Begin typing your search above and press return to search.

నారాయణ స్వామి వంతు.. ఎన్టీఆర్.. ఏఎన్ఆర్.. చిరు ఫ్యామిలీలపై పడ్డాడు

By:  Tupaki Desk   |   2 Jan 2022 4:49 AM GMT
నారాయణ స్వామి వంతు.. ఎన్టీఆర్.. ఏఎన్ఆర్.. చిరు ఫ్యామిలీలపై పడ్డాడు
X
విమర్శలు చేయటం తప్పేం కాదు. మిగిలిన రంగాలతో పోలిస్తే.. రాజకీయాల్లో విమర్శల జోరు ఎక్కువగా ఉంటుంది. ఇక.. నేతలు నిత్యం చేసే పనే అది. అయితే.. ఇలా విరుచుకుపడటం బాగానే ఉన్నా.. దేని మీద విమర్శలు చేయాలి? దేని మీద చేయకూడదన్న విచక్షణ చాలా అవసరం. దేశంలో మరే రాష్ట్రంలోనూ లేని విధంగా సినిమా టికెట్ల ధరల్ని భారీగా తగ్గించటం అనే కంటే.. అడ్డంగా కోసేసినట్లుగా చేసిన వైనం సంచలనంగా మారింది. సినిమాల్ని తీసునోడి సంగతి తర్వాత.. సినిమాను ప్రదర్శించే థియేటర్ వాడికి.. కరెంటు ఖర్చులకు కూడా రాని విధంగాటికెట్ల ధరల్ని తగ్గించిన వైనంపై విస్మయం వ్యక్తమవుతోంది. సాధారణంగా ధరల్ని పెంచినప్పుడు ప్రజల్లో వ్యతిరేకత వ్యక్తమవుతుంది. ఏపీలోని జగన్ సర్కారు గొప్పతనం ఏమంటే.. ధరల్ని తగ్గించి విమర్శల్ని మూటకట్టుకుంటున్నారు. వ్యతిరేకతను ఎదుర్కొంటున్నారు.

సినిమా టికెట్ల ధరల్ని తగ్గించారు సరే.. పెట్రోల్.. డీజిల్ ధరల్ని ఎందుకు తగ్గించరు? మద్యం ధరల్ని ఎందుకు తగ్గించరు? అంటూ ప్రశ్నిస్తున్న వైనానికి సమాధానం చెప్పలేక కిందా మీదా పడుతున్న పరిస్థితి. ఈ అంశంపై ఇప్పటికే కొందరు వైసీపీ నేతలు మాట్లాడటం.. వారి వ్యాఖ్యలపై సోషల్ మీడియాలోనూ.. వాట్సాప్ గ్రూపుల్లోనూ భారీగా పంచ్ లు పడుతున్నాయి. ఇలాంటివేళ.. తగదునమ్మా అంటూ ఏపీ డిప్యూటీ సీఎం నారాయణస్వామి గొంతు విప్పారు. ఇప్పటికే సినిమా టికెట్ల మీద మాట్లాడి అభాసుపాలైన వారి జాబితాను మరింతగా పెంచాలన్నట్లుగా నారాయణస్వామి మాటల తీరు ఉందని సామాన్య.. పేద ప్రజలకు వినోదం కల్పించేందుకు సినిమా టికెట్ల ధరల్ని తగ్గిస్తే.. ప్రభుత్వంపై విరుచుకుపడటం అన్యాయమని పేర్కొన్నారు.

ఈ మాటను చెబుతున్న నారాయణస్వామి.. చంద్రబాబు హయాంలో తీసుకొచ్చిన ‘అన్న క్యాంటీన్ల’ను మూసేసిన విషయాన్ని మర్చిపోతున్నారు. కేవలం రూ.5 ఖర్చుతో టిఫిన్.. కడుపు నిండా భోజనం పెట్టిన వైనాన్ని ఎందుకు తీసేసినట్లు? పేదలకు.. సామాన్యులకు తక్కువ ధరకే నాణ్యమైన ఆహారం లభిస్తుంది కదా? అదెందుకు తీసేసినట్లు? అన్నది మరో ప్రశ్న. ఇలాంటి వాటికి సమాధానాలు ఇవ్వని నారాయణస్వామి.. అందుకు భిన్నంగా సినిమా వారసత్వం గురించి సంచలన వ్యాఖ్యలు చేశారు.

ఎన్టీఆర్.. ఏఎన్నార్.. చిరంజీవి కుటుంబాల వారి హవానే సినిమా రంగంలో నడుస్తుందని పేర్కొన్నారు. సినిమా వారసత్వ హవాను కొనసాగిస్తున్నారు. మిగిలి కులాల్లో ఎంత టాలెంట్ ఉన్నా.. వారిని ఎదగనీయకుండా చేసే కార్యక్రమం కొనసాగుతోందన్నారు. ఒకవేళ అదే నిజమని అనుకుందాం.. చిరు ఫ్యామిలీలో బన్నీకి ఉన్నంత క్రేజ్ సాయి ధరమ్ తేజ్ కు ఎందుకు లేదు? నాగ్ కున్న మార్కెట్ ఆయన ముద్దుల కొడుకు అఖిల్ కు లేదు కదా? అంతదాకా ఎందుకు ఏఎన్నార్ ఫ్యామిలీలో సుమంత్ మార్కెట్ ఎంత? ఆయనకున్న పాపులార్టీ ఎంతన్నది ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు.

సినిమాలో కొన్ని కుటుంబాల వారసత్వం నడుస్తున్న మాటే నిజమైతే.. ఇప్పుడు చెప్పిన వారంతా చెలరేగిపోవాలి కదా? వారికి భారీ అభిమానగణం ఉండాలి కదా? అదేమీ లేదంటే.. సినిమాల్లోకి రావటానికి ఏపీ డిప్యూటీ సీఎం చెప్పినట్లుగా ఎంట్రీకి ఇబ్బంది ఉండదు. కానీ.. నిలదొక్కుకోవటం మాత్రం వారి చేతుల్లో ఉండదు. అందుకు ఎన్టీఆర్ కుటుంబం నుంచి వచ్చిన నటులే నిదర్శనమన్నది మర్చిపోకూడదు.

ఆ మాటకు వస్తే.. రాజకీయ నేతల కొడుకులు.. వారి కుటంబ సభ్యులు పెద్ద ఎత్తున రాజకీయాల్లోకి రావటం తప్పే కదా? మరి.. ఆ మాటను నారాయణ స్వామి ఎందుకు ప్రస్తావించరు? ఎవరిదాకానో ఎందుకు? ఆయన ఇన్ని మాటలు మాట్లాడింది.. ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి మనసును దోచుకోవటానికే కదా? మరి.. ఆయన మాత్రం రాజకీయ వారసత్వంగా వచ్చిన వారే కదా? డిప్యూటీ సీఎం మాటల్నే తీసుకుంటే.. ఏపీలో ఇప్పటివరకు ముఖ్యమంత్రులుగా పని చేసింది రెండు కులాల వారే. చాలా ప్రత్యేక పరిస్థితుల్లో మాత్రం వేరే వారికి వచ్చింది? బోడి సినిమాకే ఇన్ని లెక్కలు చెబుతున్న పెద్ద మనిషి.. రాజకీయాల్లోని వారసత్వం గురించి కూడా మాట్లాడాలి కదా? ఆ ప్రస్తావన ఎందుకు తేనట్లు?