Begin typing your search above and press return to search.

జగన్ ను పొగడ్తలతో ముంచెత్తి.. బాబును తిట్టేసి.. ఈ ప్రయాస ఏంది స్వామి?

By:  Tupaki Desk   |   2 April 2022 12:30 PM GMT
జగన్ ను పొగడ్తలతో ముంచెత్తి.. బాబును తిట్టేసి.. ఈ ప్రయాస ఏంది స్వామి?
X
చిన్న పదవి అయినప్పటికీ ఒకసారి దాని రుచి చూసిన తర్వాత దాన్ని విడిచిపెట్టటం అంత తేలికైన విషయం కాదు. అలాంటిది ఏపీ రాష్ట్రానికి ఉప ముఖ్యమంత్రిగా వ్యవహరించటానికి మించిన లక్ ఇంకేం ఉంటుంది. అలాంటి పదవిని చేపట్టిన తర్వాత.. పదవీ కాలం మొత్తం ఆ పదవిలో ఉండకుండా మధ్యలో చేజారిపోయే పరిస్థితి వస్తే.. ఎంత ఫస్ట్రేషన్ చుట్టుముడుతుందన్న విషయాన్ని ఏపీ డిప్యూటీ సీఎం నారాయణ స్వామి మాటల్ని చూస్తే ఇట్టే అర్థమైపోతుంది.

తన కొత్త మంత్రివర్గాన్ని నియమించుకోవటానికి ఈ నెల 11ను ముహుర్తంగా సీఎం జగన్ డిసైడ్ అయినట్లుగా చెబుతున్నవేళలో.. మంత్రి పదవులు పోయే అవకాశాలు ఎక్కువగా ఉన్న వారంతా తమ చివరి ప్రయత్నాల్ని ముమ్మరం చేస్తున్నారు. గతానికి మించి మరింత ఘాటుగా విపక్ష నేత చంద్రబాబును.. ఆయన కుమారుడు లోకేశ్ ను ఇష్టం వచ్చినట్లుగా తిట్టిపోస్తున్న వైనం ఎక్కువ అవుతోంది. తాజాగా ఈ కోవలోకే వస్తుంది డిప్యూటీ సీఎం నారాయణ స్వామి కోపం.

ఇటీవల కాలంలో ఆయన చంద్రబాబు మీద అదే పనిగా కాలు దువ్వుతున్నారు. చెలరేగిపోతున్నారు. ఏ చిన్న అవకాశం లభించినా వదిలిపెట్టకుండా విమర్శలతో ఉతికి ఆరేస్తున్నారు.ఇంతకాలం పెద్ద మనిషిలా ఉండి.. హుందాగా వ్యవహరించిన ఆయన.. సరిగ్గా పదవి నుంచి తొలిగే సమయం అసన్నమైన వేళలో.. తన తీరుకు భిన్నంగా ఇప్పుడు ఒంటికాలి మీద విరుచుకుపడుతున్న తీరు చూస్తుంటే.. చంద్రబాబు..ఆయన కుమారుడ్ని ఎంత పచ్చిగా తిడితే.. అంతలా సీఎం జగన్ మనసు దోచుకోవచ్చన్న భావనతో ఉన్నట్లుగా కనిపిస్తోంది. అదే సమయంలో జగన్ ను ఇప్పటివరకు ఎవరూ పొగడనంత భారీగా పొగిడేయాలన్న ఆలోచనతో ఆయన ఉన్నట్లుగా ఉంది. ఇందుకు తగ్గట్లే ఆయన తాజా వ్యాఖ్యలు ఉన్నాయి.

తాజాగా ఆయన తిరుమల శ్రీవారిని దర్శించుకొని బయటకు వచ్చిన తర్వాత సీఎం జగన్ ను ఆకాశమే హద్దు అన్నట్లుగా పొగడ్తలతో ముంచెత్తారు. దేవుని అనుగ్రహం.. ప్రజల ఆశీస్సులు ఉన్నంతకాలం జగన్ సీఎంగా ఉంటారన్న ఆయన.. అన్నీ అనుకూలిస్తే 15 ఏళ్ల తర్వాత సీఎం జగన్ ఏకంగా ప్రధానమంత్రి అవుతారంటూ సంచలన ప్రకటన చేశారు. ముఖ్యమంత్రి జగన్ కు మరింత మనో ధైర్యాన్ని ఇవ్వాలని శ్రీవారిని కోరుకున్నట్లుగా నారాయణ స్వామి వెల్లడించారు.

వేషాలు వేసుకునే వారురాజకీయాలకు పనికి రారని.. ఎన్టీఆర్ పై పోటీ చేస్తానని నాడు చంద్రబాబు చెప్పిన మాటల్ని గుర్తు చేసిన ఆయన.. ఇప్పుడు అదే ఎన్టీఆర్ స్థాపించిన టీడీపీకి వారసుడిగా చెలామణి అవుతున్నారన్నారు. బాబుకు దమ్ము.. ధైర్యం ఉంటే కొత్త పార్టీ పెట్టి పోటీ చేయాలన్న నారాయణ స్వామి.. కొత్త పార్టీ పెట్టి చంద్రబాబు గెలిస్తే.. తాను రాజకీయాల నుంచి తప్పుకుంటానని ఆయన సవాలు విసరటం చూస్తే.. ఏ మాత్రం సాధ్యం కాని సవాళ్లను విసిరిన స్వామి ఇప్పట్లో రాజకీయాల నుంచి రిటైర్ అయ్యే ఆలోచన లేదన్న విషయాన్ని చెప్పకనే చెప్పేశారని చెప్పాలి.ఇంతలా ప్రయాస పడుతున్న నారాయణ స్వామి విషయంలో జగన్ నిర్ణయం ఏ రీతిలో ఉంటుందో చూడాలి.