Begin typing your search above and press return to search.

ఎన్నిక‌ల ప్ర‌చారంలో చావ‌టాలు..చంపటాలు ఏంది?

By:  Tupaki Desk   |   2 May 2019 5:53 PM IST
ఎన్నిక‌ల ప్ర‌చారంలో చావ‌టాలు..చంపటాలు ఏంది?
X
గ‌డిచిన రెండు ద‌శాబ్దాల్లో జ‌రిగిన సార్వ‌త్రిక ఎన్నిక‌ల్లో ఎప్పుడూ లేని రీతిలో అధికార‌.. విప‌క్ష నేత‌లు నోటికి ప‌ని చెప్ప‌ట‌మే కాదు.. హ‌ద్దులు దాటేస్తున్నారు. ఒక‌రిపై ఒక‌రు వ్య‌క్తిగ‌త విమ‌ర్శ‌ల‌కు వెళ్ల‌ట‌మే కాదు.. చావ‌టం.. చంప‌టం లాంటి మాట‌ల్ని అల‌వోక‌గా వాడేస్తున్నారు. విషాద‌క‌ర‌మైన విష‌యం ఏమంటే.. ఈ త‌ర‌హా వ్యాఖ్య‌లు విప‌క్షాల‌కు చెందిన కొంద‌రు నేత‌లు అంటుంటే.. దానికి ప్ర‌ధాని స్పందించ‌టం.. తానున్న హోదాకుండే మ‌ర్యాద‌ను ప‌క్క‌న పెట్టేసి.. విప‌క్షాల‌పై విరుచుకుప‌డుతున్నారు.

ఇటీవ‌ల కాంగ్రెస్ నేత ఒక‌రు ఎన్నిక‌ల స‌భ‌లో మాట్లాడుతూ.. మోడీ మీద వ్యంగ్య వ్యాఖ్య ఒక‌టి చేశారు. మోడీని ఒక త‌న్ను త‌న్నండి.. అదెంతలా ఉండాలంటే.. ఆ దెబ్బ‌కు మోడీ స‌రిహ‌ద్దుల అవ‌త‌ల ప‌డి చావాల‌ని వ్యాఖ్యానించారు. ఈ వ్యాఖ్య హ‌ద్దులు దాటేదిగా ఉంద‌న్న మాట‌ను కాద‌న‌లేం. అలా అని మాట‌కు మాట అన్న రీతిలో.. తీవ్ర వ్యాఖ్య‌కు మ‌రింత తీవ్ర‌మైన కామెంట్ స‌మాధాన‌మ‌న్న‌ట్లుగా చెప్ప‌టం అర్థం లేనిది.

తాజాగా మోడీ నిర్వ‌హించిన ప్ర‌చార స‌భ‌లో ఆయ‌న మాట్లాడుతూ.. మోడీ అంటే కాంగ్రెస్ వారిలో ఎంత ద్వేష‌భావం ఉందో తెలుసా? అంటూ.. వారు న‌న్ను చంపేయాల‌ని క‌ల‌గంటున్నార‌ని ఆరోపించారు. భావోద్వేగాన్ని త‌ట్టి లేపే విష‌యంలో మోడీకి ఉన్న నైపుణ్యాన్ని ఎవ‌రూ కాద‌న‌లేరు. విప‌క్షాల‌ను టార్గెట్ చేసే పేరుతో.. విప‌క్ష నేత‌ల స్థాయికి ప్ర‌ధాని దిగి వ్యాఖ్య‌లు చేయ‌టం అర్థం లేనివిగా చెప్ప‌క త‌ప్ప‌దు.

ఇప్ప‌టికే త‌న మాట‌ల‌తో ప్ర‌ధాని ప‌ద‌వికి మోడీ వ‌న్నె కోల్పోయేలా చేస్తున్నార‌న్న అప‌వాదు ఉన్న ఆయ‌న‌.. ఇప్పుడు అంత‌కు మించి అన్న‌ట్లుగా వ్యాఖ్య‌లు చేయ‌టం అర్థం లేనివి. రాజ‌కీయ ప్ర‌త్య‌ర్థులు త‌న‌పై వ్యంగ్య వ్యాఖ్య‌ల్ని చేస్తే.. వాటిని తెలివిగా తిప్పి కొట్టాలే కానీ.. వాటిని సీరియ‌స్ వ్యాఖ్య‌లుగా మార్చే మోడీ తీరు స‌రికాద‌ని చెప్ప‌క త‌ప్ప‌దు. రిథ‌మ్ బాగుండాల‌న్న ఉద్దేశంతో మోడీ మాట‌లు వాస్త‌వాన్ని వ‌దిలేసేలా మాట్లాడ‌టం క‌నిపిస్తుంది.

55 ఏళ్ల వంశ పాల‌న బాగుందా? 55 నెల‌ల ఛాయ్ వాలా పాల‌న బాగుందా? అంటూ ఆయ‌న ప్ర‌శ్నిస్తున్న ప్ర‌శ్న‌లోనే.. మోడీ తీరుకొట్టొచ్చిన‌ట్లుగా క‌నిపిస్తుంద‌ని చెప్పాలి. ఎందుకంటే.. ఈ నెలాఖ‌రుతో మోడీ మాష్టారి 60 నెల‌ల పాల‌న ముగుస్తుంది? అంటే.. 59 నెల‌ల పాల‌న‌ను 55 నెల‌ల పాల‌న‌గా చెప్పుకోవ‌టం దేనికి? చూసేందుకు చిన్న విష‌యంలా క‌నిపించినా.. త‌న పాల‌నా కాలాన్ని ప్ర‌ధానే స్వ‌యంగా త‌ప్పు చెప్ప‌టం ఏమిటి? ఇది దేనికి నిద‌ర్శ‌నం?