తొలిసారిగా విద్యుత్‌ వెలుగులను ఆస్వాదించడమూ లేదు. పీఎంఓ పోస్ట్‌ చేసిన ఫొటోలూ ఆ గ్రామానివి కావు. ప్ర‌ధాన‌మంత్రి ఎందుకిలా ప్ర‌చారం చేసుకుంటారు'' అంటూ ఆశ్చ‌ర్యం వ్య‌క్తం చేస్తున్నారు.